మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 16 : మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అద్దె వసూళ్లపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పురపాలిక పరిధిలోని వందలాది దుకాణాల అద్దెలు రూ.కోట్లలో పేరుకపోయాయి. ఇప్పటి వరకు రూ.21కోట్ల 7లక్షల 54వేలకు పెండింగ్ చేరింది. గత రెండేండ్ల కిందట మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా ఉన్న అప్పటి అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కొంత మేరకు సఫలమయ్యారు. అలాగే మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే మున్సిపాలిటీకి భారీ మొత్తంలో ఆదాయం సమాకూరనున్నది. పురపాలికలో మొత్తం 258 దుకాణాలు ఉండగా, 237 దుకాణాలను అద్దెలకు కేటాయించగా, 21 ఖాళీగా ఉన్నాయి. ఇందులో మార్కెట్ ఏరియాలో ఐడీఎస్ఎంటీ దుకాణాలు 15, మున్సిపల్ దుకాణాలు 47, టీడీగుట్ట ఐడీఎస్ఎంటీ దుకాణాలు 8, క్లాక్‌టవర్ ఐడీఎస్ఎంటీ దుకాణాలు 17, క్లాక్‌టవర్ మున్సిపల్ దుకాణాలు 41, న్యూటౌన్ ఐడీఎస్ఎంటీ దుకాణాలు 98, నూబస్టాండ్ 18, పద్మావతి కాలనీ 11, ఎనుగొండ 3 షాపులు ఉన్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.94.80లక్షలు వసూలు..
పురపాలిక దుకాణాల అద్దె వసూళ్లపై అధికారులు అంతగా దృష్టి సారించడం లేదు. గతంలో ఉన్న అధికారులు పట్టుబట్టి పేరుకపోయిన బకాయిలను రూ.కోట్లలో వసూలు చేశారు. దుకాణాల తాళాలు వేసి మరీ ఆదాయాన్ని పురపాలికకు తీసుకొచ్చారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకాధికారి తేజస్ నందలాల్ పవార్ ఒక దశలో అద్దె వసూళ్లపై అధికారులతో తరుచూ సమీక్ష నిర్వహించారు. సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. రూ.94.80లక్షలు వసూలు చేశారు. అయినా ఇంకా మున్సిపాలిటీకి రూ.21కోట్లకుపైగా బకాయిలు వసూలు కావాల్సి ఉన్నది
వ్యాపారులపై కొరడా..
వేలంలో పొందిన దుకాణాలకు తాళాలు వేసి అద్దెలు ఏండ్లుగా చెల్లించని వ్యాపారులపై గురువారం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పురపాలిక శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొరడా ఝులిపించారు. ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి న్యూటౌన్‌లోని మున్సిపాలిటీకి సంబంధించిన దుకాణ సముదాయాన్ని తనిఖీ చేశారు. పలు దుకాణాలు తాళాలు వేసి ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే వాటి పరిస్థితిపై ఆరా తీశారు. దీంతో మళ్లీ పురపాలిక శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
పేరుకుపోయిన పెంచిన అద్దెలు..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో రెండు ప్రధాన వ్యాపార సముదాయాల్లో ఉన్న దుకాణాలను 1972-74 సంవత్సరంలో కేటాయించారు. అద్దెలను 2017 వరకు అలాగే వసూలు చేశారు. 2017 జూన్ 9న మార్కెట్లో 39, క్లాక్‌టవర్‌లోని 22 దుకాణాల అద్దె పెంచారు. దీంతో నెలకు రూ.27.44లక్షల చొప్పన ఆదాయం పురపాలికకు రావాలి. ఐదున్నరేండ్ల కిందట ఆయా దుకాణాలకు టెండరు నిర్వహించి కేటాయించారు. నెలకు 27.44లక్షల ప్రకారం ఐదున్నరేండ్లకు రూ.కోట్లలో బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు వసూలు చేయాల్సిన బాధ్యత పురపాలికలకు ఉన్నది. ఇప్పటికైనా మున్సిపల్ దుకాణాలు ఎవరికి కేటాయించారు, టెండర్ పొందిన దుకాణాదారులు వివరాలు పొందుపర్చాలిన అవసరం ఎంతైనా ఉంది. టెండర్లు పొందిన వారు వ్యాపారాలు చేసుకుంటున్నారా? లేదా బినామీలు ఉన్నారనేది తెలుస్తోంది.
వసూలైతేనే అభివృద్ధి పనులు..
మహబూబ్‌నగర్ పట్టణం అభివృద్ధి చెందుతున్నది. మున్సిపాలిటీలో పలు గ్రామాలు విలీనమయ్యాయి. దీంతోపాటు కొత్తకాలనీలు వెలుస్తున్నాయి. అక్కడ మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు లేవు. రూ.కోట్ల అద్దె బకాయిలు వసూలైతే వీటితో ఈ పనులు చేపట్టేందుకు అవకాశమున్నది. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్యలు తీరి ప్రజల ఇబ్బందులు చాలా వరకు తీరనున్నాయి.
అద్దె వసూలుకు స్పెషల్ డ్రైవ్..
మున్సిపల్ అద్దె వసూలుకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. న్యూటౌన్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొత్తం 98 దుకాణాలు ఉన్నాయి. అందులో 88 మంది దుకాణాలు లీజ్‌లో ఉండగా, 17పైగా దుకాణాలకు సంబంధించి గత పదేండ్లుగా అద్దె చెల్లించకుండా తాళం వేసి ఉన్నట్లు గుర్తించాం. ఆయా దుకాణాలకు మున్సిపల్ శాఖ నింబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి రీటెండర్ నిర్వహిస్తాం. మొండిబకాయి ఉన్న దుకాణాదారులకు నోటీలు జారీ చేశాం. అవసరమైతే దుకాణాలు సీజ్ చేస్తాం. పురపాలిక నింబంధనల మేరకు అద్దె చెల్లించాలి.
– డి.ప్రదీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