తెలుగు సాహిత్యంలో చారిత్రక జానపద వీరుల ప్రశస్తి చాలా తక్కువే. అందునా తెలంగాణ వీరుల ప్రసక్తి అనేకానేక కారణాల వల్ల మృగ్యమైపోయింది. ఆంధ్ర ప్రాంతంలో స్వాతంత్య్ర సమరయోధులుగా పూర్తి ఆధారాలు లేకపోయినా ప్రచారం పొందిన వీరులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుకు సంబంధించి రంప తిరుగుబాటు ఆధారాలు కొన్నే ఉన్నా, ఆదర్శ స్వాతంత్య్ర సంగ్రామ వీరుడుగా చరిత్రలో నిలబడిపోయాడు.
కన్నెగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొదలైన వాళ్లందర్నీ స్వాతంత్య్ర సమర పోరాటయోధులుగా చెప్పుకుంటారు. 1178-1182లో కారంపూడి దగ్గర జరిగిన పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు, కన్నమదాసు, మలిదేవరాజు లాంటి పాత్రలన్నీ భారతంలో పాత్రల మాదిరిగా చారిత్రక ప్రశస్తి పొందాయి. 1757 జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధం వీరులు తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి రంగారావు లాంటి వాళ్లకు కూడా అలాంటి ప్రశస్తే ఉన్నది.
తెలంగాణ విషయానికి వస్తే.. చారిత్రిక వీరగాథా కావ్యాలు తక్కువే. సర్వాయి పాపన్న, గద్వాల సోమనాద్రి, రాణి శంకరమ్మ లాంటి వీరులను ఎందరినో నిన్నమొన్నటి వరకు నామమాత్రంగానే గుర్తు చేసుకున్నాం. ఈ పరిస్థితిలో ఒక అజ్ఞాత తెలంగాణ వీరుని కథనాన్ని గొప్ప కావ్యంగా మలిచారు కాంచనపల్లి గోవర్ధన్రాజు.
తెలంగాణ ఉద్యమాల్లో ప్రారంభం నుంచి చురుకుగా పాల్గొన్న కాంచనపల్లి గోవర్ధన్రాజు ‘తండ్లాట’ పేరుతో ఉద్యమ దీర్ఘకవితను ప్రచురించారు. తెలంగాణ వచ్చాక కూడా ‘కల యింకా మిగిలే ఉంది’ వచన కవితా సంపుటి, ‘ఒక వర్షం కురిసిన రోజు’, కథా సంపుటి, ‘తరాజు’ వ్యాస సంపుటి, ‘పెంకుటిల్లు’ కవితా సంపుటి మొదలైనవన్నీ పూర్తిస్థాయి తెలంగాణ సాంస్కృతిక నేపథ్యంతో ప్రచురించినవే. అదే తెలంగాణ సోయితో ఇదిగో…‘నిరుడు కురిసిన నిప్పు బల్మూరి కొండల రాయుడు’ అనే ఈ గేయకవిత్వం అందించారు.
బల్మూరు కొండల రాయుడు ఒక సాహస వీరుడు. ఆయన కరీంనగర్ ప్రాంతానికి చెందిన చల్లూరు పాలకుడు రఘుపతిరాయుని కొడుకు. రఘుపతి రాయుడు పొలాస పాలకుడైన జువ్వాడి మాధవరావు అల్లుడు. జువ్వాడి మాధవరావు, వెంకటరావుల తండ్రి రామారావు. ఇద్దరు కొడుకులూ సమర్థులు కారు. దుష్టబుద్ధులు. మాధవరావు చనిపోతూ తన కుటుంబాన్ని అల్లుడు రఘుపతిరావు చేతిలో పెడతాడు. రఘుపతిరావు పొలాసను తీర్చిదిద్దుతాడు. కానీ బావమరుదుల దౌష్ట్యాలను నియంత్రిస్తాడు. దాంతో బావమరుదులు తిరుగబడి ఆయనను ధిక్కరిస్తారు. రఘుపతిరావు భార్య ధర్మాంబ తమ్ముల మీద ఆగ్రహించి, అక్కడి నుంచి వెళ్లిపోదాం అని భర్తతో అంటుంది. చివరికి మానాల అనే బీడు నేల రఘుపతికిచ్చి వెళ్లగొడతారు బావమరుదులు.
