పుట్టిందీ, పెరిగిందీ ఉర్దూ వాసనే లేని పూర్తి తెలుగు సంప్రదాయ కోస్తా కుటుంబంలో. అలాంటి ఆయన ఎలాంటి పరిచయం లేని ఉర్దూను చదవడం, రాయడం నేర్చుకోవడం ఒక ఎత్తయితే.. రచయితగా, అనువాదకుడిగా పేరు తెచ్చుకోవడం మరొకెత్తు. ఉర్దూను పట్టుదలతో అభ్యసించి అందులో రచనలు చేసి, సాహితీవేత్తగా ఎదిగారు విశ్రాంత పాత్రికేయులు మూర్తి. నిజాం జమానాలో అధికార భాష అయిన ఉర్దూపై సాధికారత సాధించారాయన. ప్రముఖ రచయితలు రాసిన తొమ్మిది ఉర్దూ పుస్తకాలను, ఒక హిందీ కథా సంకలనాన్ని తెలుగులోకి అనువదించారు కూడా. కేంద్ర ప్రభుత్వ ఉర్దూ భాషా అభివృద్ధి జాతీయ మండలి సభ్యుడు అయిన మూర్తి ఉర్దూలో గజళ్లు కూడా రాశారు. గతంలో పాత్రికేయుడిగా ఉర్దూ ముషాయిరాలను రిపోర్టు చేశారు. పదుళ్లపర్తి వెంకట సూర్యనారాయణ మూర్తి.. క్లుప్తంగా పి.వి.ఎస్.మూర్తిని మెహక్ హైదరాబాదీగా తీర్చిదిద్దిన పరిణామక్రమం వెనక ఉన్న అద్వితీయమైన సాధన, కృషి ఎందరికో ఆదర్శం.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవారు ఉర్దూ నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. కానీ, భాష కంటే యాసకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో జన్మించిన మూర్తి.. ఉర్దూ సాహితీవేత్తగా పేరు ప్రఖ్యాతులు గడించడం విశేషమే మరి. పాత్రికేయుడిగా పనిచేస్తున్న మూర్తి 1991లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బదిలీ కావడం ఒక పెద్ద మలుపు. ఆయన ఉర్దూ సఫర్ నిజానికి యాదృచ్ఛికంగా మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో మూడు పదుల వయసులో ఆయన మళ్లీ బలపం పట్టి ఉర్దూ వర్ణమాల దిద్దారు. ఎందుకంటే, ఆ కొలువుకు ఉర్దూ తప్పనిసరి. అట్లా మొదలైన ఆయన ఉర్దూ సాధన కాలక్రమంలో అతన్ని సాహితీకారునిగా మలిచింది.
అయితే, మూర్తికి ఉర్దూ ఓ పట్టాన పట్టుబడలేదు. గురువు కోసం నెలలుగా అన్వేషించిన ఆయనకు రిటైర్డ్ డీఎస్పీ మోహన్ జీ అంబాజీ మాల్వే వద్ద శిష్యరికం చేసే అవకాశం లభించింది. మరాఠా గురువుకేమో తెలుగు రాదు. ఈయనకు ఉర్దూ రాదు. వారిద్దరినీ కలిపింది హిందీ. ఒక నెలలో నేర్చుకున్న ఉర్దూతో మూర్తి ఇంటర్వ్యూకి వెళితే అందులో సఫలం కాలేకపోయారు. కానీ, నిరుత్సాహపడకుండా తన గురువు వద్ద రెండేళ్ల పాటు ఉర్దూ నేర్చుకున్నారు. ఆ తర్వాత రిపోర్టర్‌గా ఉర్దూ ప్రోగ్రాంలు, సెమినార్లు, ముషాయిరాలకు హాజరై ప్రత్యేక కథనాలు, వార్తలు రాశారు. వృత్తిరీత్యా జర్నలిస్టు కాబట్టి, ఉర్దూ పత్రికలలో వచ్చే ఆసక్తికరమైన వ్యాసాలను అనువదించారు. మాజీ ప్రధాని ఐ.కే. గుజ్రాల్, రాజ్‌బహదూర్ గౌడ్ మౌలా నా వహీదుద్దీన్ ఖాన్, జఫర్ ఆఘా వంటి ప్రముఖులు రాసిన వ్యాసాలనూ ఆయన అనువదించారు.
ఉర్దూ నేర్చుకున్న తర్వాత గజల్ మీదికి మనసు పోకుండా ఉంటుందా! నుమాయిష్ మైదాన్‌లో ఏటా జరిగే శంకర్ జీ యాద్గార్ ముషాయిరాతో పాటు అద బీ ట్రస్ట్ ఇంకా పలు ముషాయిరాలకు ఒక సాహిత్య అభిమానిగా హాజరై వాటిని ఆస్వాదించారు మూర్తి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షాయర్ జనాబ్ రెహ్మాన్ జామి వద్ద గజల్ వ్యాకరణం నేర్చుకున్నారు. సాధారణంగా ఉర్దూలో మారుపేరుతో లేదా కలం పేరుతో గజల్స్ రాసే సంప్రదాయం ఉంటుంది. అందుకే పి.వి.ఎస్.మూర్తి కాస్త మెహక్ హైదరాబాదీగా మారిపోయారు. హైదరాబాద్‌కు చెందిన ప్రము ఖ షాయర్ జనాబ్ ముజ్తర్ మజాజ్ ఈ కలం పేరును సూచించారట. ఒక అక్షర భేదంతో ఒకే ఉచ్చారణతో పలికే ‘మెహక్’ పదానికి ‘పరిమళం’, ‘గీటురాయి’ అని రెండు వేర్వేరు అర్థాలున్నాయి. అందులో రెండోదే తాను ఎంచుకున్నానని మూర్తి చెప్తారు. మెహక్ రాసిన గజల్స్‌లో శ్రీకాంతాచారి అమరత్వంపై రాసిన గజల్ ప్రత్యేకమైనది. ఇది ఉర్దూ పత్రిక ‘ఎతెమాద్’ సాహిత్య పేజీలో అచ్చయ్యింది.
