అలంపూర్, జనవరి 24 : అలంపూర్ నియోజకవర్గంలో గతంలో అగ్నిమాపక కేంద్రం అందుబాటులో లేకపోవడం తో అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడడమే కాకుండా చాలా వరకు ఆస్తినష్టం చేకూర్చుకున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరగా కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసింది. కానీ ఆ ఫైర్‌స్టేషన్ ఏర్పడిన సంతోషం ఎక్కువ రోజులు ఉండేలా కనిపించడం లేదు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండు నెలల కిందట తాత్కాలికంగా ఫైర్స్టేషన్ను ఏర్పాటు చేశారు. కానీ అక్కడ కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యా ర్డులో ఫైర్ ఇంజన్ నిలుపుకోవడానికి తగినంత స్థలం ఉన్నప్పటికీ, సిబ్బందికి మాత్రం తగినంత గదుల సౌకర్యం లే దు. మూత్రశాలలు మరుగుదొడ్లు లేవు, బహిర్భూమికి వెళ్లాలన్నా, కనీసం గొంతు తడుపుకుందామన్నా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒక బిందె నీరు కూడా దొరకని పరిస్థి తి. రాత్రి అయితే విద్యుత్ దీపాల ఏర్పాటు లేక చీకట్లో బిక్కు బిక్కుమంటూ ఫైర్ సిబ్బంది భోగి మంటలు వేసుకొని కాలం వెల్లదీస్తున్నారు.
దినచర్యల కోసం చౌరస్తా కూ డలిలోని ఆయా వ్యాపార సముదాయాల వద్ద గ్రామ పం చాయతీ కుళాయిల నీటి కోసం పడిగాపులు గాయాల్సి వ స్తుందని ఫైర్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని మాపక కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని పలుమా ర్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఫైర్ సిబ్బంది దినచర్యలు, అవసరాలకు బిందె నీరు దొరకకపోతే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పరిస్థితి ఏంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం పేరుకు మాత్రమే ఫైర్ స్టేషన్ ఏ ర్పాటు చేసి చేతులు దులిపేసుకుంటుందని చర్చించుకుంటున్నారు. కనీస వసతులు లేని కారణంగా స్థానికంగా విధు లు నిర్వహించడానికి సిబ్బంది ఆసక్తి చూపడం లేదు. అధికారులు స్పందించి ఫైర్ సిబ్బందికి సౌకర్యాలు మెరుగుపర్చకపోతే చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్ మరో ప్రాంతానికి తరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఫైర్స్టేషన్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.