పాటతో పాటు ప్రజా కళా రూపాల ద్వారానే సమాజంలో సత్వరం గొప్ప సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించవచ్చు. ఈ విధమైన కళా, సాంస్కృతిక ఎరుకతో పదునైన పాటలతో, బుర్ర కథలతో, గేయ రూపకాలతో సమాజాన్ని చైతన్యపరచిన కవి, ప్రజా వాగ్గేయకారుడు పాలడుగు నాగయ్య. తెలంగాణ తొలితరం ప్రజా కళాకారులకు నేటి కవులకు ఒక వారధిగా నిలిచిన నాగయ్య రచనలను అధ్యయనం చేస్తే జాతి సముద్ధరణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల త్యాగాల చరిత్ర బోధపడుతుంది.
‘నాగయ్య స్వయం కృషితోనే సంగీతం, సాహిత్యం, నాట్యం కూడా అభ్యసించి, ఈ మూడు కళలకు నిలయమైన బుర్రకథను చేపట్టి, ఆధునిక మహా పురుషులను, ఉద్యమాలను, ఉన్నత మానవ లక్ష్యాలను దేశం నలుమూలలకు, ప్రజా ప్రాంగణాలకు తీసుకుపోతున్నారని’ డాక్టర్ బోయి భీమన్న కితాబిచ్చినట్టుగా బహుముఖీన కళాప్రతిభతో బుర్రకథలను ప్రదర్శించి నాగయ్య జనావళిని జాగృతపరిచాడు.
‘సత్యనిష్ఠతో జీవితాన్ని చిత్రిస్తూ, ప్రగతి కోసం, ప్రజల కోసం, పీడిత వర్గాల విముక్తి కోసం, రచయితలు పాటుపడాలని’ చాటిచెప్పిన నాగయ్య ఈ బృహత్తర ఆశయంతో మునుముందుకు సాగిపోయాడు. గేయాన్ని బుర్రకథను ప్రధాన ఆయుధాలుగా చేసుకొని సాంస్కృతిక విప్లవ సమరం సాగించాడు. ‘వినరా ఆంధ్రుడ! వీర కుమార’ అంటూ వీరయోధుల, జ్ఞానవీరుల కథలను జనావళికి చేరువ చేశాడు. పాలడుగు నాగయ్య ఖమ్మం జిల్లా రామాపురంలో 1943, జూలై 19న ఈరయ్య, తిర్పమ్మ అనే నిరుపేద దంపతులకు జన్మించాడు.
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన నాగయ్య, సూర్యాపేట సమీపంలోని కుడకుడ గ్రామంలో అమ్మమ్మ, మేనమామల ఆలనా పాలనలో పెరిగాడు. కుడకుడ, సూర్యాపేటల్లో తొలుత విద్యనభ్యసించి, హైదరాబాద్లో డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తర్వాత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ తక్కువ కాలంలోనే కళాకారుడిగా, కవిగా, గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన నాగయ్య నాలుగు పదుల వయస్సు దాటకుండానే తీవ్ర అనారోగ్యంతో 1982, ఏప్రిల్ 10న మరణించాడు.
అంటరానితనం, పేదరికం నడుమ నాగయ్య బాల్యం నలిగిపోయింది. దుర్భర దారిద్య్రం ఆయనను పశువుల కాపరిగా మార్చింది. పాలబుగ్గల జీతగాడై నాగయ్య పొలం పనులు చేశాడు. పనితో పాటు పాట నేర్చుకున్నాడు. తన స్వగ్రామం సమీపంలో చింతచెట్ల నీడలో సేదతీరాడు. మూసీ కాలువ గట్ల వెంట, గుట్టల పొంటి దోస్తులతో జతగూడి ఆటలాడాడు. ఈ ఆటపాటల నేపథ్యం ప్రేరణతో, గ్రామీణ సాంస్కృతిక కోలాహలం లోనుంచి నాగయ్యలో కళాభిరుచి చిగురించి, ప్రజా రంజకంగా ఫలించింది.
పిట్టలదొర, పకోడీవాలా లాంటి విచిత్ర వేషధారణ పోటీల్లో నాగయ్య రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులను సాధించాడు. పాలేరు నాటకంలో బాలపాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నాడు. అనేక సందేశాత్మకమైన సంగీత రూపకాలతో, బుర్రకథలతో ఆకాశవాణి, దూరదర్శన్లలో సమర్థుడైన కళాకారుడిగా నాగయ్య పేరుగాంచాడు. జాతీయ గేయాలు, పాలడుగు పదాలు, పల్లె జనపదాలు, ఐకమత్యం గేయరూపకం వంటి రచనలను వెలువరించాడు.
సామాజిక చైతన్యభరితమైన సందేశాత్మకమైన పాటలు, పదాలు, దేశభక్తి గేయాలు, జానపద గేయాలు, భక్తిగీతాలు రచించడంతో పాటు ఆ గేయాలకు భావానుకూలమైన స్వరాలు కూర్చి నాగయ్య తన గానంతో ప్రేక్షకులను రంజింపజేశాడు. గ్రామీణ వనితల శ్రమకు జేజేలు పలుకుతూ పదాలల్లాడు.
సూర్యాపేట పరిసర ప్రాంతాల జాతరలను, పోచమ్మ వంటి గ్రామ దేవతలను, దేవుళ్లను వర్ణిస్తూ జానపద గీతాలను రాశాడు. ‘దున్నరా నవయువకా దున్నరా’ పాటలో సరికొత్త రూపకాలతో ఉదాత్తమైన సందేశాన్ని అందించాడు. ‘శాంతి సత్యముల నెడి ఎద్దులను కట్టి, క్రాంతి అనే నాగలితో, వేదాల మడులన్నీ విరివిగా దున్నాలని, విజ్ఞాన విత్తనాలు వెదజల్లాలని, నీతి అనే ప్రాజెక్ట్ నుంచి నీరు పెట్టి, న్యాయమను కాలువగుండా నీరు ప్రవహించాలని, ధర్మమనెడి మంచెనెక్కి కాపు కాయాలని, దయారసముల కొడవలితో దండిగా కోయాలని (దున్నరా) వ్యవసాయ పనుల ద్వారా నైతిక విలువలను ప్రబోధించాడు.