జీలానీ బానూ గతంలో రచించిన ‘ములిజిమ్’ అనే పాత కథ 2002లో జరిగిన గుజరాత్ మతకలహాల నేపథ్యంలో ‘సియాసత్’ పత్రికలో మళ్లీ ప్రచురితమైంది. అది హిందూ-ముస్లిం మత సామరస్యానికి సంబంధించినది. ఆ కథను ‘నేరస్థుడు’ పేరిట తెలుగులోకి అనువదించిన మూర్తి తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిన్నచిన్న కథలతో మొదలుపెట్టి క్రమంగా నవలలు కూడా అనువదించే స్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి జీలానీ బానూ కథలను ‘గుప్పిట జారే ఇసుక’, ‘అంతా నిజమే చెప్తా’ పేర్లతో అనువదించారు. ఆమె బాల్య జ్ఞాపకాలను ‘తెరిచిన పుస్తకం’ పేరిట గ్రంథస్థం చేశారు. ప్రసిద్ధ రచయిత సాదత్ హసన్ మంటో కథలను రెండు సంపుటాలుగా తెచ్చారు. అమృతా ప్రీతమ్ రచన ‘పింజర్’ నవలను ‘అస్థిపంజరం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
అన్నింటికన్నా ప్రధానంగా హైదరాబాద్ స్టేట్‌కు సంబంధించి రెండు ముఖ్యమైన పుస్తకాలను మెహక్ అనువదించారు. అందులో ఒకటి ప్రసిద్ధ కవి మఖ్దూమ్ మొహియుద్దీన్ రాసినది. ఆ పుస్తకాన్ని నాటి నిజాం సర్కార్ నిషేధించింది. అప్పట్లో సంచలనం రేకెత్తించిన ఈ పుస్తకం రహస్యంగా లాహోర్‌లో ముద్రితమైంది. అట్లాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలితరం పోరాట యోధుడు, సోషలిస్టు దిగ్గజం, ఆదిలాబాద్ మాజీ ఎంపీ చెరుకు మాధవరెడ్డి.. హైదరాబాద్ స్టేట్ పరిణామాలపై 1948లో ఉర్దూలో రాసిన ‘హైదరాబాద్ ప్రజా సమరం’ పుస్తకాన్ని మెహక్ అనువదించారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ దళిత రచయిత, వాగ్గేయకారుడు అణ్ణాభావూ సాఠే కథలను ఇటీవల హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన మూడు ఉర్దూ అనువాద ప్రాజెక్టులు చేపట్టారు. వాటి లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రచయిత బేగ్ ఎహ్సాస్ కథా సంకలనం ‘దఖ్మ’, బీహార్ రచయిత హుసేనుల్ హక్ నవల ‘అమావాస్ మే ఖ్వాబ్’, జ్ఞానచంద్ జైన్ మోనోగ్రాఫ్ ఉండటం విశేషం.
అంతేకాకుండా, హైదరాబాద్‌లో గత శతాబ్ది కాలం లో వందమంది ఉర్దూ రచయితలకు చెందిన ఒక్కొక్క కథను తెలుగులోకి తీసుకొచ్చే ఒక బహృత్ ప్రాజెక్టుకు చాలా ఏండ్ల క్రితమే ప్రణాళిక వేసుకున్నారు మెహక్. దీనిలో భాగంగా ఏడాది కిందట ‘గుల్దస్త’ పేరుతో తొలి సంకలనం తెచ్చారు. భవిష్యత్తులో మరో రెండు సంకలనాలు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉర్దూ పుస్తకాలను అనువదించడమే కాదు, ఉర్దూ నేర్చుకొనే ఔత్సాహికులను కూడా మూర్తి ప్రోత్సహించారు. గతంలో తాను పనిచేసిన ఓ పత్రికలో హైదరాబాత్ పేరుతో ఒక కాలమ్ నడిపారు. రోజూ నాలుగు ఉర్దూ పదాలు, వాటికి తెలుగు అర్థాలు అందులో వచ్చేవి.
‘గుప్పిట జారే ఇసుక’ పుస్తకానికి గానూ తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ అనువాద పురస్కారంతో మెహక్‌ను సత్కరించింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వంలోని ఉర్దూ భాషా అభివృద్ధి జాతీయ మండలిలో ఆయన్ని సభ్యునిగా నియమించింది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి ఒక తెలుగు వ్యక్తికి ఈ గౌరవం దక్కడం ఇదే ప్రథమం. సాహితీ కృషిలో ఆయన మరిన్ని మెట్లు ఎక్కాలని ఆశిద్దాం.
-తుమ్మలపల్లి రఘురాములు
93463 28291