నాగర్‌కర్నూల్, జనవరి 2 : ప్రతిఒక్కరూ న్యాయా న్ని పొందే హక్కు ఆర్టికల్ 21 కల్పించిందని, పేదలకు న్యాయ సేవాధికార సంస్థ వరంగా మారనున్నదని రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. సోమవారం తెలంగాణ హైకోర్టు సమావేశ మందిరం నుంచి నూతన జిల్లా న్యాయసేవ సాధికార సంస్థ కార్యాలయాలను రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ నవీన్‌రావుతో కలిసి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ నుంచి జిల్లా కోర్టు సముదాయ భవనంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జస్టిస్ రాజేశ్‌బాబు, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా సెక్రటరీ జస్టిస్ సబితా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ ప్రైవేట్ లాయర్లను నియమించుకోలేని పేదలు సైతం న్యాయం పొందాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 21ను అనుసరించి 1987 యాక్ట్ నిబంధన (39) (ఏ) ప్రకారం లీగల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన 23 జిల్లా ల్లో ఒకేసారి లీగల్ సర్వీసెస్ అథారిటీలను ఏర్పాటు చేశామని, మొత్తం 33 జిల్లాల్లో న్యాయసేవ సాధికార సంస్థ లు పనిచేస్తాయన్నారు. అనంతరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజేశ్‌బాబు, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ తో కలిసి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనాన్ని ప్రా రంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివి ల్జడ్జి స్వరూప, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మౌనిక, బార్ అసోసియేషన్ కార్యదర్శి పర్వత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆయా జిల్లాల్లో..
నారాయణపేట/గద్వాల అర్బన్/వనపర్తిటౌన్, జనవరి 2 : నారాయణపేట పట్టణంలోని జిల్లా కోర్టు భవన సముదాయంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనాన్ని జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ఫ్రీ, కలెక్టర్ శ్రీహర్ష, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ ప్రారంభించారు. గద్వాలలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి అనిరోజ్ క్రిస్పియన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ కార్యదర్శి గంట కవితాదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ప్రభాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి, ఎస్పీ రంజన్త్రన్‌కుమార్, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, వనపర్తిలో జిల్లా జడ్జి ఎండీ హుజీబ్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు.