గతవారం నటుడు కమల్ హాసన్ తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ప్రకటించి ఒక పెద్ద వివాదానికి తెరదీశారు. ఏ భాష ప్రాచీనమైనది? అన్న ప్రశ్న 20వ శతాబ్దపు మధ్యనాటి నుంచి ఈ గడ్డపై రాజకీయంగా వేడి పుట్టిస్తూనే ఉన్నది. ఈ జాతీయత ఆగ్రహావేశాల అడుగున పురావృక్షశాస్త్రవేత్తలు, భాషా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు కనిపెట్టిన అబ్బురపరిచే విషయాలు ఎన్నో దాగున్నాయి. అంతరించిపోయిన గంగా మైదానపు ‘లాంగ్వేజ్ ఎక్స్’ నుంచి ఆగ్నేయాసియా భాషల మూలాలు, మూల ద్రవిడ భాషీయుల ప్రాదేశికత
వరకు లోతుగా తరచి చూస్తే చరిత్ర పూర్వ భారతీయ భాషలు ఇప్పటిలాగే ఎంతో వైవిధ్యంతో కూడుకొని ఉన్నట్టు స్పష్టమైపోతుంది.
అసలు ద్రవిడ భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రోజుల్లో ద్రవిడియన్ లేదా ద్రవిడ అనే మాటను భారతదేశంలోని దక్షిణాది రాష్ర్టాలకు సంబంధించి ఉపయోగిస్తున్నారు. ఇది జాతీయత, సంస్కృతి, రాజకీయాలతో ముడిపడి ఉంది. కానీ, నేను ఇక్కడ భాషాపరమైన అర్థంలో మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నాను. ద్రవిడియన్ భాషలపై భద్రిరాజు కృష్ణమూర్తి రాసిన ‘ద్రవిడియన్ లాంగ్వేజేస్’ (2003) ప్రకారం భారతదేశపు దక్షిణాగ్రం నుంచి మధ్య భారతం వరకు ఈ భాషలను మాట్లాడుతారు. ఒకే ఒక ఉలిపికట్టె ద్రవిడభాష.. బ్రాహుయీ ప్రస్తుత పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో ఉంది.
పురామానవ శాస్త్రవేత్త, చరిత్రకారుడు థామస్ ట్రావుట్మన్ ‘ద్రవిడియన్ కిన్షిప్’ (1981) పుస్తకంలో మహారాష్ట్రలోని అనేక స్థలనామాల్లో ద్రవిడియన్ పదాలు అంతర్లీనంగా ఉన్నాయని, అంతేకాకుండా ద్ర విడియన్ సాంస్కృతిక ఆచారాలు.. మేనరికపు పెండ్లిళ్ల వంటివి కూడా అక్కడ విస్తారంగా ఉ న్నాయని రాశారు. ఆ మాటకు వస్తే సింధ్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావాలున్నాయని ఆయన చెప్పారు. ద్రవిడ భాషలు మాట్లాడేవారు భారత్‌లో అత్యంత విస్తారంగా ఉన్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది.
ఈ సువిశాలమైన భౌగోళిక విస్తృతిని గమనిస్తే ‘అసలైన’ ద్రవిడ భాషీయులు ఎవరు? వారు ఎలా విస్తరించారు? ఎందుకు విస్తరించారు? అనే ప్రశ్న సహజంగానే ముందుకొస్తుంది. అన్ని ద్రవిడ భాషల తొలినాళ్ల సామ్యాలను పరిశీలిస్తే మనం నేటి భాషలన్నిటి ఆవిర్భావానికి మూలమైన ఒక ఆది-ద్రవిడియన్ భాషను ఊహించుకోవచ్చు. అప్పటివాళ్లు చూసిన మొక్కలు ఏవో, జంతువులు ఏవో, వారు బతికిన వాతావరణ పరిస్థితులు ఎలాంటివో, వారి రాజకీయాలేమిటో, వారి ఇండ్లు ఎలా ఉండేవో అంచనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉపఖండ పర్యావరణం, పురావస్తు తవ్వకాల్లో వెలుగుచూసిన విషయాలను బేరీజు వేసుకొని పోలికలు చూసుకోవచ్చు.
సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త ఫ్రాంక్లిన్ సి సౌత్వర్త్ తన ‘ప్రొటో ద్రవిడియన్ అగ్రికల్చర్’ (2005) అనే పరిశోధన పత్రంలో కనిపించకుండాపోయిన పాతకాలపు ప్రపంచాన్ని శ్రమకోర్చి పునర్నిర్మించారు. మూలద్రవిడ భాష మాట్లాడేవారు రాజును ఉద్దేశించిన పదాన్నే మట్టి గుడిసెకు, మొత్తంగా ఊరికీ వాడేవాళ్లు. అంటే చిన్నచిన్న గూడేలు ఉండటం, అందులో దగ్గరి బంధువులు నివసించడం అందుకు కారణం కావచ్చు. వారికి ఎన్నో వ్యవసాయ, వేట పనిముట్ల గురించి, అనేక అడవి జంతువుల గురించిన జ్ఞానం ఉండేది.
క్రీ.పూ. 3వ సహస్రాబ్దిలో సింధునది లోయలో హరప్పా నాగరికత వెల్లివిరుస్తున్న రోజుల్లో మూల ద్రవిడులకు అనేక పంటల గురించి, ముఖ్యంగా జొన్నలు, కొర్రలు, పప్పు ధాన్యాల వంటి అనేక పంటల గురించి బాగా తెలుసు. పశువుల కొట్టాలు, గొర్రెలు, మేకల పెంపకం గురించిన ప్రత్యేకమైన పదాలు వారు ఉపయోగించేవారు.
ఇక చివరగా ప్రాచీన వృక్షశాస్త్రవేత్త డోరియన్ క్యూ పుల్లర్ తన ‘నాన్ హ్యూమన్ జెనెటిక్స్: అగ్రికల్చరల్ ఆరిజిన్స్ అండ్ హిస్టారికల్ లింగ్విస్టిక్స్ ఇన్ సౌత్ ఏషియా’ (2007)లో మూల ద్రవిడభాషలు పొడినేలల్లో, చిట్టడవుల మధ్య ఎక్కువకాలం నివసించిన సమాజాల నుంచి వచ్చాయని చెప్పారు.
ఈ వర్గీకరణలన్నిటికీ చక్కగా సరిపోయే ప్రాంతం ఒకటి ఉంది. ఆధునిక ద్రవిడ భాషా కుటుంబాలు ఉత్తరాది, మధ్య భారతం, దక్షిణ మధ్య భారతం, దక్షిణాది.. ఒకదానితో ఒకటి కలగాపులగం అయిపోయిన ప్రాంతం అది. బహుశా ఇప్పటి భాషలన్నిటి ఆవిర్భావానికి అదే మూలస్థానమై ఉంటుందని దక్షిణాది నవీన శిలాయుగ దశకు చెందిన పురాతత్వ ప్రదేశాల్లో చిన్నచిన్న మట్టి ఇండ్లు, అటవీ, పెంపుడు జంతువులు, పంటల అవశేషాలపై విస్తారంగా జరిగిన పురాతత్వ పరిశోధనల ద్వారా తెలుస్తున్నది.
సౌత్వర్త్ మూల ద్రవిడ భాషలో మొక్కలకు సంబంధించి సూచించిన పదజాలం దక్షిణాది నవీన శిలాయుగ పురావస్తు ప్రదేశాల్లో వినిపించే మాటలతో 73 శాతం సరిపోతున్నది. ప్రస్తుతం దక్షిణ భారత భాషా జాతీయవాద ఘర్షణలు, ఉద్రిక్తతలు జరుగుతున్న ప్రాంతానికి ఇది ఎంతో దూరంలో ఉండటం గమనార్హం.
