అలంపూర్, అక్టోబర్ 25 : కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రమాదంలో బైక్‌పై శివశంకర్‌తోపాటు వెనకాల మరో వ్యక్తి ఎర్రిస్వామి అలియాస్ నాని ఉన్నట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. శనివారం ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన అనంతరం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శివశంకర్ కర్నూల్ జిల్లా లక్ష్మీపురం నుంచి గురువారం అర్ధరాత్రి తర్వాత తుగ్గలిలో ఎర్రిస్వామిని విడిచిపెట్టేందుకు బైక్‌పై వెళ్లారు.
మార్గమధ్యంలో 2:24గంటల సమయంలో హైవే పక్కల గల హెచ్‌పీ పెట్రోల్ బంకులో రూ.300ల పెట్రోల్ పోయించుకొని తిరిగి ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం వెళ్లాక బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడిక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై పడిన శివశంకర్‌ను ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాగి పరిశీలించాడు. శివశంకర్ చనిపోవడంతో రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను పక్కకు తొలగించేందుకు వెళ్లగా, ఆ సమయంలోనే వేగంగా వచ్చిన ట్రావెల్ బస్సు బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలోనే బైక్ రాపిడికి మంటలు చెలరేగాయి. భయపడిన ఎర్రిస్వామి అక్కడి నుంచి తన స్వగ్రామమైన తుగ్గలికి పారిపోయాడు. ఈ మేరకు ఉలెందకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వేమూరి కావేరి ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు అధికారులు శనివారం
పరిశీలించారు. బస్సు డిజైన్, కండీషన్ తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన
వివరాలను సేకరించారు.