అచ్చంపేట, జూలై 17 : అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో పులుల లెక్కింపు ప్రక్రియను అటవీశాఖ అధికారులు పూర్తి చేశారు. పులుల సంచారాన్ని ట్రాక్ చేయడానికి సీసీ కెమెరాలను అడవుల్లో అమర్చి 24/7 నాన్‌స్టాఫ్‌గా పర్యవేక్షణ చేశారు. గతేడాది 33 పులులు ఉండగా, ఈసారి 36కు చేరింది. నల్లమల 2,611.39 చదరపు కి.మీ, విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, అందులో 2,166.37 చదరపు కి.మీ. అభయారణ్యం, 445.02 చదరపు కి.మీ. బఫర్ జోన్‌గా ఉన్నది.
అటవీ అధికారులు ఫుటేజ్ ఆధారంగా డేటాను సేకరించి పులుల వివరాలను నమోదు చేశారు. కెమెరా ట్రాకింగ్ కోసం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టును అధికారులు నాలుగు బ్లాకులుగా విభజించారు. ఒకటో బ్లాకులో మద్దిమడుగు, అమ్రాబాద్ రేంజ్‌లు, రెండో బ్లాక్‌లో మన్ననూర్, దోమలపెంట రేంజ్‌లు, మూడో బ్లాక్‌లో అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్ రేంజ్, నాలుగో బ్లాక్ అచ్చంపేట, కంబాలపల్లి, దేవరకొండ, నాగార్జునసాగర్ రేంజ్‌లుగా విభజించారు.
ఒక్క బ్లాక్‌లో 250 నుంచి 300 కెమెరాలు బిగించారు. ఒక బ్లాక్‌లో నెల రోజులపాటు సీసీ కెమెరాలు ఉంచారు. 15రోజులకోసారి ట్రాప్ ఫొటోలు తీసి కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు. మళ్లీ అక్కడే సీసీకెమెరాలు కొనసాగిస్తారు. ఇలా నాలుగు బ్లాకులలో నాలుగు నెలలపాటు సీసీకెమెరాలు అమర్చి పులుల కదిలికలు, సంచారం రికార్డు చేశారు. ఒక బ్లాకులో అమర్చిన సీసీకెమెరాలు నెలరోజుల తర్వాత తీసి మరో బ్లాకులో అమర్చారు. గతేడాది డిసెంబర్ 20 నుంచి ఈ ఏడాది మే 15వరకు నాలుగు బ్లాకు ల్లో ట్రాప్ ఫొటోలు సిస్టమ్‌లో అప్లోడ్ చేసి పులు ల సంఖ్యను లెక్కించారు. సీసీ కెమెరా ఒకదానికొకటి 1.5 కి.మీ. నుంచి 2కిలోమీటర్ల దూరం మధ్యలో చెట్లకు బిగిస్తారు. ఒక కెమెరా 350 మీటర్ల దూరం వరకు ఫొటోను తీసుకుంటుంది. సీసీ కెమెరా ముందు నుంచి ఎలాంటి వన్యప్రాణులు, మనుషులు, జంతువులు సంచరించినా ఆటోమెటిక్‌గా ఫొటో తీసుకుంటుంది.
నాలుగు నెలలు సీసీ కెమెరాలు అమర్చి 36 పులులు ఉన్నట్లు గుర్తించాం. రేంజ్-1లో 797 లోకేషన్లలో 1,594 కెమెరా ట్రాప్‌లు అమర్చాం. అందులో 20 ఆడ, 13 మగ, 2 కూనలు ఉన్నాయి. మరో ఆడ, మగ అనేది నిర్ధారణ చేయలేదు. 2023-24లో 33 పులులు ఉండగా, ఈసారి సంఖ్య అభివృద్ధి జరిగింది.
– రోహిత్‌గోపిడి, డీఎఫ్‌వో