రఘుపతి ఆ నేలను సస్యశ్యామలం చేసి ఏలికగా మారుతాడు. ఢిల్లీ సుల్తాన్‌ను మెప్పించి పదూళ్ల మీద అధికారానికి ఫర్మానా తెచ్చుకుంటాడు. ఆయన వైభవం సహించని బావమరుదులు రఘుపతిరాయుని కొడుకు కొండల రాయుడు పసివాడుగా ఉన్నప్పుడే అతని జన్మదిన వేడుకల్లో కుట్ర పన్ని రఘుపతిని చంపేస్తారు. ధర్మాంబ పసివాడిని తీసుకొని పారిపోతుంది. పెరిగి పెద్దయిన తర్వాత కొండలరాయుడు ఈ కథంతా తెలుసుకుని తన మేనమామల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. తరువాత ధనవంతులను దోచుకుంటూ పేదలకు పంచుతాడు. హైదరాబాద్ నవాబు కో పించి ఇతర రాజులను ఏకంచేసి నిజామాబాద్‌లోని రాళ్ల గుట్ట దగ్గర కొండల రాయుడును ముట్టడిస్తారు. శత్రువులకు చిక్కడం ఇష్టం లేక కొండల రాయుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది ఇందులో స్థూలమైన కథాంశం.
కరీంనగర్‌కు చెందిన మలయశ్రీ ఈ విషయంగా పరిశోధన చేశారు. సిహెచ్.శ్రీనివాసరాజు అనే రచయిత దీనిని నవలగా కూడా రాశారు. ఆచార్య త్రివేణి కూడా పరిశోధనలు చేశారు. ఇవన్నీ భూమికగా తన కల్పన కూడా జోడించి కావ్యంగా తీర్చిదిద్దారు కాంచనపల్లి.
ఈ కావ్యంలో మానాల, పొలాస, కొండగట్టు, ధర్మపురి, ఎల్లగడప, ఇందూరు, పల్లికొండ, వెలిగందుల, ఆందోలు, బదనకుర్తి, చల్లూరు, గోదావరి నది, గోల్కొండ, దౌలతాబాద్, బాచన్పల్లి (రాళ్లగుట్ట) లాంటి ప్రదేశాలు వస్తాయి. 17వ శతాబ్దానికి చెందిన కొండల రాయుడు కరీంనగర్ జిల్లాలో జన్మించాడు. ఆదిలాబాద్‌లో పెరిగాడు. మెదక్, నిజామాబాద్ జిల్లాలు ఆయన స్థావరాలు. చివరికి నిజామాబాద్‌లో అస్తమించాడు. ఈ నాలుగు జిల్లాలకు చెందిన వీరునికి చారిత్రక ప్రశస్తి తేవడమే బహుశా ఈ ప్రయత్నమై ఉంటుంది. ఒక బండపై కూర్చుండి పాట పాడుతుంది అందమైన యువతి. అశ్వంపై వెళ్తున్న కొండలరాయుడు అశ్వం ఆపి దిగి ఆమె దగ్గరికి వెళతాడు. ఆ దృశ్యం చూడండి.
