ప్రపంచ సాహిత్య చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ప్రతి భాషలోనూ కొన్ని యుగాలు, మహత్తరమైన జీవశక్తితో, అపరిమిత వేగంతో కదిలి, తావులన్నింటినీ కదిలించి పరవశింపజేశాయి. ప్రవహించిన కాలానికి ఇవి ప్రతినిధులై నిలిచాయి. మరికొన్ని యుగాలు ఆ కవితా ప్రవాహంలో క్షీణించి కొన్ని వేల పిల్ల కాలువలై చివరకు మురికికి ఆలవాలమై, ఆ నీరు కూడా నిలువక ఆవిరై ఏమీ మిగలకుండా పోయే క్షీణదశకు ప్రతీకలుగా నిలిచాయి.‘తెలుగులో ప్రస్తుతం కవిత్వం ఎలా ఉంటున్నది? దానికి స్థానం ఎటువంటిది?’
అని సాహిత్యాభిరుచి ఉన్న తెలుగువాడు ప్రశ్నించుకుంటే దానికి సమాధానమేమిటి? ‘నా మాతృభాషలో వెలువడుతున్న ఉత్తమ కవనం ఇది’ అని గర్వంగా చెప్పుకోదగిన స్థితిలో కవిత్వం ఉన్నదా? లేక ‘ఇది కవిత్వమేనా’ అని ఆధునిక విమర్శకుడు లేక పాఠకుల్ని సందిగ్ధావస్థలో పడేసే రీతిలో ఉన్నదా? కవిత్వ తత్త్వాన్ని కొంచెం లోతుగా పరికిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు అసాధ్యం కాదని తెలుస్తుంది.
సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ కవిత్వానిదే అగ్రతాంబూలం అన్న ది నిర్వివాదాంశం. సూటిగా గుండెలకు హత్తుకునే రీతిగా సౌందర్య పరిమళంతో, సూక్ష్మరూపంలో భావాన్ని వ్యక్తం చేయగలిగింది కవిత్వం మాత్రమే. ఇక్కడ కవిత్వం అనే మాట రామాయణ, మహాభారత మహాకావ్యాల నుంచి నేటి వచన కవిత, ప్రతిఘటన కవిత, మినీ కవిత, స్త్రీ వాద, దళితవాద, ముస్లింవాద కవితా ఖండికల వరకు అనువర్తిస్తుంది.
సాహిత్యంలోని విభిన్న రూపాలకు సంక్షిప్త రూపాలుగా నేడు కవితలు, కథానికలు, వ్యాసాలు, స్కెచ్లు, ఏకాంకికలు, అవధాన కవిత్వం, భావకవిత్వం, దేశభక్తి కవిత్వం, అమలిన శృంగార కవిత్వం, అభ్యుదయ కవిత్వం, వచన కవిత్వం, దిగంబర కవిత్వం, ప్రతిఘటనా కవిత్వం, విప్లవ కవిత్వం, మినీ కవిత్వం, తిరుగబడు కవిత్వం, స్త్రీ వాద, దళితవాద, ముస్లిం వాద కవిత్వం అనేవి ఆధునిక తెలుగు కవిత్వంలో నేటి వరకు జరిగిన పరిణామాన్ని సూచించే కవిత్వోద్యమాలు. ఇందులో నేటి తెలుగు కవిత్వం పేరిట అపరిమితంగా ప్రచురితమవుతున్న వచన కవిత్వానికి అధికంగా వర్తిస్తుంది. కవిత్వాన్ని సూచించే కవిత్వోద్యమాలు. కవిత్వాన్ని, జనసామాన్యానికి అందించే పత్రికలు విరివిగా నెలకొల్పడం, అసంఖ్యాకులైన కవులు ఉత్సాహంతో కవిత్వాన్ని రచించడం చాలా ముదావహమైన విషయం. శక్తి, ఉత్సాహం, ప్రతిభ సంకుచిత మార్గాలు పట్టకుండా తమకు తామే ఇనుప గోడల్ని నిర్మించుకోకుండా జాగ్రత్త పడాలి. తెలుగువాడికి దురదృష్టవశాత్తు నేడు అప్రమత్తత లోపించింది. కవులు, రచయితలు తాము ఫలానా వర్గానికి చెందినవారమని, తమ కవిత్వానికి ఫలానా సిద్ధాంతం ప్రాతిపదిక చేస్తామని రొమ్ము విరుచుకోవడం, ప్రతిభ లేకుండానే పరనిందకు పూనుకోవడం అలవాటైపోయింది. రమణీయమైన శిల్ప నిర్మాణంలో అనుభవ వ్యక్తీకరణ ఉండాలి.
