వైవిధ్యభరితమైన సంప్రదాయాన్ని కలిగిన పంజాబీ సూఫీ కవితా రంగంలో, మార్మిక కవి అయిన హజ్రత్ సుల్తాన్ బహు (1631-1691) పేరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన అబ్దుల్ ఖాదిర్ జిలాని స్థాపించిన ఖద్రియా సంప్రదాయాన్ని అనుసరించారు. తర్వాత సర్వారీ ఖాద్రి అనే కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు. పార్శీలో 140కి పైగా గ్రంథాలను బహు రచించారు. ప్రయాసతో, శాస్త్రబద్ధతతో ఆలంకారికతతో కూడుకున్న పార్శీ సూఫీ కవిత్వానికి, ఐహికత నిండిన అణకువ గల ముతకతనమున్న పంజాబీ సూఫీ కవిత్వానికి మధ్య వారధిలాంటి వాడు బహు.
పంజాబీ సూఫీ కవిత్వం సామాన్య పంజాబీ రైతులను బాగా అలరించింది. పార్శీ, సిరైకి భాషలో సుల్తాన్ బహు ఎన్నో గ్రంథాలను రచించినా, ప్రజలు అతని పంజాబీ కవితా రూపమైన ‘అబ్యాత్’నే ఎక్కువగా ఇష్టపడతారు. తమ స్మృతిలోనూ భద్రపరచు కున్నారు. అతని కవిత్వ భాష సామాన్యుల భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయన వివిధ ప్రాంతాల, మతాల ప్రజలకు ప్రీతిపాత్రుడయ్యారు. సిరైకి అనే భాషలోనూ ఆయన రాసిన కవిత్వం, వచనం, పాటలు మొదలైనవి వెలువడ్డాయి.
బహు కవిత్వంలోని సంగీతం, ఉపమాన రూపక అలంకారాలు సాహిత్యాభిమానులను అలరిస్తాయి. ఇవన్నీ సామాన్య పంజాబీ ప్రజల మౌఖిక సంప్రదాయానికి, సాహిత్యానికి దగ్గరగా ఉంటాయి. సులభంగా అర్థమయ్యే విధంగా కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రాపంచికతను నింపుకోవటంతో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అంటే ఒకవిధంగా ఆటవెలదులు, తేటగీతులలో రాసిన మన వేమనలాగా అన్నమాట. బహు రాసిన అబ్యాత్లు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక బోధనలను, సూఫిజాన్ని ప్రతిబింబిస్తాయి. అతని కవితలను కాఫీ, కలాం, ఖవ్వాలీ మొదలైన ఎన్నో ప్రక్రియలలో, పద్ధతులలో, శైలులలో పాడుకుంటారు ప్రజలు. పాండిత్యం కన్నా సూఫీ తత్వాన్ని తనలో ఎక్కువగా రంగరించుకున్న బహు హృదయ స్వచ్ఛత, ఆత్మజ్ఞానం, ఋజువర్తనం, విశ్వప్రేమలను కవితా వస్తువులుగా ఎంచుకున్నారు. వాటిలోని సౌందర్యం, మార్మికత పాఠకులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
ఆధ్యాత్మిక గురువు పట్ల తనకున్న అపారమైన గౌరవం మొదలుకొని, పాండిత్యంతో నిండిపోయి వ్యవస్థీకరించిన మతం వరకు.. అన్నీ ఆయన కవితా వస్తువులే. సూఫీ మత సిద్ధాంతాల ప్రకారం నిర్వచించిన ప్రేమ గురించి తన కవితలలో ఎంతో ఉత్సాహంగా రాశారాయన. ‘హు’ అనే అక్షరాన్ని తన కలం పేరుగా, పల్లవిగా వాడటం వల్ల ఆయన ప్రత్యేకతను పొందారు. అతని ‘ద్విపద’లను వివిధ సంగీత శైలులలో ప్రజలు పాడుతారు. ఆయన రాసిన అబ్యాత్లను గానం చేసే తీరు ఇతర కవితా రూపాలను పాడే విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. సమృద్ధమైన తన మార్మిక కవితా సంప్రదాయాన్ని, వారసత్వాన్ని మనకు అందిస్తూ తన 63వ ఏట దివంగతుడయ్యారు బహు. షోర్కోట్లోని చీనాబ్ నదీ తీరంలో ఉన్న అతని సమాధిని ఖాద్రీలు, పంజాబీ సూఫీ కవిత్వ ప్రేమికులు ఆనందోత్సాహాలతో దర్శిస్తుంటారు. సుల్తాన్ బహుకు ఆధ్యాత్మిక గురువైన షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ స్వస్థలం బాగ్దాద్. ఆ నగరంతో గాఢమైన మానసిక బంధాన్ని నెలకొల్పుకొన్న బహు దాన్ని ఒక్కసారైనా భౌతికంగా దర్శించలేదు.
శరీర నేత్రం నా శరీరం ఒక పెద్ద నేత్రంగా మారినా పోయేదేమిటి! అలసిపోకుండా నా ఆధ్యాత్మిక గురువునుదర్శిస్తూనే ఉంటాన్నేను నా చర్మం మీది సూక్ష్మరంధ్రాలన్నీ రెప్పలు వేసే లక్ష చక్షువులుగా మారితే కొన్నిటిని మూసి మరికొన్నిటిని తెరుస్తాను అంతటి అవలోకనం తర్వాత సైతం
ఇంకా తహతహలాడుతూనే ఉంటాన్నేను అరెరే, ఏం చేతును, ఎక్కడికి పోదును? బహూ! నీ ఆధ్యాత్మిక గురువును దర్శించటం లక్ష తీర్థయాత్రలకు సమానం నీకు… ‘బహు’కవితకు రచయిత అనువాదం..
– ఎలనాగ