మనసును పూర్తిగా కమ్మేసిన
అవ్యక్తపు నీడలలో
ఏవో వింతలు జరుగుతూ
లోకం కొత్తగా వికసిస్తున్నట్టు తోచి
అసమభావనా వీచికలు
చెల్లాచెదురై విడిపోతున్నప్పుడు
నిద్రాణమైన
నిశ్శబ్దపు ఊహా తంత్రులు
దేనికోసమో ఆరాటపడుతూ
అపస్వర శబ్ద కంపనంతో
శృతి గతులు తప్పుతున్నప్పుడు
అనిశ్చిత ప్రాంగణంలో
నిర్వేదనాభరితమై
జీవనం నిరర్థకంగా
మాధుర్య విరహితంగా
మబ్బు మూసిన చంద్రికలా
దోబూచులాడుతున్నప్పుడు
గురు రూపమైన జ్ఞానదీప్తి
రేఖామాత్రంగా గోచరిస్తూ
అణుమాత్రంగా కదలాడుతూ
నిర్గమిస్తుంది అంతస్సులోకి
జాగృతం చేసిన సంవేదంతో
అంధకారాన్ని పరిమార్చి
అలౌకికానంద జగత్తులో
నిన్ను నీలా నిలబెడుతుంది!!
కరిగిపోయే జీవనాన్ని నిరూపిస్తూ
కాలగమన వేగంలో
క్షణాలు దొర్లిపోతున్నప్పుడు
అవిచ్ఛిన్నమైన ఆ ప్రకాశమే
సత్యాన్వేషణ సాధనంగా
నిలబెడుతుంది నీకు తోడులా
శాశ్వతమైన దివ్యపథంలా!!