జానపద గేయ సాహిత్యంలో ఉయ్యాల (బతుకమ్మ) పాటలది ఒక ప్రక్రియ. ఉయ్యాల పాటలకు బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, దసరా పాటలు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి స్త్రీల పాటలే. అయితే, ఇవి జోల పాటలు కావు. ఊయల ఊపులాగా ముందుకెళ్లి మళ్లీ వెనక్కి తిరిగివచ్చి, తిరిగి ముందుకువెళ్తూ ఉంటుంది. అందుకే ఈ గేటు ప్రక్రియకు ఉయ్యాల పాట అని పేరు వచ్చింది. రెండు చేతులా చప్పట్లు చరుస్తూ, ముందుకు వంగుతూ లేస్తూ, గుండ్రంగా తిరుగుతూ ఈ పాటలు పాడుతారు. ప్రతి పాదం చివర ’ఉయ్యాలో’ లేక ‘వలలో’ అనే వూత్, లేక వంత ఉంటూ లయానుగుణంగాపాట సాగుతుంది.
గ్రామీణ జానపదుల విశ్వాసాల నుంచి నిష్కల్మష నిర్మల హృదయ క్షేత్రాల నుంచి మొగ్గ తొడిగినవే ఈ జానపద పాటలు. వీటికి మన తెలంగాణ నేలే పుట్టిల్లు. ప్రజా జీవనంలో చైతన్యంలో భాగమైన ఈ ఉయ్యాల పాటలు నేటి అధునిక జీవనశైలి, డిష్ యాంటినా, నెట్, విష సంస్కృతి వలయంలో చిక్కుకొని తమ ఉనికిని కోల్పోతున్నాయి. అయితే, మన ఆచార సాంప్రదాయాలు, మనం చేసుకునే పండుగలు ఈ పాటలకు చిగురు తొడగడం ఆనందదాయకం.
తెలంగాణలో బతుకమ్మ పాటలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ‘శ్రీలక్ష్మీదేవియు చందమామా-సృష్టి బ్రతుకమ్మయ్యే చందమామ/ పుట్టినా రీతిచెప్పే చందమామ’-భట్టు నరసింహా కవి చందమామ అనే పాట. బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలను తెలియ జేస్తుంది. ఈ పండుగ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకొంటారు.
వెడల్పయిన పళ్లెం మీద గుమ్మడాకులు పరిచి వాటి మీద గునుగు, తంగేడు, బంతి వంటి రంగు రంగుల పూలు గోపురాకారంగా పేర్చి స్త్రీలు పూజిస్తారు. చప్పట్లు చరుస్తూ చుట్టూ తిరుగుతూ ఈ పాటలు ఆలపిస్తారు. ‘శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ.. చిత్రమై తోచునమ్మా…’ అంటూ ‘తలుపుకు తాళాలు వలలో… యెండి చీలాల వలలో’, ‘బతుకమ్మ బతుకు ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఈ పాటలలోని పాదాలు త్రిశ్ర చతురస్ర గతిలో నడుస్తుంటాయి. ఇలాంటివే కాక గౌరిపూజ సందర్భంలో ‘రుద్రాక్ష చెట్లల్ల ఆట చిలుకల్లారా, పాట చిలుకల్లారా, కలికి చిలుకల్లార, కొలికి చిలుకల్లారా.. కుందమ్మ గువ్వలు/ నీ నోము నీకిత్తునే గౌరమ్మ- నా నోము ఫలమివ్వవే గౌరమ్మ’ అంటూ స్త్రీలు తమ పాటలలో భక్తిని వ్యక్తం చేసేవారు. ఉయ్యాల పాటల్లో అనేక విషయాలతో పాటు సామాజిక జీవన చిత్రణ సైతం ఆయా సందర్భాలలో కనబడుతుంది. వీర కృత్యాల వల్ల, దొమ్మిల వల్ల, నిరంకుశత్వాన్ని ఎదిరించటం వల్ల, సహగమనాధికారాలను నెరవేర్చడం వల్ల ప్రసిద్ధమై, హృదయాలను ఆకర్షించిన సంఘటనలను కథా వస్తువుగా గైకొని గానం చేసిన సందర్భాలు కనిపిస్తాయి.
పితృ, మాతృస్వామ్యాల మధ్య చెలరేగిన ద్వేషాన్ని కొన్ని గేయాలు ప్రచ్ఛన్నంగా తెలుపగా, అతి ప్రాచీన మాతృసామ్య వ్యవస్థ ఉత్పత్తి పరిణామ పతనం శివశంఖు కథలోని ఉయ్యాల పాటలో వ్యక్తమవుతుంది. ‘తెల్లని గుడ్లాకు ఉయ్యాలో- తెచ్చే రగుతాలు/ ఎర్రనీ గుడ్లకు- ఎత్తేసే కోపాలు/ నిలువునా పానంబు..’ అంటూ సాగుతుంది. వారికి జీతభత్యాలు రాజులిచ్చేవారు. ‘ఇద్దరక్కచెల్లెండ్లు ఉయ్యాలో/ ఒక్క ఊరికిస్తే ఉయ్యాలో/ ఒక్కడే మా అన్న ఉయ్యాలో/ వచ్చన్నబోడు ఉయ్యాలో’ అంటూ సాగే పాట ఆడపిల్లలకు అన్నపై ఉండే ప్రేమతో పాటు నాటి చేతివృత్తులను, నేత పనితనాన్ని తెలియజేస్తుంది. ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్/ బిడ్డాలెందరాయె కోల్/ నీ బిడ్డ నీలగౌరు కోల్/ నిచ్చెమల్లే చెట్టేసే కోల్’ అంటూ సాగే ఈ పాటలో పెరుగుతున్న చెట్టుకు, ఆడపిల్ల పోలిక చెప్తూ దేవుళ్లందరిని గుర్తుకు చేసుకోవడం గమనిస్తాం. ఉయ్యాల పాటలు నాటి పరిస్థితులకు అద్దం పట్టాయి. బతుకమ్మ పాటలు సాంస్కృతిక చిహ్నంగానే కాకుండా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యాయి. బ్రతుకు పాటలుగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలపాలి. రాజకీయ ఎత్తుగడలు ఎలా మారినా, విపత్కరమైన ఏ కాలంలోనూ.. ఈ సాహిత్యాన్ని ప్రాణపదంగా కాపాడుకోవల్సిన అవసరం తెలంగాణ వారసులుగా మనందరిపై ఉన్నది.
-డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327