అవి దక్షిణ కర్ణాటక లేదా తమిళనాడు నుంచో రాలేదు. మూల ద్రవిడ భాషలు అభివృద్ధి చెందాయని చెప్పే ప్రాంతం ప్రస్తుత ఉత్తర కర్ణాటక, ఏపీ పరిధిలోకి వచ్చే కృష్ణా-గోదావరి లోయలో ఉండటం విశేషం.
అంటే ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాలి. పైన చెప్పిన విషయాల అర్థం అన్ని ద్రవిడ భాషలు కృష్ణా-గోదావరి లోయలోంచి పుట్టుకు వచ్చాయని కాదు. నిజానికి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి మూలాలు ఎక్కడున్నాయి? అనేది చాలా క్లిష్టమైన ప్రశ్న. తూర్పు ఆఫ్రికా నుంచి ఆధునిక మానవుడు వచ్చాడనేది మాత్రమే నికరమైన సత్యం. నిజానికి మూలద్రవిడ భాషలోనూ ప్రస్తుతం ఆగ్నేయాసియా యాసలో ఎక్కువగా మాట్లాడే ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందిన, భారత్‌లో వాటి ప్రతినిధులైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ‘ముండా’ భాషలకు చెందిన కొన్ని పదాలుండేవి.
తొలి దశ ద్రవిడులు సైతం కృష్ణా-గోదావరి లోయకు వేరే ఎక్కడి నుంచో, దారిలో ఇతర భాషల పదాలు గ్రహిస్తూ, వలస వచ్చారని ఇది సూచిస్తున్నది. కొన్ని జన్యుపరమైన, భాషా పరమైన సిద్ధాంతాలు ద్రవిడియన్ భాషలు ఇరాన్ పీఠభూమి నుంచి, హరప్పా నాగరికత నుంచి వచ్చాయని సూచిస్తాయి. కానీ, అది ప్రస్తుతం చర్చనీయాంశం కాదు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మూల ద్రవిడభాష దక్షిణాది నవీన శిలా యుగపు తవ్వకాలకు అచ్చుగుద్దినట్టు సరిపోయేదేమీ కాదు. దక్షిణాది నవీన శిలాయుగపు మనుషులు కుండల్లో ఖననం చేసే ఆచారాన్ని పాటించేవారు. అయితే మూల ద్రవిడంలో ఆ ఖననానికి సంబంధించిన పదజాలం లేదు. అదేవిధంగా హరప్పా నాగరికతకు సంబంధించిన అంశాలతోనూ అవి సరిపోవు. హరప్పా నగరాలను చూస్తే వారికి ఇంజినీరింగ్, జామెట్రీకి సంబంధించి బోలెడు పదజాలం ఉండవచ్చని అనిపిస్తుంది. కానీ, మూల ద్రవిడంలో అలాంటి పదాలేవీ లేవు. మూల ద్రవిడంలో ‘ఖడ్గమృగం’ అనేదానికి సమాన పదం లేదు. హరప్పా ముద్రలపై ఈ ప్రాణి తరచుగా కనిపించడం తెలిసిందే. అంటే ద్రవిడియన్ మాట్లాడేవాళ్లు హరప్పా నగరాల్లో లేరని దీన్నిబట్టి చెప్పడానికి వీల్లేదు. అంతటి విస్తృతమైన నాగరికతలో బహుళ భాషలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అంతరించిపోయిన ద్రవిడ కుటుంబానికి చెందిన ఓ భాష అక్కడ ఉపయోగించి ఉంటారు. తర్వాత కాలంలో మూల ద్రవిడం నుంచి విడిగా అది పరిణామం చెంది ఉంటుంది.
మూల ద్రవిడ భాషలో పంటలకు సంబంధించి, ముఖ్యంగా గోధుమ గురించిన పదాలున్నాయి. వీటి మూలాలు హరప్పాలో ఉండవచ్చు. అంటే వ్యవసాయపరమైన ఇచ్చిపుచ్చుకోవడాలను ఇది సూచిస్తున్నది. నిజమైన ద్రవిడ మాతృభూమి ఏది? అనేది ఇప్పటికీ అస్పష్టమే. క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్దిలో మూల ద్రవిడం మాట్లాడేవారు దక్షిణ భారత ద్వీపకల్పంలో వ్యవసాయం చేసేవారు. క్రీస్తుపూర్వం 11వ శతాబ్ది ప్రాంతంలో వారి జనాభా ఒక్కసారిగా పెరగడంతో భారత ఉపఖండమంతటా తెరలు తెరలుగా వారు వ్యాపించారు.
