ప్రపంచంలో కెల్లా భారతదేశం విశిష్టమైన వైవిధ్యాన్ని కలిగి ఉన్నట్టే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విశిష్టమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం వైవిధ్యభరిత సంస్కృతి, సాహిత్యంలోనూ విశిష్టతలు కనపడుతాయి. మరోమాటలో చెప్పాలంటే, భారతమాత కీర్తి కిరీటంలో కలికితురాయి తెలంగాణ తల్లి. రవి అస్తమించని వలస సామ్రాజ్యపు బంధనాల నుంచి విముక్తి సాధించిన భరతమాత కీర్తి కిరీటంలో అంతర్గత వలస బంధనాలను తెంచుకొని, గెలిచి, తలెత్తుకొని నిలిచిన కలికితురాయిగా వెలిసింది తెలంగాణరాష్ట్రం. ఆరు దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న రాష్ట్రమిది.
కోటి రతనాల వీణ నా తల్లి తెలంగాణ! నిలువెల్ల గాయాలతో విలపించే నేల నా తల్లి తెలంగాణ అన్న కాడి నుంచి పునర్నిర్మాణం దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రణాళిక వేసుకొన్నది.
తెలంగాణకు జరిగిన అవమానాలు, దోపిడీ గాయాలు ఇంకా పూర్తిగా మానలేదు. దాయబడి న, కనుమరుగైన తన అస్తిత్వం కోసం ఇంకా పెనుగులాడుతూనే ఉన్నది. వివక్షకు వక్రీకరణకూ గురైన తన చరిత్రను, సాహిత్యాన్ని, కవులను, కవయిత్రులను, సరిహద్దులను, సంస్కృతీ సంప్రదాయాలను, సంబురాలను, దేవీదేవతలను సహితం దేవులాడి భద్రపరుచుకునే పనిల వడ్డది తెలంగాణ. మాయమై రూపుమారిన చరిత్ర కావ్యాలను, పత్రికలను, గ్రంథాలను దేవులాడుకొని అదిమిపట్టి, తన పొత్తిళ్ల బిడ్డని చేసి సంరక్షణ చేసుకుంటున్నది. అట్ల తన దక్కన్ తెహజీబ్ చరిత్రను సగౌరవంగా ప్రకటించుకుంటున్నది.
ఆ క్రమంలోనే తాత్వికులను. దార్శనికులను, పద్యకవులను అన్వేషిస్తున్నది. చరిత్ర గనుల్లో తవ్వి దేవులాడిన ప్రాఙ్నన్నయ యుగపు గుణాఢ్యుడిని, హాలుడు, శాతవాహనులను తన వారేనని ఆత్మీయంగా అలుముకొన్నది. సాధికారికంగా ప్రకటించుకున్నది తెలంగాణ. గొప్ప తాత్వికుడు, తెలంగాణ వేమనగా పిలుచుకోదగిన తత్వా ల దాసు, దున్న ఇద్దాసు నుంచి గోలకొండ కవుల సంకలన రూపశిల్పి సురవరం ప్రతాపరెడ్డి దాకా తెలంగాణ సాహిత్య ఎవుసపు జెండానెగరేసింది. నల్లని ఆకాశంలోకూడా పోరాడే భాస్కరులను ఆవిష్కరించిన కవిసింహం దాశరథి కృష్ణమాచారి, ప్రజల మనిషి అనే కొత్త నిర్వచనాన్ని అందించిన వట్టికోట ఆళ్వార్‌స్వామి, గోదావరిలోయ కవులను, పాలడుగు నాగయ్య పదాలను, బోయ జంగయ్య జాతరలను గుర్తు చేసుకుంటున్నది.
ఎనుకటితరం రచయిత్రి కుప్పాంబిక, ఆది హిందూ ఉద్యమ లెజెండ్స్ మ్యాదరి భాగయ్య, రాజమణి దేవి తదితరులను, అలిశెట్టి మెరుపు ఎరువులను మురిపెంగ ఎదకద్దుకుంటున్నది. అంతకుముందు తొలిదశ, తర్వాత మలిదశ పోరాట త్యాగాలు, అమరత్వాలెన్నో. నెత్తురోడి న శాంతి కపోతమై కొత్త రాష్ట్రం అనే శిశువును కన్నది తెలంగాణ తల్లి. సాధించుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా దేశ చిత్రపటాన్ని అలంకరించింది. అయితే.. బాగా బతికి, చెడి, ఆగమై, విధ్వంసమైనంక స్వరాష్ర్టాన్ని దక్కించుకున్నం అనేది గమనించాలి. అది! సొంత పాలన, సొంత ప్రభుత్వం, సొంత ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ దృక్కోణంలో పాలన సాగుతున్నది.
కోటి రతనాల వీణ నా తల్లి తెలంగాణ! నిలువెల్ల గాయాలతో విలపించే నేల నా తల్లి తెలంగాణ అన్న కాడి నుంచి తిరిగి నిర్మించుకోవడంలో భాగంగానే తెలంగాణ రా ష్ట్రం పునర్నిర్మాణం ప్రణాళిక వేసుకొన్న ది. సొంత దృక్కోణంతో పాటు, సొంత చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాలను, పునర్నిర్మించుకుంటున్నది. ఇం దులో భాగంగా ఎండిన చెరువులకు ప్రాణంపోసి బతికించుకునేందుకు, తెలంగాణలో సాగు, తాగు నీటి ఊర చెరువులు మిషన్ కాకతీయ కింద తొవ్వి లోతులు తీసి, చెరువు నీటి మట్టాలను పెంచింది. దీనితో చెరువుకు దీటుగా సాహిత్యం పండింది.