ఏది ఉత్తమమైనది? ఏది ఆచరణ యోగ్యం? అనేది ఈ వ్యాసంలో చర్చనీయాంశం కాదు. కవిత్వంపై రాజకీయ సిద్ధాంతాల ప్రభావమై, ఆ సిద్ధాంతాలు నిర్ణయించిన పరిధిలోనే గుడుగుడు గుంజాల అనే ప్రలోభం కవిత్వాన్ని క్రమంగా ఎలా హత్య చేస్తుందో చెప్పడం ముఖ్య ఉద్దేశం.
‘నేను ఫలానా వర్గానికి చెందిన కవి’ననుకొని కవిత్వం రాయడం, అలా అందరూ రాయాలని బాకా ఊదడం, ఆత్మహత్య కన్నా ఘోరమైన నేరం. సమర్థుడైన కవి రూపంతో గాని, ఒక ప్రత్యేక రాజకీయ సిద్ధాంతంతో గాని నిమిత్తం లేకుండా ఉజ్వలమైన కవిత్వాన్ని సృష్టించగలడు. అది పద్యమైనా, వచనమైనా, కవిత్వమైనా ప్రతిఘటన అయినా, మినీ కవిత అయినా ఒకటే.
కవిత్వంలో ప్రాచీన రీతులను దుయ్యబట్టడమూ లేక ఆధునిక మార్గాన్ని విమర్శించడమూ అసమర్థతను మాత్రమే తెలియజేస్తుంది. చదివినప్పుడు గాని అధికారాన్ని బట్టి కాదు. శ్రీశ్రీ అనగానే స్ఫురించేది నయాగరా జలపాతం వంటి ఆయన కవిత్వం. మహోన్నత శిఖరాలను అందుకున్నది మహాప్రస్థానం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ కవి అంటున్నామంటే అది ఆయనకు గల సనాతన ధర్మ పాండిత్య పక్షపాతం వల్ల కాదు. విశ్వనాథ అనగానే మెరుపువలె ఆలోచనలో మెరిసేవి ఆయన కిన్నెరసాని పాటలు. అంటే శ్రీశ్రీ, విశ్వనాథలు మార్క్సిస్టు, సనాతన భావ గ్రంథికి ప్రతినిధులుగా కాక మానవ జీవితాన్ని రమణీయ కావ్యాలుగా మలచిన శిల్పులుగా, కవులుగా మనకు గుర్తుకొస్తారు.
ఇక్కడ చిన్న విషయం మరువకూడదు. ఈ కాలపు కవికి వివిధ రంగాలతో పరిచయం ఉండి ఒకే ప్రత్యేమైన రంగంలో చెప్పుకోదగిన ప్రవేశమూ, ప్రజ్ఞ ఉంటే.. అది అతని కవిత్వ స్వభావానికి మెరుగుగా భాసించవచ్చు. ప్రవేశమూ, ప్రజ్ఞ లేనంత మాత్రాన అతని కవిత్వం అంతరించదు. అతడు కవిగా రాణించడం ఆగదు. బంగారం ఉత్పన్నం చేయబోయి కనీసం స్వచ్ఛమైన ఇనుమునైనా కవులు అందించలేకపోతున్నారు. రచనలో కవిత్వం ఎంతమాత్రం వెల్లివిరుస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం.
అంటే, ఒక కవికి గీటురాయి అతడు మార్క్సిస్టా, నక్సలిస్టా, ఫెమినిస్టా, మరొక ఇస్టా కాదన్నమాట. సిసలైన కవిత్వం హృదయ సంబంధియే కానీ, విజ్ఞాన సంబంధి కాదు. ఒక కవికి రసాయన శాస్త్ర సమీకరణ గురించి, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం గురించి తెలియనంత మాత్రాన అతనిని కవి కాదనడం ఎంత అసందర్భమో, మార్క్సిజం సిద్ధాంతం తెలియనంత మాత్రాన అతనిని కవి కాదనడం కూడా అలాంటిదే. కవికి తన ప్రతిభతో పాటు శాస్త్ర విజ్ఞానం కూడా ఉంటే సంతోషమే. కానీ, శాస్త్ర విజ్ఞానముంటేనే అతడు రాసింది కవిత్వం అవుతుందనటం కేవలం కవిత్వం తెలియని వారనవలసిన మాట. స్వర్గీయ తిలక్ అన్నట్టు కవిత్వం ఒక ఆల్కెమీ.
(వ్యాసకర్త: విశ్రాంతాచార్యులు)
-కె. ప్రభాకర్