చదివింది పదో తరగతే.. అయినా తన అందం, మాటతీరుతో అందరినే ఇట్టే ఆకట్టుకునే తీరు ఐశ్వర్యది. సోషల్ మీడియా ప్రభావంతో మరి కొంతమందితో పరిచయం పెంచుకున్న ఆమె ఒకరికి తెలియకుండా మరొకరితో ఫోన్లో చాటింగ్‌లు చేస్తూ వలపు వల విసురుతోంది కిలేడీ. అమాయకురాలిలా ఉంటూ కట్టుకున్నోడినే కడతేర్చింది..
గద్వాల, జూన్ 24 : జిల్లా కేంద్రంలోని జమ్మిచేడుకు చెందిన సుజాతకు భర్త లేడు. ఆమె కర్నూల్ జిల్లా కల్లూరులో ఉంటూ ఓ ప్రైవేట్ బ్యాంకులో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. ఈ క్రమంలోనే సుజాతతో బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న తిరుమల్‌రావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. సుజాత బ్యాంక్‌కు వెళ్లని సమయంలో తన కూతురు ఐశ్వర్య విధులు నిర్వహించడానికి వెళ్లగా, ఈ క్రమంలోనే తిరుమల్‌రావు ఓ వైపు తల్లితోపాటు కూతురితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఇది సుజాతకు నచ్చకపోవడంతో ఐశ్వర్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నది. గద్వాలకు చెందిన తేజేశ్వర్‌తో సంబంధం కుదుర్చుకొని నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి ఇష్టం లేని ఐశ్వర్య తిరుమల్‌రావుతో 15 రోజులపాటు వెళ్లిపోయింది. ఆ సమయంలోనే తిరుమల్‌రావుకు ఐశ్వర్య ఓ ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. నీ భార్యను చంపిన తర్వాతే మనిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పడంతో తిరుమల్‌రావు అందుకు అంగీకరించాడు. 15రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చారు.
తన భార్యను చంపడానికి తిరుమల్‌రావు రూ.2లక్షలకు సుఫారీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇది కుదరకపోవడంతో ఏం చేయాలో తోచక ప్లాన్-2 కిలేడి అమలు చేసింది. మొదట నిశ్చితార్థం అయిన తేజేశ్వర్‌తో లైన్ కలిపింది. కట్నం విషయంలో మా అమ్మకు, నాకు గొడవ జరగడం వల్ల మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని, నీవంటే నాకు ఇష్టం, నేను ఎవరి వెంబడి వెళ్లలేదని తేజేశ్వర్‌ను నమ్మించింది. తేజేశ్వర్ తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా మే 18వ తేదీన బీచుపల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు.
పళ్లైన తర్వాత కూడా ఐశ్వర్య ప్రియుడిని మరిచి పోలేకపోయింది. దీంతో ప్లాన్-3 అమలు చేశారు. తేజేశ్వర్‌ను చంపేస్తే ఇద్దరం ఎక్కడికైనా వెళ్లి హాయిగా జీవిద్దామని తిరుమల్‌రావు, ఐశ్వర్య మాట్లాడుకొని తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశారు. తేజేశ్వర్ కదలికలు కనుగొనడానికి ఐశ్వర్య తన భర్త మోటర్ సైకిల్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. వివరాలను ప్రియుడు తిరుమల్‌రావుకు చేరవేసేది. తేజేశ్వర్‌ను చంపడానికి కర్నూల్‌కు చెందిన నగేశ్, రాజు, పరశురాంకు తిరుమల్‌రావు రూ.2లక్షలకు సుఫారీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌తో తమ బంధువులకు సంబంధించిన పొలం సర్వే చేసేది ఉందని, వెళ్లాలని చెప్పింది.
ఇది నమ్మిన తేజేశ్వర్ వారి కారులో వెళ్లాడు. గద్వాల మండలం పూడురు శివారులో పొలం సర్వే చేసిన అనంతరం కారులో వెళ్తుండగా వెనక ఉన్న రాజు, పరశురాం తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేయగా, కారు నడుపుతున్న నగేశ్ తేజేశ్వర్ కడుపులో పొడిచినట్లు సమాచారం. ఈ పెనుగులాటలో నగేశ్ చేతికి బలమైన గాయమై కుట్లు పడినట్లు తెలిసింది.
హత్య చేసిన తర్వాత ఈ సమాచారం తిరుమల్‌రావుకు చెప్పగా, కర్నూల్ బైపాస్‌లో తిరుమల్‌రావు నగేశ్, రాజు, పరశురాంను కలిసి తేజేశ్వర్ చనిపోయాడని తెలుసుకున్న తర్వాత వారికి రూ.2లక్షలు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. తిరుమల్‌రావు బ్యాంక్ ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. పాణ్యం సమీపంలో తన రియల్ వెంచర్ ఉండడంతో అక్కడ తేజేశ్వర్ శవాన్ని పూడ్చాలని భావించారు. కుదరకపోవడంతో పాణ్యం సమీపంలో ఉన్న చెరువులోని జమ్ములో పడేశారు.
హత్య తర్వాత లడక్ వెళ్లాలని ప్లాన్..
తేజేశ్వర్‌ను హత్య చేసిన తర్వాత తిరుమల్‌రావు, ఐశ్వర్య లడక్‌కు వెళ్లి కొన్ని రోజులపాటు అక్కడే ఉండి తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బ్యాంక్ ఉద్యోగి అయినా తిరుమల్‌రావు లడక్ వెళ్లడానికి బ్యాంక్‌లో రూ.20లక్షల హోం లోన్ తీసుకున్నట్లు తెలిసింది. తేజేశ్వర్ మిస్ అయ్యాడని అతడి తల్లిదండ్రులు గద్వాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఐశ్వర్యను విచారించగా అసలు విషయం బయటపడింది. ఒక హత్య మూడు కుటుంబాల్లో చిచ్చు రేపింది.