మాగనూర్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ( Agitation) ఆగదని టీజీఈజేఏసీ ( TGEJAC ) నారాయణపేట జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాగనూరులో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించడంతో పాటు, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఉద్యమం అవసరం ఉండదని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఉద్యమం చేయడం లేదని, ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే పోరాడుతున్నామని నరసింహారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాగనూరు తహసీల్దార్ రెహమాన్, ఎంపీడీవో శ్రీనివాసులు, జేఏసీ నారాయణపేట జిల్లా కో-కన్వీనర్లు దామోదర్, వెంకటస్వామి, రాంగోపాల్, పరంధాములు, మక్తల్ చైర్మన్ మునావర్ అలీ, మాగనూరు మండల పంచాయతీ కార్యదర్శులు తిమ్మప్ప, నరసింహారెడ్డి, బాలరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.