పండిన ధాన్యాన్ని ‘పరులెల్లరు బ్రతుకుటకును నలుదిక్కుల వెదజల్లి’, నవవిశ్వపు జనావళి మనములలోన నాటాలని’ ప్రగతిశీల దృష్టితో నాగయ్య పిలుపునిచ్చాడు. ‘మనిషిలోని ద్వేషాగ్ని మాసిపోవాలని, మమత పండాలని, ప్రేమ నిండాలని (మనిషి మారాలి) శ్రామిక జీవులు కలవాలని, శ్రేయోరాజ్యం రావాలని’ అభిలషించాడు. ‘నావ నడుపురా’, ‘ముందుత్రోవ కనరా’ వంటి అనేక తాత్త్విక గీతాలతో జీవన పరమార్థాన్ని తెలియజేశాడు. ‘దస్తీ ఓ నా దస్తీ’ అంటూ వైవిధ్యభరితమైన లఘు గేయాలను ఆలపించాడు.
‘ఎవరిది ఎక్కువ కులము /ఎవరిది తక్కువ కులము /ఎంచి చెప్పగా ఎవరికేమెరుక?’ అని వేమన, పోతులూరి వీరబ్రహ్మం లాంటి సామాజిక తత్త్వ కవుల్లాగా నాగయ్య ప్రశ్నించాడు. ‘మనము తక్కువ, మనము బానిసలము’ అనే మానసిక బానిసత్వాన్ని విడనాడాలని దళితులకు హితవు చెప్పాడు. పురాణాల్లో, భారత రామాయణ గ్రంథాల్లో వశిష్టుడు, పరశురాముడు, అరుంధతి, రేణుక లాంటి శూద్ర పాత్రలను ఒకవైపు ఉన్నతంగా ఆరాధిస్తూనే, మరొకవైపు దళిత బహుజనులను హీనంగా దూషించే మనువాదుల ద్వంద్వ వైఖరిని ఈ నృత్య నాటికలో తిరుగులేని వాదనాపటిమతో ఆయన వ్యతిరేకించాడు.
‘దళితుల శ్రమపైనే భారతీయ సాంస్కృతిక జీవితం ఆధారపడి ఉన్నదన్న’ అంబేద్కర్ మాటలతో నాగయ్య ఈ నృత్యనాటికను ముగించటం విశేషం. ‘బడుగువర్గాల స్థితి బాగుపడినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందన్న అంబేద్కర్ సందేశాన్ని ఈ నాటిక ద్వారా నాగయ్య ప్రచారం చేశాడు. డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ప్రతిపాదించినట్టుగా ‘తెలంగాణలో అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి తన వంతు కృషిచేసిన సాహితీవేత్తగా నాగయ్యను గుర్తించాల్సిన అవసరం’ ఉన్నది.
నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిగా నీరాజనాలందుకున్న దామోదరం సంజీవయ్య ఆదర్శనీయమైన జీవితాన్ని, ఆ మహానాయకుని రాజనీతిని కొనియాడుతూ నాగయ్య రాసిన బుర్రకథ ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ బుర్రకథను నెలరోజుల పాటు రాయలసీమ గ్రామాల్లో ప్రదర్శించి అక్కడి ప్రజల అభినందనలను అందుకున్న నాగయ్యను తెలంగాణ నాజర్గా అభివర్ణించవచ్చు.
అట్టడుగు వర్గంలో పుట్టిన సంజీవయ్య కఠోరమైన దీక్షతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి, జాతీయ నాయకునిగా ఎదిగిన క్రమాన్ని బుర్రకథగా నాగయ్య మలిచిన తీరు అమోఘం. పంచాయితీ రాజ్యంబులోన అధికార వికేంద్రీకరణ అమలు జరిపిన నాయకునిగా, పేదరికము బాపగ ప్రగతికి నాందిపలికి, ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచిన సంజీవయ్యను గొప్ప సంస్కర్తగా, ఆదర్శ ముఖ్యమంత్రిగా కీర్తించాడు. ‘మీ సారస్వత విలువలను మరువలేమయ్యా’ అంటూ దామోదరం సంజీవయ్య చేసిన భాషా సాహిత్యాల కృషిని కూడా ఈ బుర్రకథలో నాగయ్య గానం చేశాడు.
యాభయ్యేండ్ల కిందట రాసిన పాలడుగు నాగయ్య రచనలకు, తీర్చిదిద్దిన కళారూపాలకు ఈనాటికీ ఎంతో ప్రాసంగికత ఉన్నది. తండ్రి కళారక్తం పంచుకుపుట్టిన కళాకారిణి, పాఠశాల విద్యాశాఖలో సంయుక్త సంచాలకులైన శ్రీమతి పాలడుగు సరోజినీదేవి నాగయ్య సమగ్ర సాహిత్యాన్ని పునర్ముద్రించి కొత్త తరం పాఠకులకు అందించటం అభినందనీయం. వారసత్వమంటే తండ్రి స్థిరాస్తులను పంచుకోవడం కాదు, ఆయన సిరాస్థులను, కళా సంపదలను పంచుకొని ప్రచారం చేయడమే నిజమైన వారసత్వం.
డాక్టర్ కోయి , కోటేశ్వరరావు
94404 80274