హెన్రీ వైట్ హెడ్ రాసిన ‘విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ గ్రంథాన్ని ‘దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు’గా, థామస్ పెయిన్ రాసిన ‘లిబర్టీ’ గ్రంథాన్ని ‘స్వేచ్ఛ’గా, సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఆన్ ఇల్యూషన్’ గ్రంథాన్ని ‘ఒకానొక భ్రమ భవిష్యత్-మతంపై మనో విశ్లేషణాత్మక పరిశోధన’గా తెలుగులోకి అనువదించారు ఈ ‘చరితార్థం’ పుస్తక రచయిత ఆనందేశి నాగరాజు. వైజ్ఞానిక దృక్పథాన్నీ, ప్రశ్నించేతత్వాన్నీ పెంపొందించే ‘ఆధునిక విజ్ఞాన శాస్త్రం-తాత్విక అంతరార్థాలు’ గ్రంథాన్ని రాశారు. విజ్ఞానశాస్త్రం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో అచ్చయిన కొన్ని వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
చరిత్ర అంటే గతంలో ఏం జరిగి ఉంటుందో అని ఊహించుకున్నది కాదు. గతంలో వాస్తవంగా ఏం జరిగిందో వైజ్ఞానికంగా నిర్ధారించుకున్నదే అసలైన చరిత్ర. దానికి అనవసర గొప్పలు, లేని లొసుగులు ఆపాదిస్తూ తమ సైద్ధాంతిక చత్వారాన్ని అంటగట్టడం తప్పు. సింధూ నాగరికత మూలాలనూ, అనాగరికులకూ, నేటి వివిధ కులాల, తెగల మధ్య జన్యు సంబంధాల గురించి ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు ఏం చెప్తున్నాయి? ప్రాచీన భారతదేశంలో మతానికీ, రాజ్యానికీ, నైతికతకూ, పరిపాలనకు, పర్యావరణానికి గల సంబంధాలను, అప్పటి కులవ్యవస్థనూ, సమాజంలో స్త్రీల స్థానాన్ని, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కౌటిల్యుని అర్థశాస్త్రం, బౌద్ధ జాతక కథలు ఎలా వివరిస్తున్నాయి? ఆదివాసీ ఆరాధన పద్ధతులు, బౌద్ధుల, హిందువుల మతాచారాలు పూరీ జగన్నాథ్‌లో సమ్మేళనం చెంది బుద్ధుడు.. విష్ణువు 9వ అవతారంగా ఎలా మారాడు? నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత భారత్‌లో తెలంగాణ కలవడం విలీనమా? విద్రోహమా? రాచరిక, మతతత్వం నుంచి విమోచనమా? కశ్మీర్ సుదీర్ఘ, సుసంపన్నమైన సాంస్కృతిక, సామాజిక చరిత్ర ‘కశ్మీరీయత్’ అంటే ఏం చెప్తుంది? ప్రాచీన వేదాలు, పురాణేతిహాసాలలో, ఆధునిక హిందూ తాత్వికులు దయానంద సరస్వతి, వివేకానందుడు, జాతీయ నాయకులైన గాంధీ, అంబేద్కర్ వరకు, పాశ్చాత్య మేధావులైన కార్ల్ మార్క్స్, మాక్స్ వెబర్ తదితరులు కుల వ్యవస్థపై ఏం చెప్పారో తెలియాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే.
కులాధిపత్యాన్ని ఎదిరించడమంటే మరో కులాధిపత్యాన్ని స్థాపించడం కాదు. తలకిందుల కుల వివక్ష కూడా కుల వివక్షే (Reverse casteism is also casteism). కుల విధానంలో ఒక కులం ఆధిపత్యం, ఇతర కులాలపై వివక్ష విడదీయలేని అంశాలు అయినందువల్ల ఏ కులాధిపత్యాన్నైనా ప్రశ్నించాలి. ఎదిరించాలి. నిర్మూలించాలి. అంతేకానీ, అధిష్ఠాన పీఠంపై ఒక కులం స్థానంలో మరో కులాన్ని నిలపడం కుల వ్యతిరేక ఉద్యమం కాదు.
మతతత్వం వైరస్ మరో మతతత్వంపై తప్ప స్వతహా బతుకజాలదు. ఒక మతాన్ని బుజ్జగిస్తే, దాన్ని సాకుగా చూపి మరొకటి బలపడుతుంది. మతతత్వం అనేది ఒక విష వలయం. ఒక మతతత్వం ఎక్కువ ప్రమాదకారి, మరొకటి తక్కువ ప్రమాదకారి అనే భావనే అత్యంత ప్రమాదకరం. మెజారిటీ, మైనారిటీ మతత్వాలపై ఉమ్మడి పోరే నిజమైన లౌకికవాద మ్యానిఫెస్టో.
– టీఆర్ఆర్