ఒకప్పుడు ఎంత పెద్ద సాహిత్యకారుడినైనా చీల్చి చెండాడిన ప్రసేన్ ఇప్పుడు ముందుమాటలుగా సాహిత్య ప్రశంస చేస్తుంటే కొందరికి అది నచ్చడం లేదు. సూటిగానే మీరు మారారని ప్రసేన్తోనే అంటున్నారు. మరోవైపు నీలిమ వి.ఎస్.రావు ఈ మధ్య కొంత నెగెటివ్ విమర్శ రాస్తున్నది. ఆమె రాతలను అందరూ ఎందుకంత దూకుడు, అంత విమర్శ అవసరమా అని ఆమెతోనే అంటున్నారు.
మరోవైపు తాడి ప్రకాష్ రాతలనూ అందరూ మెచ్చుకుంటున్నారు. నిజానికి ఆయన ఏది రాసినా అది కేవలం ప్రశంస. అయితే అది మంచి ైస్టెలింగ్తో ఉంటుంది కనుక మెచ్చుకుంటున్నారు. ఇంకోవైపు అదే రకం ైస్టెలింగ్తో తన వాదనను సోదాహరణంగా సమర్థించుకుంటూ రాసే నున్నా నరేష్ రాతల మీద సాహిత్య లోకానికి మహా మంట. ఇంకింకోవైపు ఎవరినీ పల్లెత్తు మాట అనని గుంటూరు లక్ష్మీనరసయ్య, సీతారాంలను గొప్ప విమర్శకులుగానే చూస్తున్నది సాహిత్య లోకం.
మళ్లీ అదే ప్రశ్న తెలుగు సాహిత్య లోకం ఏం కోరుకుంటున్నది. కేవలం ప్రశంసనా, విశ్లేషణాత్మక విమర్శ అవసరం లేదనుకుంటున్నదా?‘మీరు ఈ మధ్య మరీ సాఫ్ట్‌గా రాస్తున్నారు. ఇంతకుముందున్న దూకుడు తగ్గింది’ అని అడిగాడొక మిత్రుడు, ఇటీవల జరిగిన హైదరాబాద్ బుక్ఫెయిర్లో తోపుడు బండి సాదిక్ వేదిక దగ్గర. అడిగింది నన్ను కాదు, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు ప్రసేన్ని. అప్పుడు ప్రసేన్ పక్కనే ఉన్నాన్నేను. ‘ఆటా పాటా తానా తందానా’ లాంటి విమర్శ చేసిన ‘ప్రసేన్ మీరేనా అని డౌట్ కూడా వస్తుంది’ అన్నాడు. దానికి ప్రసేన్ ‘తెలుగు సాహిత్యం ఏమి కోరుకుంటున్నదో అదే నేను ఇస్తున్నాను’ అన్నాడు. గమ్మత్తేమిటంటే అదే వ్యక్తి ‘ఏంటండీ ఈ మధ్య నీలిమ గారు మరీ అంత దూకుడుగా రాస్తున్నారు కొంచెం తగ్గించమని చెప్పండి’ అని నాతో అన్నాడు. అతను నాకు తెలుగు సాహిత్యం ప్రతిబింబంలా అనిపించాడు. ఆ సంభాషణ అంతటితో ముగిసిపోయింది, నాలో ఒక ప్రశ్నను వదిలి. ఈ ప్రశ్న నా ఒక్కడిదే కాదు. తెలుగు సాహిత్యాన్ని సన్నిహితంగా పరిశీలిస్తున్న వాళ్లందరిదీ.
‘తెలుగున సాహిత్య విమర్శా దీపము బహు చిన్నది’ అన్న కట్టమంచి రామ లింగారెడ్డి మాటల్ని మనం తరచూ ఉటంకిస్తుంటాం. ఉన్న ఆ చిన్న దీపం కూడా కొడిగట్టిపోయే స్థితి వచ్చిందేమో అనే సందే హం కలిగినట్టుంది, అందుకే అకాడమీలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న ప్రసేన్ని ఆ ప్రశ్న వేసినట్టున్నాడు.
