రాచరికాలు ఊడలు దిగి
రక్తపుటేరులు పారిన నేలమీద
ప్రజాస్వామ్యానికై
విప్లవించిన విప్లవ పతాకం !
భుజాన నల్లగొంగడి
చేతిలో గుత్ప ఎర్రటి పంచె
గొంతు ఆకాశమైతే
భూస్వామానికి భూకంపం
పాటకు నిలువెత్తు ఎర్రజెండ
నెమళ్లు భళ్లున పింఛమిప్పినట్టు
ఏనుగులు లడాయికి
తొండాన్నెత్తినట్టు
సముద్రాలు ఉప్పొంగినట్టు
ఆటపాట పెనుతుఫానైన ఉగ్రగానం
కష్టజీవులకు అండగా
కార్మికుల గుండెగా
పాటల వెన్నెలను ఆయుధం చేసి
మేఘాల్ని బద్దలు చేసిన విప్లవజ్వాల
రేలారేలారే సప్త కలల సింగిడి
అమరుల జెండాను
భుజానేసుకొని
రాజ్యహింసను గల్లాపట్టి
రచ్చకీడ్చిన యుద్ధగానం
నేలరాలిన నక్షత్రాలను మండెగట్టి
సమసమాజ మార్పులు
సామాజిక హక్కులకై
సాగిన లాంగ్ మార్చ్
మోటకొట్టి దూపార్పిన పాట
వరిసేలకు నీళ్లు తాపిన రైతుపాట
వీరబ్రహ్మం తత్వమై తట్టి లేపిన కాలజ్ఞానం పాట
వేమన కబీరుల చైతన్యమై
సామాజిక రుగ్మతలను నిలదీసి కడిగేసిన పాట
నాజరు అడుగులో అడుగేసి
ఆలిసమ్మ కన్నీటిలో కారంచేడు
కాలాంతకులను నిలదీసిన కవిధీరుడు
ఉరుములు మెరుపులు
తాళాల దరువులు
గజ్జెల సవ్వడులు
నింగి నేల ఒక్కటై
తకతాలెల్లే లెల్లాయెలో..
అంటరానితనానికి
అగ్గిపెట్టిన అగ్నిస్వరం
మనువాదంపై మంటలై
మండిన మహా విస్ఫోటనం
ఆ రాగం వినిపించినంత దూరం
పక్షులు రెక్కలు విప్పుతయి
కెయ్యలు లగ్గొడతయి
ఎండిన బీళ్లు పూతపడ్తయి
పిడికిళ్లు హక్కులై పూస్తయి
సిరిమల్లె చెట్టు కింద
అమ్మా తెలంగాణమా
ఆకలికేకల గానమా
పొడుస్తున్న పొద్దుమీద
పోరు తెలంగానమై
తెలంగాణను వాగ్దానం చేసిన
విప్లవ సూర్యుడా! జోహర్లు !!
– వనపట్ల సుబ్బయ్య 9492765358