కత్తికే ప్రాణములు వచ్చి
కదలి పోయెను పో విచిత్రము
కలువ పువ్వుల కన్నులామెవి
కమల పుష్పపు కన్నులతనివి
కత్తికే ప్రాణాలు వచ్చాయట. ఈ రూపకాలంకారంలో అతను ఎంత వీరుడో చెప్తున్నారు. మత్తగజం మనిషిగా మారిందట. ఈ ఉత్ప్రేక్షలో అతని నడక గాంభీర్యాన్నే కాదు, పాట విని అతను ఎంత పరవశుడయ్యాడో కూడా చెప్తారు. అతను నడిచి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె నడిచి అతని చేరిందా, లేక అతనే ఆమెను చేరాడా? ఈ మాటలో ఆమెకు కూడా అతని పట్ల ఉన్న ప్రేమ వ్యక్తమైంది. వాళ్లు నింగీ నేల కలిసిన విధంగా కలిశారు. ఇక్కడ కవి పోషించిన గొప్ప ధ్వని కనబడుతుంది. నింగీ నేల అసలు కలువవు. వాళ్లు కూడా ఈ కథా విధానాల్లో కలిసి కొనసాగకుండా వీరమరణం పొందుతారు. ఇంకా ఇదే విషయం కవి మరో అలంకారం ద్వారా స్పష్టం చేశారు. ఆమె కన్నులు కలువపువ్వులు. అతని కన్నులు కమలపుష్పాలు. కలువపువ్వులు రాత్రి వస్తాయి. కమలపుష్పాలు ఉదయం వస్తాయి. ఈ రెండు కూడా కలువడం జరుగదు. చివరికి ఇలా అన్నాడు. కలువ గలరో నిలువ గలరో చక్ర మేకము చేయుచున్.
ఒక చక్రం పైభాగం కిందికి పోయినప్పుడు కింది భాగం పైకి పోతుంది. భూ చక్రం కూడా అలాంటిదే. దీనిని ఎవరూ ఏకం చేయలేరు. వీళ్లు ఏకం చేస్తారా? అని ప్రశ్నించాడు కవి. ఏకం చేయలేరని అర్థాంతరం అడుగడుగునా గొప్ప రసధ్వని కావ్యంలో కనబడుతుంది. కొండల రాయుడు మేనమామలపై యుద్ధం చేసి విజయం సాధిస్తాడు. ఆ యుద్ధోత్సాహం ఈ (తురగవల్గన రగడ) పద్యంలో చూపించారు కాంచనపల్లి.
కదన విజయ విదిత
ధర్మ కర కరాళ ఫేన సిక్త
నిధన గర్వ రిపు జనశర
నిరుపమ శుభ హాస సిక్త
విజయదుందుభి మ్రోగించిన
కొండల రాయుడు
గొప్ప సరసుడు, సాహసి అని ప్రజలు అభినందిస్తున్న పద్యం ఇది. ఉత్పలమాల, చంపకమాల లాంటి వృత్త పద్యాలు, నాలుగైదు ఉపజాతులు ఇప్పటికీ సాహిత్యంలో కొనసాగుతున్నాయి. ఛందో కవులు ఈ తురగ వల్గన రగడ, కవిరాజ విరాజితము, పంచచామరము, తరళము లాంటి పద్యాలు రాసిన సందర్భాలు చా లా తక్కువే. విస్తరించిన వచన కవిత, పాటల మధ్య ఈ పద్యాలు చోటుచేసుకోవడం ఒక విశేషం. కొండలరాయుని మరదలు మంగ పాత్రను తానే ప్రవేశపెట్టాడు కవి. మరి పెద్దమామను కొండల రాయుడు చంపలేదు. విడిచిపెట్టాడు. అందుకు కారణం కావాలి కదా. అందుకే మంగళ అని పేరు కలిగిన మరదలు పాత్ర. ఆమె కొండలునితో ఇలా అంటుంది.
వీరా ఈరోజు దసర
నేడు జంబి ఆకు నిచ్చి
పెద్దల దీవెనలు గొనెద
రిచట తెలంగాణ సీమ.
ఆమె మళ్లీ ఇలా అంటుంది.