ముందు మాటలకు, బ్లర్బ్లకు కొన్ని పరిమితులుంటాయి కనుక కొంత ప్రశంస తప్పిస్తే అభిశంసన ఉండటం లేదు. నిజానికి ముందుమాటలో విమర్శ చేయకూడదని ఎక్కడా లేదు. చాలా ముందు మాటలు గొప్ప విమర్శగా పేరు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ముందు మాటల్లో అంశాలకు కొంత కుషన్ ఇచ్చినా ఇతరత్రా విమర్శలో కూడా ప్రశంస తప్పితే గుణ, దోష వివరణో, నిర్మాణ వైఫల్య సాఫల్యాలను విప్పిచెప్పడమో, దృక్పథ లోపాన్ని చెప్పడమో, భాషా పరంగా తప్పొప్పులను ఎత్తి చూపడమూ ఎక్కడా జరగడం లేదు. దానికి ప్రధానంగా బాధ్యత వహించవలసింది మాత్రం సృజనకారులు, విమర్శకులు మాత్రమే తెలుగు నాట ఉన్న విమర్శకులు కొద్దిమంది. ఆ కొద్ది మంది కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తున్నది చూస్తుంటే.
కవుల, రచయితల గుడ్ లుక్స్‌లో ఉండాలని విమర్శకులు ప్రయత్నం చేయడం ఎందుకు? ఇంతకుముం దు రారా, కేవీఆర్, చేరా, పురాణం, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జయప్రభ, రంగనాయకమ్మ, వెల్చేరు ఇలా ఎవరూ సేఫ్ గేమ్ ఆడలేదు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేవారు. ఇప్పుడు అలా లేదు.
కానీ, ఇప్పుడలా ఉన్నదా? ఇప్పటి విమర్శకులు అందరిలోకి అగ్రగణ్యుడు లక్ష్మీనరసయ్య కవులను ప్రశంసించాల్సి వస్తే పేర్లు పెట్టి మరీ ప్రశంసిస్తారు. కానీ, విమర్శించాల్సి వచ్చినప్పుడు మాత్రం స్వీపింగ్ కామెంట్స్ చేసి వదిలేస్తారు. చాలాకాలం కిందట శేషం లక్ష్మీపతిరావు సాహిత్యంలో రిజర్వేషన్ అని ఒక వ్యాసం రాశారు. అందులో ప్రధాన అంశమేమంటే మార్జినలైజ్డ్ వర్గాల నుంచి వస్తున్న సాహిత్యాన్ని అంచనా వేసేటప్పుడు ప్రధాన స్రవంతి సాహిత్యకారుల వివేచనా పద్ధతులను, లేదా విమర్శా సూత్రాలను యథాతథంగా ఉపయోగించకూడదు. కొంత కుషన్ ఇచ్చి అంచనా వేయాలి. లేకపోతే సాహిత్య వివేచనలో అసమతుల్యత పెరిగిపోతుంది. కొత్తగా గొంతు విప్పుతున్నారు కనుక వాళ్ల పట్ల విమర్శ మరింత కఠినంగా ఉండకూడదు. ఈ వ్యాసాన్ని లక్ష్మీపతిరావు అస్తిత్వ ఉద్యమాలు పురులు విప్పుకొంటున్న దశలో అంటే 20వ శతాబ్దపు చివరి దశకంలో రాశారు. 21వ శతాబ్దం వచ్చి రెండున్నర దశాబ్దాలు గడిచినా ఇంకా కుషన్ ఇవ్వాలని లక్షీనరసయ్య ఇప్పటికీ అనుకుంటున్నట్టుంది. స్త్రీవాద, దళిత, ముస్లిం మైనారిటీ, ఆదివాసీ కవిత్వం తెలుగులో చాలా బలంగా వేళ్లూనుకున్నది. ఇప్పటికైనా సరైన విమర్శ చేయకపోతే అది తెలుగు సాహిత్యానికి నష్టం.
