ఊట్కూర్, మక్తల్ డిసెంబర్ 13 : నీళ్ల చారు.. ఉడికీ ఉడకని అన్నం.. అపరిశుభ్రంగా ఉన్న వంట గదులు, కుళ్లిపోయిన కూరగాయలు ఇలాగేనా వి ద్యార్థులకు అందించే నాణ్యమైన ఆహారమంటూ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు అధికారులు, వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో కొన్నాళ్లుగా గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలతో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యుల బృందం శుక్రవారం మక్తల్ మండలంలో పర్యటించింది. ముందుగా గుడిగండ్ల ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనంపాటు వసతులను పరిశీలించారు. నాసిరకం అల్లం పేస్టు, నాణ్యత లేని ఉప్పు, కారం, పసుపును చూసి వంట ఏజన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లం పేస్టు నుంచి దుర్గం ధం వస్తుందని.. ఇలాంటి వాటితో వండితే ఎలాగని ప్రశ్నించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలని, పాఠశాలలో ఫిర్యాదు బాక్స్‌ను ఏర్పాటు చేయాలని హెచ్ఎం హిమబిందును ఆదేశించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను పరిశీలించారు. జక్లేర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీళ్ల చారు, బిరుసుకుపోయిన అన్నం వడ్డిస్తున్నట్లు గుర్తించారు. పామాయిల్ వాడుతున్నారని, ఇలాంటి వంటలను విద్యార్థులు ఎలా తింటారని ప్రశ్నించారు. మధ్యాహ్నం 2:15 గంటలకు మక్తల్ జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు. బూజు, కుళ్లిపోయిన సోర కాయలను గుర్తించి పార వేయించారు.
వంటలు ఏమాత్రం నాణ్యత, రుచిగా లేవన్నారు. ఇకపై నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ రేవతికి సూచించారు. అనంతరం స్థానిక ఎల్లమ్మకుంటలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంతోపాటు బరువులను పరిశీలించారు. వారం రోజుల నుంచి గుడ్లు సరఫరా లేదని గుర్తించారు. పట్టణంలోని గంజ్ స మీపంలో చౌకధర దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం స్టాక్‌ను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, బృందం సభ్యులు గోవర్ధన్‌రెడ్డి, భారతి, జ్యోతి, శారద మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా, బృందం సభ్యులు గుడిగండ్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మధ్యాహ్నం 12:40 గంటలకు, జక్లేర్ జెడ్పీహెచ్ పాఠశాలను మధ్యాహ్నం 1:30 గంటలకు సందర్శించారు. వారు వచ్చే వరకు విద్యార్థులకు భోజనాలను వడ్డించకుండా అలాగే ఉంచారు.
మండలంలోని జక్లేర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ బృందం సభ్యులను వంట ఏజన్సీలు నిలదీశాయి. రెండు నెలల నుంచి తమకు వంట బిల్లులు రాలేదని, వం ట మనుషులకు నెలకు రూ.3వేలు ఇవ్వాల్సి ఉం డగా, రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, గుడ్డు ధర రూ.7 ఉండగా మీరిచ్చేది దేనికీ సరిపోవడం లేదని నిలదీశారు. ఇందుకు స్పందించిన కమిషన్ బృందం మీరు ఎన్నాళ్ల నుంచి వంట చేస్తున్నారని ప్రశ్నించారు. 20ఏండ్ల నుంచి చేస్తున్నామని చెప్పడంతో అప్పటి నుంచి రాని నష్టం ఇప్పుడే వచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంత నష్టం అనిపిస్తే మానుకోవాలన్నారు. బృందం వెంట ఆర్డీ వో రాంచందర్, డీఈవో గోవిందరాజులు, సివిల్ సప్లయ్ జిల్లా అధికారి దేవదానం, డీడబ్ల్యూవో జయ, సీడీపీవో సరోజిని, డీఆర్డీవో మొగులప్ప, తాసీల్దార్ సతీశ్‌కుమార్, ఎంపీడీవో రమేశ్, మిడ్ డే మీల్స్ అధికారి యాదయ్యశెట్టి పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, డిసెంబర్ 13 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ ఉన్నత పాఠశాలను శుక్రవారం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి బృందం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి నాణ్యమైన బియ్యం అందించాలని హెచ్ఎం దత్తురావును ఆదేశించారు. పాఠశాలకు గుడ్లు సరిగా సరఫరా కాకపోవడంపై ప్రశ్నించారు. మెనూ ప్రకారం భోజనం పెట్ట డం లేదని విద్యార్థులు చెప్పడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బిల్లులు రావడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్, డీ ఈవో గోవిందరాజులు వారి వెంట ఉన్నారు. కాగా, అలాగే ఉదయం పరీక్షల విభాగం అధికారి రాజేంద్రకుమార్ పాఠశాలను తనిఖీ చేసి బియ్యం నిల్వలను పరిశీలించారు. నాణ్యతగా లేకపోవడంతో వెం టనే బియ్యం మార్చాలని నిర్వాహకులకు సూ చించారు. మున్సిపల్ కమిషనర్ సునీత, మండల ప్రత్యేకాధికారి రంగారావు, తాసీల్దార్ అమరేందర్కృష్ణ, డీటీ రామకృష్ణ, కాళప్ప, ఆర్ఐ ప్రతాప్‌రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
నారాయణపేట టౌన్, డిసెంబర్ 13 : ఆహార భద్రత హక్కుకు భంగం కలుగకుండా చూడాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో భాగం గా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పర్యవేక్షిస్తుందన్నారు. మక్తల్ మండలంలో కమిషన్ సభ్యులతో కలిసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, అంగన్వాడీలు, వసతి గృహాలు, నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థకు సంబంధించి తనిఖీలు నిర్వహించామన్నారు. ఒకటి రెండు చోట్ల విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆహారం విషయంలో మెనూ ప్రకారం లేకపోవడంపై సంబంధిత సంక్షేమ వసతి గృహ సంరక్షకులు, పాఠశాలల హెచ్ఎంలు లోపాలను సరిచేసుకొని నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం 2013ను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మెనూ ప్రకా రం హాస్టళ్లలో పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ చేస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు గోవర్దన్‌రెడ్డి, రంగినేని శారద, బుక్యజ్యోతి, భారతి, అదనపు కలెక్టర్ బెన్శాలామ్, ఆర్డీవో రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.