‘చెరువు పుట్టి ఓలె నిండింది ఊరు ఊరంతా నీళ్లోసుకున్నది సుట్టూరా ఎండిన మన్నుపొరలు తేమతో బరువెక్కి కమ్మటి మట్టి పరిమళాన్ని మొగులుకు వెదజల్లిందిధీమన గొయ్యలు తేనెటీగలు సీతాకోకచిలుకలు, బింగన్నలు, తుమ్మెదలు చెరువును ఊరును పల్లెను కలిపే సైన్యాలై గాలిలో పహరా కాస్తున్నై గడ్డి పువ్వులతో సయ్యాటలాడుతున్నై భూమి పచ్చ గరిక దుప్పటి కప్పుకున్నది నల్లంచు చెర్వు కట్ట పస్క చీరతో సింగారించుకున్న భూగగనంపై వెండి వెన్నెల చందమామై తళతళ మెరిసింది ఊరజెర్వు !
అనే తాజా కవితల ఊట బుగ్గలు పొంగింది. కార్తి వెనుక కార్తి, నిండు పున్నమి పండు వెన్నెల్లు, చిక్కటి అమావాస్య పండుగలు. ఏరొంక పున్నము లు, ఆషాఢ మేఘగర్జనలు, మొల్కల పు న్నములు, మంటెడ్ల అమాసలు, బోనాల జాతరలు, పెద్దల(పెత్ర)మాసలు, బతుకమ్మ పండుగలు… పండుగెనుక పండుగ సాలుగట్టి ఎవుసం సంబురాలకు తోరణాలైతయి.
మా సెడ్డ కాలం! అది యాదికి రాకూడదు! వలస పాలనలో తాగునీటి గోస ముచ్చట సెప్పుడు సుర్వు జేస్తే, అది ఒడువని ముచ్చటనే. ఈ బాధ ఎవరికీ రాకూడదని సమ్మక్క సారక్కకు ఇంటిల్లి పాది ముడుపు కడుతున్నరు. రాష్ట్రం వచ్చినంకయితే పల్లె, పట్నం తేడా లేకుండా, ప్రతిదినం, ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో శుభ్రమైన తాగునీటిని అందిస్తున్న విధానాన్ని చూస్తే తెలంగాణ ప్రభుత్వం దార్శనికత అర్థం అవుతుంది. ఇంకోసారి ఊరచెర్వు జోలికి పోయి చూస్తే! రాష్ట్ర సాధనకు ముందు ఊర చెరువుల ను, వాటి పక్కన ఉన్న పల్లెల దీన పరిస్థితి గోరటి ఎంకన్న పాటలో కొట్టొచ్చినట్టు కనిపిస్తది.
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నాతల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రల
కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను
కమ్మరి కొలిమిల దుమ్ము వారినది .
సాలెల మగ్గం సడుగులిడినది
పెద్దబాడిశ మొద్దువారినది …
అని పాడువడ్డ ఊరు, పనిముట్లు, తడి ఎండిపోయి పర్రెలీడిన చెరువు, ఎడారిని తలపించే ఎవుసం భూము లు అన్నీ వెరసి పాడు గోడలు పడిపోయిన పల్లె మన కండ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇదే పల్లెను రాష్ట్ర సాధ న తర్వాత గమనించాలి. సాగునీటి కోసం, మిషన్ కాకతీయ మిషన్ భగీరథల ఫలితంగా మారిన పల్లె గురించి వచ్చిన పాటను తప్పకుండా వినాల్సిందే !
నా పల్లె అందాలు చూసితె కనువిందురో ..ఎత్తు వంపుల తోని డొంకల దారులు జూడు ఏపుగా పెరిగినట్టి యాపలు ఈదులు జూడు అల్లుకున్న తీగెల ఆదొండ పొదలురో నా పల్లె అందాలు సారం లేనీ భూముల్లా ఊరు సుట్టంత మొలిసి బారెడు మండల కోనలకు బంగారపు వన్నె కలిగి వంగిన పొదలల్ల తంగెడు పువ్వులున్నయో నా పల్లె అని ఊరు పచ్చ సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిండు అదే గోరటి.
తెలంగాణ వారు అమాయకత్వంతో, అభద్రతతో, ఆవేశంలో ఉండేవారు అనిపించుకొనే స్థాయి నుంచి భద్రత, సంయమనం, సంవాదం,ఎదురు బదురు ము చ్చట ఆత్మ గౌరవం గలవారని అనిపించుకుంటున్నారు. అంతేకాక అంతకుముందే నిండిపోయిన వలస దృక్కోణపు నిర్వచనాలను మార్చుకొని తనదైన కొత్త ఆత్మగౌరవ అస్తిత్వ నిర్వచనాన్ని తమకు తాము సాధికారికంగా నిర్వచించుకుంటున్నారు.కనుకనే ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సాం స్కృతిక నేపథ్యంలోతెలంగాణ అస్తిత్వ నిర్వచనం మారినక్రమం దేశానికే నూతన సందేశాన్ని ఇస్తు న్నది. నిజం చెప్పాలంటే ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యానికి తెలంగాణ ఓ విశాలమైన పరిశోధనావరణం. అంతేకాక సాహిత్య సంపదలను ప్రోది చేసుకున్న మైదానమై విరాజిల్లుతున్నది.
-డాక్టర్ గోగు శ్యామల
98669 78450