‘అన్యాయాన్ని ఎదిరించేటోడు నాకు ఆరాధ్యుడు’ అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ముఖ్యంగా పాలకవర్గాలు ప్రజలపై అణచివేత ధోరణి అనుసరిస్తున్నప్పుడు, నయవంచనకు పాల్పడినప్పుడు ప్రశ్నించే గొంతుల నుంచి వెలువడే అక్షరాలే ప్రజల పోరాటానికి అస్ర్తాలుగా నిలుస్తాయి. కానీ, సమకాలీన సమాజంలో ప్రభుత్వాలు, పాలనాతీరుపై రాస్తున్న సాహిత్యం అరుదుగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కవి, రచయిత విశ్వనాథుల పుష్పగిరి రాసిన ‘రేవనాలు’ కవితా సంపుటి ప్రత్యేకతను సంతరించుకున్నది. తెలంగాణలో కాంగ్రెస్ 16 నెలల పాలనలోని 16 అంశాలపై పుష్పగిరి కవితలు రాశారు. గతించిన చరిత్రలోని పాలకులపై పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాసే కవులు, రచయితలు ఉన్నారు. కానీ, సిట్టింగ్ సీఎం రేవంత్‌రెడ్డిది రోకుతప్పిన పాలన అంటూ ధిక్కార స్వరం వినిపించిన కవి పుష్పగిరి.
విశ్వనాథుల పుష్పగిరి స్వస్థలం నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం, బ్రాహ్మణవెల్లంల గ్రామం. విశ్వనాథుల పిచ్చయ్య, జంగమ్మకు పుష్పగిరి మూడో సంతానం. పుష్పగిరి తండ్రి పిచ్చయ్య కమ్మరి కొలిమి వద్ద పని చేసుకుంటూనే పద్యాలు, పాటలు ఆలపించేవారు. ఈ నేపథ్యంలో విశ్వనాథుల పుష్పగిరికి సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2012 సమయంలో ‘నరమాంస భక్షణ’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. అవినీతి, దోపిడీ, క్రూరత్వం తదితర అంశాలను ప్రస్తావిస్తూ మనిషి నైజాన్ని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘కైవారం’ అనే పుస్తకం ప్రచురించారు. ఇందులో తెలంగాణ గ్రామీణ వృత్తి జీవితాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలు చూసి… అద్భుతమేదో జరుగుతుందని ఆశపడ్డ జనం ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అద్భుతం జరగడం సంగతి పక్కనపెడితే అంధకారం అలుముకుంది. ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి.
ఎవరిని కదిలించినా ఆవేదనతో తమ గోసను వెళ్లగక్కుతున్నారు. చిరువ్యాపారులు, ఆటోవాలాలు, కార్మికులతో మమేకమైనప్పుడు తనలో కలిగిన స్పందనను పుష్పగిరి కవితలుగా రాశారు. ప్రజల తరఫున గొంతుకను వినిపించేందుకు, జనం ఆవేదనకు అక్షరరూపం ఇచ్చేందుకు నడుంకట్టారు. ప్రజాగ్రహానికి కవిత్వ రూపమిచ్చారు.
వ్యంగ్య విమర్శలు అనే మాటకు తెలంగాణ గ్రామీణ మాట ‘రేవనాలు’. స్వచ్ఛమైన పచ్చిపాల వంటి మట్టిమనుషుల మాటను తన పుస్తకానికి పేరుగా పెట్టుకోవడంలోనే కవి అభిరుచిని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ 16 నెలల పాలనలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను 16 కవితలుగా ఆవిష్కరించారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ తొలి పర్యటన నుంచి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, లగచర్ల లడాయి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పర్యావరణ విధ్వంసం వరకు… ఇలా ప్రతీ అంశాన్ని తన కవితలకు ఇతివృత్తాలుగా మలుచుకున్నారు. ప్రముఖ కవి, విమర్శకుడు అంబటి సురేంద్రరాజు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కవి, రైతు నారాయణదాసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు కవులు, రచయితలు రేవనాలు పుస్తకం సరైన సమయంలో ప్రజలకు ఓ అక్షరాయుధాన్ని అందించిందని కొనియాడారు.
తెలంగాణలో ప్రజల తరఫున కవులు గొంతెత్తాల్సిన ఆవశ్యకతను అంబటి సురేంద్రరాజు ఈ సందర్భంగా వివరించారు. ‘కవులు ఆగమై పదవులు, అవార్డుల కోసం ప్రభుత్వ పాదాల వద్ద చేరారు. కవులు అని చెప్పుకొనే కుకవుల, నామమాత్ర కవుల నుంచి తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి. విశ్వనాథుల పుష్పగిరి లాంటి కవులు స్వతంత్రంగా, ఏ సంఘాలతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడడం గొప్ప విషయం. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత కవుల మీద ఉంది. పుష్పగిరి సాహిత్యం వంటి కవనధారను కాపాడుకోవాలి. ఈ పుస్తకాన్ని 33 జిల్లాల్లో ఆవిష్కరించాలి’ అని చెప్పారంటేనే తెలంగాణ సమాజంలో ‘రేవనాలు’ ఎంతటి ప్రభావవంతమైనదో అర్థం చేసుకోవచ్చు.
అసెంబ్లీ ఇప్పుడు అర్రాజు పాడుతున్న మేకల మండి, ఢిల్లీకి కప్పంగడుతున్న గోదురు కప్ప… చరిత్రలో ఏకైక ప్రీపెయిడ్ ముఖ్యమంత్రి, నాలుగున్నరకోట్ల మంది నిన్ను సాపిస్తున్నప్పుడు… నువ్వు ఎవరిదో సావు కోరుకుంటున్నవంటే.. నీ నడిమంత్రపు సిరి ఎంత గావరవెడ్తుందో, నిజమే.. నీ పెట్టుబడులన్నీ దిల్సుఖ్నగర్ విమానాశ్రయాలే, దేవాన దేవుండ్ల మీద నువ్వు పెట్టిన వొట్లన్నీ.. కాన్సిలైన ఓట్లల్ల చేరిపోయినయి, గూట్లె దీపంపెట్టి.. గుళ్లె లింగాన్ని మింగకు, కోటి రతనాల వీణ కాదిది.. కొంగలు దొక్కిన పొలం… ఇలా ఒక్కో కవితను ఎంతో భావోద్వేగంతో రాశారు. తెలంగాణ రక్తంలో ఉన్న తిరుగుబాటు మనస్తత్వం, ధిక్కార నైజం పుష్పగిరిలో కనిపిస్తున్నది. ప్రజలకు పోరాటతత్వాన్ని కూడా బోధించిన పద్ధతి ఆకట్టుకుంటుంది. అతడి కవితలలో కాళోజీ, శ్రీశ్రీ, అలిశెట్టి శైలి గోచరిస్తున్నది. రాజీపడని మనస్తత్వంతో ప్రజల తరఫున పుష్పగిరి మరిన్ని కవితాపుష్పాలు విరబూయించాలని ఆశిద్దాం.
– ఇనుగుర్తి సత్యనారాయణ 97046 17343