బతుకమ్మ పండుగ వస్తుందంటేనే ఊరూరా ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఇంటింటా ఉత్సవ సంరంభం వెల్లివిరుస్తుంది. చిన్నా- పెద్దా, బీద-ధనిక, ఆడ, మగా తేడా లేకుండా అందరూ జరుపుకొనే పండుగ ఇది. బతుకమ్మ ఆడవాళ్లు మాత్రమే జరుపుకొనే పండుగ అని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. ఈ పండుగ కోసం అందరూ ఏడాది నుంచి ఎదురుచూస్తుంటారు. ఇది ఐకమత్యపు పండుగ.
బతుకమ్మ సామాన్యుల పండుగ. సబ్బండ వర్గా లు సంతోషంగా పండుగ. రెండు వారాల పాటు పిల్లలందరికీ ఆటవిడుపు. సకలవర్గాల వారికీ సంతోషాన్ని కలిగించే ముద్దు ముడుపు. తెలంగాణలో ఈ పండుగకు పెండ్లయిన ఆడపిల్లలు తప్పకుం డా తల్లిగారిండ్లకు వస్తారు. ఒకరకంగా ఇది బాంధవ్యాలను నిలిపి ఉంచే పండుగ.
ఈ విషయం వివరించే ఒక పాట కూడా ఉంది. ఇలా సాగుతుంది పాట. ‘కలవారి కోడలు కలికి కామాక్షి – కడుగుచున్నది పప్పు కడవల్లో పోసి- అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న- కాళ్లకు నీళ్లిచ్చి కన్నీళ్లు నింపె- ఎందుకీ కన్నీళ్లు ఏమి కష్టాలు- తుడుచుకో కన్నీరు ముడుచుకో కురులు- ఎత్తుకో పాపడ్ని ఎక్కు అందలము- చేరి మీ వారితో చెప్పి రావమ్మా- వంట చేసే తల్లి ఓ అక్కగారూ-మా అన్నలొచ్చారు మమ్మంపుతారా- నేనెరుగ నేనెరుగ మీ బావనడుగు రచ్చలో కూచున్న రాజేంద్ర భోగి- మా అన్నలొచ్చారు మమ్మంపుతారా- తుడుచుకో కన్నీరు ముడుచుకో కురులు సుఖముగా పుట్టిల్లు పోయి రావమ్మా!’ అంటూ ముగుస్తుంది. పెండ్లయిన ఆడపిల్ల అత్తవారింటిలో ఇంతమంది అధికారాల మధ్య మెలగాలని ఈ పాట తెలియజేసినా.. అంతిమంగా భర్త సహకారం, ప్రేమ ఉంటే మిగతావారు అడ్డు చెప్పరనే సత్యం కూడా ఉన్నది.
వ్యవసాయదారులే కాక ఇతరులు కూడా వర్షాకాలం ఆరంభంలో చేల గట్ల మీదో, నీళ్ల తొట్ల పక్కనో, ఇంటిపెరట్లోనో నారుపోసి తప్పక బంతి, గోరింట, ఉద్రాక్ష వంటి మొక్కలు పెంచుకుంటారు. ఈ పూలు కేవలం బతుకమ్మ పండుగ రోజుల కోసమే, బతుకమ్మను అలంకరించడానికే. ఇత ర పండుగలకు, వ్రతాలకు, నోములకు కావాల్సిన పూలకు బోలెడు ఖర్చు అవసరం కాగా.. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి వాడే తంగేడు, గునుగు, కట్ల, గన్నేరు, సీత జెడ, అల్లి, తామర వంటి పూలు కానీ ఖర్చులేకుండా దొరికేవి, గృహస్తుకు భారం కానివి. ఇక బతుకమ్మ పాటలు ఒక గొప్ప సాహిత్య సృష్టి. ఒక ప్రత్యేక ప్రక్రియ. ఎవరు రాశారో తెలియక పోయినా తరతరాలుగా జనుల నోళ్లల్లో నాని.. మౌఖికంగా బహుళ ప్రాచుర్యం పొంది నేటికీ నిలిచిపోయా యి. కాలం మారినా ఇప్పటికీ కొనసాగుతూ, నాటి స్త్రీ హృదయ సంవేదనను తెలుసుకోవడానికి ఒక పరిశోధన అంశంగా నిలబడ్డాయి.
పువ్వులను పూజించడం, నీళ్లను ఆరాధించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే. జపాన్ దేశంలోని అందమైన పువ్వుల అమరిక ‘ఇకబెనా’ కంటే గొప్పదైనది బతుకమ్మ పూల అలంకరణ. అలాగే ‘దాండియా’ లాంటి ప్రత్యేక కోలాటంతో సరిసమానమైన ఆదరణ ను చప్పట్లతో ఆడే బతుకమ్మ ఆట పొందింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ చొరవ, ప్రోత్సాహం తో బతుకమ్మ ప్రాధాన్యం మరింత హెచ్చింది. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో మాత్రమే ఆడే బతుకమ్మ ఇప్పుడు నగరాలకు పాకింది. వివిధ రాష్ర్టాల వారు కూడా ఇష్టంగా బతుకమ్మను నెత్తికెత్తుకుంటున్నారు.
(అక్షరయాన్ సౌజన్యంతో)
-నెల్లుట్ల రమాదేవి