‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.’ అని చలం మహా ప్రస్థానానికి రాసిన ముందుమాటలో చెప్తాడు. తను వ్యక్తిగతంగా వంపి ప్రపంచానికి పంచడం ఒక పద్ధతి. తన ముందు జరుగుతున్న అనేక విషయాలకు సంచలించి, దాన్ని అక్షరబద్ధం చేయడం ఇంకో పద్ధతి. ఈ రెండవ బాధే నేటి అన్ని అస్తిత్వ వాదాలకు మూలం. అన్ని ఉద్యమాలకు, ప్రశ్నలకు హేతువుగా నిలిచేదిదే. ఒక అణచివేతకు సమాధానంగా, ఒక ప్రశ్నకు నిలువెత్తు జవాబుగా సాహిత్యం రావడం, ప్రథమంగా కవిత్వం రావడం తెలుగు సాహిత్యంలో, లేక భారతీయ సాహిత్యంలో, ఆ మాటకొస్తే ప్రపంచ సాహిత్యంలో ఎక్కడైనా జరుగుతున్నదే.
‘తనకు ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం’
అంటూ అదే ముందుమాటలో చలం చెప్పిన నిర్వచనం ఈ సామాజిక బాధ నుంచి పొటమరించిందే.
ఒకప్పటి అస్వతంత్ర భారతదేశంలో భారతీయత అవమానించబడింది. ఇది ముక్కలుగా ఉండే దేశమే గాని, దీనికి అస్తిత్వం లేదన్నారు పరపాలకులు. అట్లాంటి అధికృత వ్యక్తీకరణకు సమాధానంగా వచ్చిందే cultural renaissance. ఈ పునర్జీవన ఉద్యమం చరిత్ర రచనతో ప్రారంభమై సాంస్కృతిక అస్తిత్వం ప్రకటిస్తూ కవితా రచనై కొనసాగింది. భారతీయ సాంస్కృతిక అస్తిత్వం కోసం బండార్కర్ (1837-1925) చరిత్ర రచన చేశాడు. ఇంకా ఎందరో చారిత్రక పరిశోధకులు తెరమీదికి వచ్చారు. ఫలితంగా భారతీయ సంస్కృతిని చిత్రీకరించిన కవిత్వం వచ్చింది.
రవీంద్రనాథ్ ఠాగూర్ 1861-1941 జాతీయవాదం, మానవతావాదం పునాదులుగా వికసించిన కవి. స్వతంత్రేచ్ఛ వ్యక్తం చేసిన ఆయన Where The Mind is Without fear poem చూడం డి. Where The Mind is laid forward by thee into ever widening thought and action, Into that heaven of freedom, my father let my country awake.
అదే సమయంలో బంకించంద్ర రాసిన వందేమాతరం ఒక సంచలన జాతీయగీతం. రవీంద్రుని జనగణమన ఇప్పటికీ మనకు నిత్య స్మరణీయం. ఇదే కోవలో కవిత్వం రాసిన సరోజినీ నాయుడు రాసిన The Golden Thres hold, the Bird of Time, Father of the Dawn పేర్కొనదగినవి. జెండా ఊంఛా రహే హమారా రాసిన శ్యామలాల్ గుప్తా, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించిన హసరత్ మొహాని, Legend and a Symbol అని Epic రాసిన అరబిందో ఇట్లాగా ఎందరో కవులను పేర్కొనవచ్చు.
క్రమంగా ఈ జాతీయవాదం దక్షిణాది కవులకు ప్రేరణ కలిగించింది. ఆ గాలితో వాళ్లు కూడా ఈ కవిత్వం రాయడం మొదలుపెట్టారు. రాయప్రోలు, విశ్వనాథ, తుమ్మల లాంటి వాళ్లందరూ ఈ అంశం ఎత్తుకున్నారు. గురజాడలో కూడా ఈ వాదం మొలకెత్తినప్పటికీ అది ఇంకొంచెం ముందు అడుగు వేసి సామాజికవాదంగా పరిణమించడం మనం గమనిస్తాం. తెలుగు సాహిత్యంలో ‘భరతఖండమ్ము చక్క ని పాడియావు’ అనే పద్యం జాతిని ఉర్రూతలూగించింది. కానీ, ఈ చైతన్యంలో ద్రావిడ స్పృహ, లేక దక్షిణాది అస్తిత్వ స్పృహ లోపించింది. జన గణ మన గీతంలో కూడా దక్షిణాది స్పృహ నామమాత్రమే. దక్షిణభారతం కూడా తన అస్తిత్వం ప్రకటించుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఫలితంగా దక్షిణ భారతం తన చరిత్రను సంస్కృతిని స్మరించుకున్నది. దక్షిణాత్యుల ఆత్మ స్పృహతో నీలకంఠశాస్త్రి The Pand yan Kingdom from the earliest times of the 16th century లాంటి రచనలు ఉత్ప్రేరకంగా నిలిచాయి. ఇలాంటి రచనలు ఎన్నో వెలువడ్డాయి.
