అందరు ఒక్కతీరుగ కింది నుంచి మీదికి జూసి.
గింత పెద్ద హాస్టల్లో బొంత తెచ్చుకున్న మనిశెవ్వడని
నవ్వుతున్నప్పుడు నా నాలుగు గుండె కుండలల్ల
గాడి పొయ్యి ముట్టిచ్చినట్టు రక్తం భగభగమని మసులుతుంటది
ఎదుకంటే పక్క పిన్నీసులన్నీ
తాళిబొట్టుకు ఏలాడితే కాసుల పేరేసుకున్న
మా లచ్చిమి లెక్కనే కానత్తది మా అవ్వ.
ఖాన్‌సాబ్ ఇచ్చిన తాయిత్తులైతే
అక్కడక్కడ సుట్టుకపోయి
ఆ కాసుల పేరుకు ముత్యమోలే మెరిసిపోతయి.
ఇంకా చేతులకేసుకునే గాజులు
పోచమ్మ గుడి ముంగట
క్యూ లైన్లో నిల్సున్న మనుషుల లెక్క
తీరొక్కటై ఉంటది.
మణి మకుటాలే లేవు గని
మధ్య తరగతి మహారాణి మా అవ్వ.
ఈలపీట పట్టుకున్న అవ్వను జూస్తే
పేదరికం మీద తిరగవడ్డ ఐలమ్మ లెక్క గానొస్తది.
అందుకనే గా ధైర్యం నాలోపల ఉండాలని
సాయిమాన్ల దాసుకున్న అవ్వ పాత చీరలన్ని
బొంతమెరంగ కుట్టించుకున్న.
ఇండ్ల ఒక్కొక్క చీర ఒక్కొక్క పండుగ నాటిది
మరి గీ బొంత మీద పండుకుంటే
పండుక్కి ఇంటికిపోవాలనే బుగులు పోతది కదా
అట్లనే సిన్నప్పుడు జ్వరం వస్తే
నెత్తి మీదికెల్లి నీళ్లు దింపి
మూడు బజాట్ల గుడ్డు
పారేసిన రోజులు యాదికొచ్చి
జరం కూడా ఎగిరిపోతది కదా
అందుకే గీ హాస్టల్‌కి వచ్చినప్పుడు
వొయిలంత భద్రంగ
అప్పటి చీరల బొంత కూడా
ఎంబటి తెచ్చుకున్న
జ్ఞాపకాలన్నీ నా గుండె గూట్లనే దాసుకున్న.
-సందీప్ వొటారికారి
93902 80093