దళిత కవిత్వం రాస్తున్న కవులను లక్ష్మీనరసయ్య పొగడటం తప్పిస్తే వాళ్ల లోపాలు చెప్పరు. కవులకు కూడా అదే కావాలి కనుక లక్ష్మీ నరసయ్య వెనుక కోడిపిల్లల్లా తిరుగుతూ ఉంటారు. అలా తిరగటం పట్ల నాకేమీ అభ్యంతరం లేదు. ఇంతకుముందు చేరా చుట్టూ కూడా అలాగే కవులు తిరిగేవారు. అయినా చేరా మొహమాటపడలేదు. త్రిపురనేని శ్రీనివాస్ రహస్యోద్యమం మీద చేరా విమర్శ, త్రిపురనేని జవాబులు కొంచెం వెనక్కి వెళ్తే ఎవరైనా చదువుకోవచ్చు. చివరికి దాశరథి కూడా ‘చేరాతలు, తల రాతలు మారుస్తాయా’ అన్నారు. రా రా మీద విరుచుకుపడ్డ కవులకు లేక్కే లేదు. అయినా వాళ్లెవరూ విమర్శను దేనికోసమో డైల్యూట్ చేసి ప్రశంస మాత్రమే విమర్శ అనలేదు
తెలుగు నాట తాజా సంచలనం తాడి ప్రకాష్ కూడా వాక్య విన్యాసంతో మెస్మరైజ్ చేస్తారు. మోహన్ గురించి రాసినా, ఇతర సాహిత్యకారుల గురించి రాసినా, సినిమా గురించి రాసినా, ఎక్కడా ఒక్క నెగిటివ్ మాట రాయరు. సుంకర గోపాల్, రాధేయ, కవి సంగమంలో వ్యాసాలు రాసే లెక్కకు మిక్కిలి కవులు ఎవరూ ఒక నెగిటివ్ మాట రాయరు. ఫణి మాధవి, రాజేశ్వరీ రామాయణం, బిల్లా మహీందర్, మెట్టా నాగేశ్వరరావ్ తదితర కాలమిస్టులు కూడా ఎవ్వరినైనా పొగడటమే తప్ప పల్లెత్తు మాట అనరు. కానీ, ఒక సాహిత్య మిత్రుడు వచ్చి మీరెందుకు మరీ అంత సాఫ్ట్‌గా రాస్తున్నారు అని పాఠకుడు అడుగుతున్నాడు. మనమేం జవాబు చెప్తాం.
అసలైన అర్థంలో విమర్శ చేస్తే ఏం జరుగుతున్నది?: ఇటీవల నీలిమ వీఎస్ రావు రాస్తున్న వ్యాసాలకు వస్తున్న స్పందన ఏం జరుగుతున్నదో స్పష్టంగా చెప్తున్నది. గాంధారి వానలో దళిత కవిత్వం ఉండవలసిన ఇంటెన్సిటీ, డెన్సిటీ ఉండవలసిన రీతిలో లేదన్నందుకు ఆమె మీద వెర్బల్‌గా దాడి చేసినంత పనిచేశారు. వాక్యాన్ని ఎక్కువ మెటఫరైజ్ చేయడం ఎలా లోపమైందో నీలిమ చెప్పినందుకు ఆమెను కవిత్వం చదివి రాయండన్నారు. అంటే విమర్శకుడు పుస్తకం చదువకుండానే రాస్తాడా?
ఒక కథ బాగాలేదని ఎవరైనా అంటే ఆ బాగా లేదని అన్నవాళ్లకు కథ అర్థం కాలేదు అనటం, కథ చదవటం నేర్చుకోమని సుద్దులు చెప్పటం, ఆ రచయిత బలవంతుడైతే తన అనుయాయులతో దాడి చేయించడం, ఫోన్‌చేసి తూలనాడటం ఇవాళ కొత్తగా మొదలైన పద్ధతులు. సాహిత్యానికి ఇవి మంచివి కావు. సినిమా హీరోలని తెలుగు కవులు, రచయితలు అనుసరిస్తున్నారనుకుంటాను. వాళ్లలాగే వీళ్లకీ ఇమేజ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా?
వంశీకృష్ణ
9573427422