భూమి కావాలి చక్కగా దున్ని
పుడమికి హరిత వర్ణం పులమడానికి
కొంచెం భూమి కావాలి
నారెట్ల పోస్తారో
నీరెట్ల కడతారో
కలుపెట్లా తీస్తారో
పంటెట్ల కోస్తారో
ముందు తరాలకు చూపడానికి
కొంచెం భూమి కావాలి
చినుకు తడికి
మట్టి ఎలా పరిమళిస్తుందో
చెమట తడికి
పుడమి ఎలా పులకరిస్తుందో
ప్రత్యక్షంగా చూపడానికి
కొంచెం భూమి కావాలి
తన గొంతు తడిస్తేనే
మన కడుపు నిండుతుందని
తను బీడుబారితే
మనం మోడుబారుతామని
తను నిలిస్తేనే
మనం గెలుస్తామని నిరూపించడానికి
కొంచెం భూమి కావాలి
వ్యాపార వస్తువును చేసి
తనను అమ్మినా
తనెప్పుడూ అమ్మ ప్రేమ చూపుతుందని
ప్లాట్లు మొలిచే భూమిపై
పంటలు కూడా పండుతాయని
నవతరానికి చూపెట్టడానికి
కొంచెం భూమి కావాలి!
-ఎన్.నరేశ్ చారి
97013 34516