తెలుగుదేశంలో ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరం, సురవరం ప్రతాపరెడ్డి లాంటి రచయితల చారిత్రక, సాంస్కృతిక స్పృహ అనితరంగా పనిచేసింది. ఈ స్పృహే తెలుగు కవిత్వంలో ప్రవేశించింది. ‘గోదావరి పావనోదార వాః పూర మఖిలభారతము మాదన్న నాడు’ లాంటి పద్యాల సృష్టి జరిగింది. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ లాంటి పాటలు వచ్చాయి. ‘తెలివిగలవాళ్లంతా తెలుగోళ్లే’ అన్న దురభిమానం విస్తరించింది. కానీ, అందులో తెలంగాణ స్పృహ లోపించింది. తెలంగాణలో కవులు లేరని శూన్యవాదం తలెత్తింది. సురవరం గోల్కొండ సం చిక దీన్ని సవాలు చేసింది. తర్వాత దాశరథి ‘నా తెలంగాణ కోటి రత్నాలవీణ’ అని గర్జించాడు. క్రమంగా తెలంగాణ చైతన్యం విస్తరించింది.
తన స్వీయ అస్తిత్వం ప్రకటించింది. శంకరంబాడి సుందరాచారి రాష్ట్ర గీతంలో తెలంగాణ ప్రస్తావన నామమాత్రం కావడంతో తెలంగాణ కవి ప్రశ్నించిండు. సంగనభట్ల నరసయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి లాంటి అనేకమంది చరిత్ర రచయితలు బయల్దేరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ జాగృతి, శ్రీ రామోజు హరగోపాల్, వేముగంటి మురళి లాంటి చారిత్రక పరిశోధకులతో చరిత్ర రాయించింది. బతుకమ్మ, బోనాలు, బొడ్డెమ్మ తెలంగాణ సాంస్కృతికతను ప్రతిఫలించాయి. ఫలితంగా పొక్కిలి, మత్తడి, మునుం, జాగో జగావో, తెలంగాణ కవిత లాంటి అనేక కవితా సంకలనాలు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రకటించాయి.
ఈ సందర్భంగా వచన కవిత్వం ఇతర ప్రక్రియల కంటే విశిష్ట స్థానంలో నిలబడింది. అనేక ఇతర ప్రక్రియలకు తాత్విక స్పృహను ప్రోది చేసింది. ఇది పద్యం, పాట, కథ, నవల లాంటి ఇతర ప్రక్రియలోకి, తెలంగాణ స్పృహను అందించింది. క్రమంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కూడా వచన కవిత్వం సాహిత్యరంగంలో ఒక ప్రధాన ప్రక్రియగా నిలబడింది. ఇట్లాంటి వచన కవిత్వం పరిణామాన్ని, వస్తువుతో పాటు పొందే నిర్మాణాన్ని, ప్రేరణలను ఒకసారి పరిశీలిద్దాం.