స్థూలంగా చెప్పాలంటే, చిరుధాన్యాలు, పప్పులు, దుంపల పొడినేలల సేద్యం అనేది మూల ద్రవిడ వ్యవసాయ విధానాలుగా ఉండేవి. క్రీస్తుపూర్వం మొదటి సహస్రాబ్దిలో పత్తి, చెరకు వంటి వాణిజ్య పంటలతో పాటు ఆరుతడి వరి సేద్యం కూడా వచ్చిచేరింది. ఏతావాతా వరి అనేది కీలక స్థానంలోకి వచ్చి చేరింది.
శతాబ్దాల క్రమంలో ద్రవిడ భాషీయులు జంతువులు, పంటలకు సంబంధించిన మాటలను ఉత్తర భారతదేశం మాత్రమే కాకుండా ఆగ్నేయాసియా భాషల నుంచి కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. అందులో ఒక శాఖ దక్షిణాభిముఖంగా వెళ్లి దక్షిణాది ద్రవిడ భాషల అభివృద్ధికి దోహదం చేసి ఉంటుంది. కొన్ని బృందాలు నీలగిరి కొండల్లోకి పాకాయి. దీంతో ఇరుళ, తోడా వంటి భాషలు ఆవిర్భవించాయి. కోస్తా మైదాన ప్రాంతాల్లో కన్నడ, తమిళ, మలయాళ భాషలు ఆవిర్భవించాయి. ఇప్పుడు తమిళంగా పరివర్తన చెందిన భాష సుమారు క్రీస్తుపూర్వం 600 నాటికి ప్రత్యేక శాఖగా అభివృద్ధి చెంది ఉంటుందని కృష్ణమూర్తి ‘ద్రవిడ భాషలు’ గ్రంథంలో రాశారు.
మూడు శతాబ్దాల తర్వాత అది పాత తమిళంగా అభివృద్ధి చెందింది. మొట్టమొదటిసారిగా వర్ణమాల కలిగిన, రాయదగ్గ భాషగా పరివర్తనం చెందింది. పాత తమిళం అనేక యాసలతో కూడి ఉండేది. కాలక్రమంలో అది మధ్య తమిళం, ఆధునిక తమిళంగా రూపుదిద్దుకుంది. క్రీస్తుపూర్వం 800-1200 మధ్యకాలంలో కొన్ని తమిళ యాసలు కలిసి మలయాళ శాఖగా మారిపోయాయి.
కన్నడ భాష మూలం తమిళంలో లేదని మనం నమ్మకంగా చెప్పవచ్చు. కన్నడ అనేది ఇక్కడ నీలగిరుల నుంచి పాత తమిళం దాకా సంబంధం ఉన్న దక్షిణ ద్రవిడ భాష. అయితే దాని మూలరూపాలు మనకు ఇప్పుడు కనిపించకుండాపోయాయి. దురదృష్టవశాత్తు అతి ప్రాచీన కన్నడ లిపి అనేది 450 క్రీస్తు శకం నాటిది మాత్రమే లభిస్తున్నది. దీంతో అంతకు మునుపటి శతాబ్దాల్లో ఈ భాష ఎలా పరిణామం చెందిందనేది మనకు తెలియరావడం లేదు. తర్వాత కాలంలోనూ కన్నడలో అనేక ప్రాంతీయ యాసలు పుట్టుకువచ్చి అవి పాత కన్నడం, మధ్య కన్నడం, నవీన కన్నడంగా పరిణామం చెందాయి. ఉత్తర కర్ణాటకలో కన్నడ యాసల్లో మరాఠీ వంటి ఎన్నో ఆర్యన్ భాషల నుంచి వచ్చిచేరిన పదాలూ కనిపిస్తాయి. అందులోనూ ద్రవిడ అంతర్లీన లక్షణాలు కలిగిన పదాలే అధికం.
