పలకను ముఖంగా కలిగిన ఈ రాక్షసి
పలకకుండా పర్మనెంటుగా మూగబోతే బాగుండును
ఒక్క దృశ్యాన్ని సైతం చూపలేని,
ప్రసారశక్తి అసలే లేని పల్చని పరికరంగా
ప్రాణమే లేకుండా చచ్చుబడిపోతే బాగుండును
మధ్యమధ్య ప్రకంపనల్తో బర్రుమని చప్పుడు చేస్తూ
అప్పుడప్పుడు పిట్టకూతలను వెలువరించే ఇది
మన మనశ్శాంతికి కట్టిన రంగురంగుల అందమైన సమాధి
తిండిగింజల మీదకన్న, వంటనూనెల మీదకన్న,
ప్రాణాలను రక్షించే మందుల మీదకన్న
ఎక్కువ రాయితీతో కాలరెత్తుకుని తిరుగుతుంది ఇది!
వేల రూపాయల తగ్గింపు ధరలతో
ఊదరగొడుతుంటై ప్రసార మాధ్యమాలు
కాంతికిరణాలతో రెటీనాల మీద దాడి చేస్తూ
కలవర రహితమైన నిద్రను గగనకుసుమం చేస్తుంది ఇది
అర్ధరాత్రిదాకా తననే అంటిపెట్టుకుని ఉండేలా పురిగొల్పి
ఆరోగ్యాన్ని అమాంతం హుష్ కాకి చేస్తుంది
దీని సమ్మోహనాస్ర్తానికి బలి కానివారు బహు అరుదు
దీని లోపలి ‘వల’లో చిక్కుకుపోయి
లోలోపల దీనంగా విలపించేవారెందరో కదా!
కొన్నివిధాలుగా కొండంత మేలు చేసే ఇది
ఎన్నోవిధాలుగా బండెడు కీడును బహుమానంగా ఇస్తున్నది
పలకరాక్షసితో మితిమీరిన సావాసం
పరితాపానికి దారి తీస్తుందని తెలిసినా
దాని ఉచ్చులోంచి పూర్తిగా బయటపడేవాళ్లెంత మంది?
-ఎలనాగ
98669 45424