బెల్లంకొండ సంపత్ కుమార్ ప్రతీకలతో అనుభూతిని సుసంపన్నం చేస్తున్నాడు. ‘రంగులు పెత్తనమెత్తి/ రాజ్యం చేస్తుంటే/ కన్ను కాపాడుకునేది ఎట్లా?’ అని వాపోతున్నాడు. ఈ విధంగా అరుణ నారద భట్ల, గాజోజు నాగభూషణం, సీహెచ్ ఉషారాణి, వాసరచెట్ల జయంతి, చమన్ సింగ్, మెర్సీ మార్గరెట్, బిల్ల మహేందర్ లాంటి కవులు ఎందరో తమ నిర్మాణ కుశలతను పెంచుకుంటూనే సమాంతర సామాజిక పరిస్థితులకు ప్రతిబింబాలై ప్రయాణం చేస్తున్నారు. నిజానికి ఏ కవి పరిపూర్ణుడు అని ఎవరూ చెప్పలేరు. అతని నిరంతర సాధనే, సామాజిక అవగాహనే అతణ్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
ఆంగ్ల కవిత్వంలో 19వ శతాబ్ది ఉత్తరార్థంలో వచన కవిత్వం విస్తరించింది. అది 20 శతాబ్ది కల్లా ఒక బలమైన సాహితీ ప్రక్రియగా రూపాంతరం చెందింది. ఫ్రెంచ్ పదం verse Libre కవిత్వానికి ప్రాతిపదికైంది. Hyum, F.Print నుంచి లండన్ లో 1909లోని poets clubలో ఇది నిర్దిష్టత పొంద డం చూస్తాం. ఇక తెలుగు వచన కవిత్వంలో పద్యంలోని ఛందో లయ, గేయంలోని తాళ లయ సంగీ తం అధికారం తప్పించి, వస్తువు ప్రధానంగానే ఈ కవిత్వం పురుడు పోసుకున్నది. ఆధునిక కవిత్వం ఈ వరకు వచ్చిన సంప్రదాయ పరిణామవాదాన్ని తెలు గు కవిత్వం పేరిట, తెలంగాణ కవిత్వానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా జరిగిన సాహిత్య చరిత్ర పరిశోధనలను మినహాయిస్తే తెలంగాణ కవిత్వం ఈ వరకే చెప్పినట్టు ఒక ప్రశ్నకు, ఒక అణచివేతకు సమాధానంగానే విజృంభించింది.
కందుకూరి వీరేశలింగం రాయప్రోలు సుబ్బారావు యుగాల నుంచి నిన్నమొన్నటి వచన కవిత్వ విశ్లేషణ దాకా తెలంగాణ కవి త్వం తెలుగు కవిత్వంలో ఒక చిన్న పాయగా మాత్ర మే చిత్రించారు. అంతెందుకు? ఇటీవల ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న కవితా సంకలనాల్లో ఒకరిద్దరు తెలంగాణ కవులను మినహాయిస్తే మిగతా కవులు గాని, వాళ్లు చెప్తున్న భావజాలం గానీ పరోక్షంగా వలస పెత్తనాన్ని మళ్లీ మనపై రుద్దే ప్రయత్నంగానే కనబడుతున్నది. కొన్ని కవితా సంకలనాల్లో చిత్రంగా ఇక్కడి కవులు కూడా సంపాదక భాగస్వామ్యం తీసుకోవడం, అదేదో కవితల ప్రచురణలో మహా ప్రమాణాలు పాటిస్తున్నామని, ఆంధ్ర ప్రమాణాలతో జబ్బచరచుకోవడం ఇక్కడి కొందరు మహా కవులకు ఇంకా అమాయకత్వంతో ఆవహించిన ఆం ధ్ర భ్రమగా మనం గుర్తించాలి. కాగా ఈ వరకే చెప్పినట్టు ఈ ఆంధ్ర దృక్పథంతో సాగిన విగడనను పక్క కు పెడితే, సాహిత్యంలో వినిర్మాణ వాదం ప్రవేశించిన తర్వాత తెలంగాణ వాదం మరింత అస్తిత్వంతో తొణికిసలాడింది.
ఈ క్రమంలో తెలంగాణ వచన కవిత్వాన్ని పరిశీలిస్తే ఎన్నో విశేషాలు కనబడతాయి. వచన కవితారచనను గురించి Robert Frost it is like playing tennis without net. అంటాడు. వచ న కవితలో వచనం దూరితే తాను చెప్పదలుచుకు న్న వస్తువుకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ వచనం దూరకుండా కాపాడే శక్తి కవికి సాధన ద్వారానే వస్తుంది. అభ్యాసుడైన కవికి సాధారణంగా వస్తువే భాషను, నిర్మాణాన్ని ఎన్నుకుంటుంది. ఇది కవితాత్వికతకు అనురూపమైన వ్యక్తీకరణను సాధిస్తుంది. తాత్వికత కవి వ్యక్తిత్వానికి అనురూపంగా ఉంటుంది. తాత్వికత కవి సామాజిక వర్గాన్ని బట్టి, అతడు పుట్టిపెరిగిన వాతావరణాన్ని బట్టి, విద్యాలయాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి వస్తుంది. కవితా వస్తువుకు తల్లిదండ్రి, భార్య, అన్న, చిన్ననాటి స్నేహితుడు, తన ఊరు, తన ముందు జరిగిన యాక్సిడెంట్, సంతోషం, దుఃఖం, ప్రణయం, సోదరి ప్రేమ ఇట్లా రకరకాల అంశాలు ప్రేరకాలవుతాయి. అతని వ్యక్తిత్వాన్ని బట్టి, సాధనను బట్టి, జ్ఞానాన్ని అనుసరించి వ్యక్తీకరణ ఉంటుంది.