నీవు బాల్యమందే నీ
తండ్రిని గోల్పోవు కతన
ఎంతగ గోల్పోయినావొ
ఎరిగితి నేనును రమణా
నేను కూడా నీ వలనే
విలపింపగ జాలనయ్య
నాకు పితృభిక్ష పెట్టి
నన్ను ఆదుకొనుము బావ
ఆమెకు పితృభిక్ష పెట్టడం వల్లే తన పెద్దమామ బతికిపోయి తనపైనే ప్రతీకారం తీర్చుకుంటాడు. కొండల రాయుడు అందోలుపై దాడి చేసిన తర్వాత అటు ఢిల్లీ సుల్తాన్, ఇటు హైదరాబాద్ సుల్తాన్ ఆయన మీద హుంకరిస్తారు. సుబేదారులంతా ఒకటవుతారు. మేనమామ వెంకట రాయుడు వాళ్లకు మార్గం చూపెడతాడు. కొండల రాయుడు భార్య నాగవేణి (చంద్రకళ)తో కొండగట్టు మీద ఉంటాడు. అందోల్ యుద్ధంలో ఆయన చీలమండ దెబ్బతింటుంది. నాగవేణి ఉపచారాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా శత్రువులు చుట్టుముడతారు. కొండలరాయునికి విషయం అర్థమవుతుంది. ఆమెతో ఇలా అంటాడు.
ఓ మధు జీవన కమలా
ఓ ఉషా తుషార ముకుళ
నేనిక ఎక్కువ కాలము
మనజాలగలేను చూడ
ఏ రీతిగ నిన్ను ఒంటి
జేసి ఏగువాడ చెలీ
ఆమెకు పరిస్థితి అర్థమవుతుంది. కొండలరాయుడిని ఓదారుస్తుంది.
వీర రసము మానవాకృ
తిని, దాల్చు ధృతిని మరచి
ఈ రీతిగ బేల పలుకులను
పలుకగ సరియగునా?
ఆమె వేశ్య. అతను వెలమ వీరుడు. అయినా అతను ఆమెను స్వీకరించాడు. నాగవేణి ఇలా గుర్తు చేస్తుంది.
అరసి నన్ను స్వీకరించి ఆదర్శం నిలిపినావు నీవు లేని ప్రపంచాబ్ది నీదు శక్తి నాకు గలదె?
అకస్మాత్తుగా కొండలుని చురిక తీసుకొని ఆమె కడుపులో దించుకుంటుంది. ఆ సమయంలో కొండలుని దుఃఖం కవి చిత్రించిన తీరు హృదయ మూలాన్ని కదిలిస్తుంది. కొండలుడు అక్కడ నుంచి రోళ్ల గుట్టకు (నిజామాబాద్) వెళతాడు. అక్కడా అదే పరిస్థితి. శత్రువులకు చిక్కడం కంటే తనను తాను బలిచేసుకోవడమే సమంజసం అనుకుంటాడు. పితృ ప్రసాదితమైన ఖడ్గం బయటికి తీస్తాడు.
ఈ ఖడ్గమే రిపుల
శిరము బంతుల జేసి
అసహాయ శౌర్యమై
అవని రక్షించె గద
ఇట్లా తలుచుకోవడంతో తోటి బాణం వచ్చి ఆయన భుజానికి తాకుతుంది. అది మామ బాణమే. మరదలు మంగళకిచ్చిన మాట మనసులో మెదిలి మామను వదిలేస్తాడు. శత్రువులు పూర్తిగా చుట్టుముడతారు. తన తెల్లని అశ్వానికి నమస్కరించి తన కత్తితోనే పొడుచుకొని నేలకు ఒరుగుతాడు. వీరత్వమే అంగిరసంగా కొనసాగిన కావ్యం ఇది. విశ్వవిద్యాలయాలకు పాఠ్యాంశంగా, పరిశోధకులకు వస్తువుగా, సినీ దర్శక నిర్మాతలకు కథావస్తువుగా, వెరసి తెలంగాణ వాదులందరూ స్వీకరించవలసిన ఉత్తేజంగా నిలబడిపోయే కావ్యం ‘నిరుడు కురిసిన నిప్పు బల్మూరి కొండల రాయుడు’.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 9849893238