ఈ భాషాపరమైన అరువులు, పరిణామాలు, వలసలు, మార్పిడులు అనే సంక్లిష్ట మిశ్రమాలే భారతీయుల కథగా, ఆ మాటకు వస్తే యావత్తు మానవాళి గాథగా అంతకంతకూ మనకు స్పష్టమవుతున్నది. రుగ్వేద సంస్కృతం మరో ఉదాహరణ. క్రీస్తుపూర్వం 1500 నాటికే తొలినాళ్ల ఇండో-ఆర్యన్ భాషలు పంజాబ్ ప్రాంతంలోని అంతరించిపోయిన ఆస్ట్రో-ఏషియాటిక్ భాషల నుంచి గణనీయ స్థాయిలో పదాలను సంతరించుకున్నాయని భాషా శాస్త్రవేత్త, వేదపండితుడైన ప్రొఫెసర్ మైకేల్ విట్జెల్ ‘సబ్‌స్ట్రేట్ లాంగ్వేజెస్ ఇన్ ఓల్డ్ ఇండో-ఆర్యన్’ అనే పుస్తకంలో (1999)లో రాశారు. అందులో ఊహాత్మకమైన సింధ్ ప్రాంతపు హరప్పా భాష ‘మెలూహాన్’, గంగా మైదానాల్లోని నవీన శిలాయుగపు రైతులు మాట్లాడిన ‘లాంగ్వేజ్ ఎక్స్’ అనే మరో భాష ఉన్నాయి.
కొన్ని శతాబ్దాల తర్వాత క్రీస్తుపూర్వం 800 నాటికి వేదాల్లో ద్రవిడ పదాలు కనిపించడం మొదలైంది. ప్రస్తుతం అంతరించిపోయిన ఉత్తర ద్రవిడ భాషలు బహుశా అందుకు కారణం కావచ్చు.
పైన వివరించినట్టుగా తమిళ సాహిత్యం, లిఖిత భాష క్రీస్తుపూర్వం 300 నుంచి మనకు కనిపిస్తున్నది. తొట్టతొలి తమిళ సాహిత్యం కవుల సమ్మేళనాల్లో రూపొందించిన ‘సంగం’ కవిత్వం రూపంలో లభిస్తున్నది. ‘సంగం’ అనే మాటే ఇండో-ఆర్యన్ భాషల నుంచి తీసుకున్నట్టు భాషా శాస్త్రవేత్తల ఏకాభిప్రాయంగా ఉంది. పాత తమిళ కవులకూ వైదిక మతాచారాలు తెలుసుననేదీ స్పష్టమే. ఈలోగా అదే సమయంలో ఉత్తరాదిలో ప్రాకృత సాహిత్యం వికాసం పొందింది. మతంలో, యజ్ఞయాగాదుల్లో సంస్కృతంపై అది పైచెయ్యి సాధించింది. బహుశా ప్రస్తుతం అంతరించిపోయిన ప్రాంతీయ ద్రవిడ భాషలు మాట్లాడేవారు ఉత్తరాది ప్రధాన స్రవంతిలో కలిసిపోవడం వల్ల ప్రాకృతం అభివృద్ధి చెందిందని భద్రిరాజు కృష్ణమూర్తి (ద్రవిడ భాషలు) అభిప్రాయం. ఇక క్రీస్తు శకం 600 నుంచి మొదలయ్యే మధ్యయుగాల్లో కన్నడ, తమిళం సహా దక్షిణాది ప్రధాన ద్రవిడ భాషలు అప్పటికే పునరుజ్జీవనం పొందిన ప్రాచీన భాష సంస్కృతం నుంచి రాజకీయ, వ్యాకరణ, మతపరమైన పదాలను అరువు తీసుకున్నాయి.
(‘ది ప్రింట్’ సౌజన్యంతో..)
– అనిరుధ్ కనిశెట్టి