కణకణమండే కొలిమి గొంతులోంచి కవి గన్నోజు ప్రసాద్ వేసిన కవిత్వ పెనుకేక ఈ తాజా దీర్ఘకవిత కొలిమి. కష్టాలు, కన్నీళ్ళు ఈ కొలిమిలో కాగికాగి అస్పష్టతకు, సంక్లిష్టతకు ఆస్కారం లేని పదునైన పల్లెపదాల్లోంచి పెల్లుబికిన ప్రతిఘటనా భాస్వరం ఈయన కవితాస్వరం. ఇది ఆయన వైయక్తిక కవిత్వ జీవనగీతం…ఇప్పటికీ మానని గాయాలు సలుపుతున్న బాల్యపు జ్ఞాపకాల సమాహారం.
పల్లేరు కాయల నీడలో ఆశాజీవిగా పురుడోసుకున్న నేను కులవృత్తి కార్ఖానాలో బాల్యాన్ని బహుమతిగా తాకట్టు పెట్టుకున్న మా కొలిమిలో అంటకాగిన
నా కలము కవన హలమై కావ్య భువనాన్ని చెక్కుతున్నది.
కడుపుమంట పలికించిన పై కవితావాక్యాలు గన్నోజు ప్రసాద్ తన కులం కడగండ్లను కలంసిరాలో ముంచి కొలిమి సెగలకు బొబ్బలెక్కిన తన మునివేళ్ళ వేదనస్వరంలోంచి పలికిన విశ్వకర్మ విశ్వఘోష. ఈ కవి కొలిమి మంటలను మాటలుగా కూర్చి తారాస్థాయిలో చేసిన కవితాగానమే ఈ కొలిమి దీర్ఘకవిత. కవి గన్నోజు రాజేసిన ఈ ఆత్మకథనాత్మక కవిత్వ కొలిమి కేవలం తన బాపు, అమ్మల చుట్టూ అల్లుకున్న వాళ్ళ ఒక్క ఊరి కథ కాదు, తెలంగాణ పల్లెల్లోని విశ్వకర్మల కుటుంబాలు, మరీ ముఖ్యంగా కమ్మరి వృత్తిదారులందరి కన్నీళ్ళ జీవనచిత్రమే ఈ కవిత్వం. అంతేకాదు ఆ ఊర్లోని కొలిమితో పెనవేసుకున్న సహస్రవృత్తుల సమస్తచిహ్నాల ప్రతీకాత్మక విరాట్ స్వరూపం. ఈ కొలిమికి కులమతాల మధ్య తేడా తెలవదు.
భూమాత ఎదను
ఒడుపుగా తొలవాలన్నా
భూగర్భ సిరులని
ప్రేమతో పిలవాలన్నా
కమ్మరి కొలిమిని
తలవాల్సిందే… అంటాడు.
భూమిని చీల్చే నాగలి కర్రులైనా, కోతకొచ్చిన పంటను కోసే కొడవళ్లైనా కొలిమి మంటల్లో నిత్యం కరగాల్సిందే, సుత్తెదెబ్బలకు పదును దేరాల్సిందే. దాతికాడి పనిముట్లు వాళ్ళ బాపు చేతులకు చేసే గాయాలు చెప్పే గడ్డకట్టిన నెత్తుటి బాధలే. ఎప్పటికీ ఒడవని గాథలంటాడు.
పల్లెల్లోని విశ్వకర్మ కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోయి బతుకుపోరును కొనసాగించేవే. వాళ్ళ పిల్లలకు అక్షరజ్ఞానం అబ్బాలన్నా, కొలిమి దగ్గర, కుంపటి దగ్గర పనిచేయాల్సిందే. రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు వాళ్ళవి. నిత్యం చెమటనదిలో ఇనుమును నానబెట్టి కన్నీళ్ళ పొంగులో చల్లబరిచి శిల్పసౌందర్యానికి జీవం పోసిన బాపుతోపాటు వాళ్ళ అమ్మ కొలిమిని రాజేయడంలో పోషించిన గణనీయమైన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటాడు. కులవృత్తినే నమ్ముకున్న విశ్వకర్మల కుటుంబాలెన్నో చేయటానికి పనిలేక, తినటానికి తిండిలేక, చేసిన అప్పులు తీర్చలేక కూలినాలికి పోవాల్సిన దయనీయ పరిస్థితి. ముఖ్యంగా స్వర్ణకార కుటుంబాలు ఎంతో చితికిపోయినవి. రెడీమేడ్ బంగారు షాపులవల్ల పనిదొరకని స్వర్ణకారులెందరో కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలెన్నో.
ఎండిన పేగులు
పొగగొట్టాలై
కదులుతున్నా
ఎదమీద రగిలే పేదరికజ్వాలలు
కళ్ళను మాటిమాటికి
ఎరుపెక్కిస్తున్నవి
ఈ చేతివృత్తులవాళ్లు చైతన్యవంతులు కానంతవరకు, వాళ్ళ బతుకుల్లో మార్పురాదని ఆ వెనుకబాటుతనానికి కారణమైన వ్యవస్థ మీద ఐకమత్యంగా తిరుగుబాటు చేయటమొక్కటే మార్గమంటాడు. ఇప్పటికైనా కొడవళ్లను చేసిన మనచేతుల్లో ప్రశ్నల కొడవళ్ళు మొలవాలి. అణకువని చిలికిన మన కళ్ళల్లోంచి నిప్పుల వర్షం కురవాలి. మన గాయాల గేయాలకు కొత్త రాగాలల్లుకోవాలి. ప్రగతిపథంలో సాగిపోవాలి. బహుజన వర్గాలన్నీ ఏకమై నూతనచరిత్రకు శ్రీకారం చుట్టాలనేది ఆయన సదాశయం.
-ప్రొఫెసర్ బాణాల
శ్రీనివాసరావు 9440471423