తెలంగాణ కవులు తమకు ఈ వరకు ఉన్న ప్రాపంచిక దృక్పథాన్ని తాత్విక పునాదులను నిర్మాణవాదం ద్వారా పొందిన స్ఫూర్తితో తెలంగాణకు అనుసంధానించడం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, రాష్ట్ర అవతరణ జరిగినాక మన కలలు ఫలవంతం చేసుకునే దిశలోనూ తెలంగాణ కవి వ్యక్తీకరణలు ప్రత్యేకంగా గమనించదగినవి. రాజ్యం నిరంకుశత్వం ప్రశ్నిస్తూ 1980-90 వరకు రాసిన కవి గ్రామాల్లో భూస్వామ్యం నడ్డివిరిచే వరకే ఆగిపోలేదు. ఊహాజనితమైన విశాలతతో అగమ్యంగా ఉన్న తన విప్లవ భావజాలాన్ని తెలంగాణ వైపునకు మరలించాడు. వర్గ శత్రువు కంటే వలస దోపిడి దారే ప్రమాదకారి అని తెలంగాణ కవి గుర్తించిండు. ఈ వరకు స్త్రీవాద, దళితవాద, మైనారిటీ వాద వరుసలో ఉన్న తెలంగాణ సాహిత్యకారులకు తెలంగాణ దోపిడీ తక్షణ సమస్య అని అర్థమైంది. క్రమంగా తెలంగాణ సాహిత్య కారుని అడుగులు ఈ విషయంగా ముందుకు పడడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవానికి ఊపిరి లూదిన థామస్ పెయిన్, తెలంగాణ బుద్ధిజీవికి ఆదర్శం అయ్యాడు.
1996లో జరిగిన సిద్దిపేట మంజీరా రచయితల సభ,1997, నవంబర్ 1 హైదరాబాద్‌లో మొజాంజాహీ మార్కెట్ అశోక్ టాకీస్‌లో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో జరిగిన సభ, 1997లో వరంగల్‌లో జరిగిన డిక్లరేషన్ సభ, బుద్ధిజీవులు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను సూచిస్తూ చేసిన ప్రయత్నాలు. నాటి తెలంగాణలో ఒక దిశలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. అమానవ త్వం మన సాంస్కృతిక విలువలని ప్రశ్నార్థకం చేసిం ది. ఈ విషయమే ఎస్.రఘు ఇట్లా ప్రస్తావిస్తాడు.
‘ఎండిపోయిన కన్నీటి చారికల లాంటి నేల మీద ఆంధ్ర రాజకీయాల వ్యాపారరంగాల్లో ఎండుటాకుల్లా రాలిపోతున్నాం కళ్ల ఎదుటే కాళ్ళ కింద భూమి కోల్పోతున్న నిరాశ్రయులం (పొక్కిలి )
ఈ విధంగా అనేకమంది కవుల జీవవంతమైన కృషి ఉద్యమంతో పాటు కొనసాగింది. చివరికి కవి కల నెరవేరింది. తెలంగాణ సాకారమైంది. సబ్బండవర్ణాల సమరం విజయకేతనం ఎగురవేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కూడా కవి విశ్రమించలేదు. ఏనాడు ఏ రకమైన ప్రశ్న తెలఎత్తినా, కవి స్పృహ అందుకు అనుగుణంగా పరావర్తనం చెందుతూనే ఉన్నది.తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కవులు తన ప్రయాణం ఆపలేదు.
కాగామళ్లీ ఇప్పుడు ఆంధ్ర వలసవాదులు బహురూపాలతో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తూనే ఉన్నారు. కవికి కవితా సాధనతో పాటు ఆధునిక సామాజిక పరిణామాల పట్ల మరింత జాగ్రత్త అవసరమైన కాలం మళ్లీ వచ్చింది. మన అస్తిత్వానికి కొత్త ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. తెలంగాణ కవి ఉద్యమ స్పృహతో పునరుత్థానం చెందవలసిన సందర్భం మళ్లీ ఆసన్నమవుతున్నది.
– కాంచనపల్లి గోవర్ధనరాజు 96760 96614