అచ్చంపేట రూరల్ : నల్లమల అభయారణ్యంలో వెలసిన సలేశ్వర లింగమయ్య ( Saleswara Lingamaiah) దర్శనానికి వెళ్లేందుకు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోడ్డు అభివృద్ధికి సహకారం అందించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను ( MLA VamsiKrishna) అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. సలేశ్వరం లింగమయ్య దేవస్థానం రోడ్డు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాకం సుధాకర్ , చైర్మన్ బళ్లారి సుధాకర్, మాజీ జడ్పీటీసీ ధర్మా నాయక్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సలేశ్వరం జాతర రోడ్డు నిర్మాణ కమిటీ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లింగాల నుంచి సలేశ్వరం వరకు రోడ్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ప్రతి ఏడాది భక్తులు సలేశ్వరం వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కమిటీ వేసి రోడ్డు అభివృద్ధికి ముందుకు వచ్చిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.