‘పల్లే పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా.. మన పంటచేల లోనా..’ అంటూ దశాబ్దాల కరువు దుర్భిక్షాన్ని, దౌర్భాగ్యాన్ని ఎరుకజేస్తూ వలపోసింది ఆ నేల. వలస బతుకుల వేదనలను తల్సుకొని ఎక్కెక్కి ఏడ్చిన సందర్భాలెన్నో.. కానీ, ఇప్పుడు కరువు కాలాలన్ని ధాన్యపు కల్లాలై అలరిస్తున్నవి. పాలమూరు పల్లెలు జలదృశ్యాలై కోలాటమేస్తున్నవి. వలసపోయిన ప్రజలు వాపసొచ్చి నీళ్ల పండుగ సంబురాలు జేసుకుంటున్నరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో తరలివస్తున్న కృష్ణమ్మకు స్వాగతం పలుకుతున్నరు. రైతుల కండ్లల్లో ఆనందాలకు, జీవనాధారాలకు కారకుడైన, కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పానికి ఎలుగెత్తి జై కొడుతున్నరు. నాలుగు వందల మీటర్ల ఎత్తుకు ఉప్పొంగుతూ తరలివస్తున్న కృష్ణ జలాలకు పాలమూరు ఉమ్మడి జిల్లా కవులు తమ కవన కుసుమాలతో విజయ గీతికలు ఆలపించారు. వారి అక్షర ఆలాపనకు స్వరం కలుపుతూ ఈ వారం ‘చెలిమె’ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అంకితం ఇస్తున్నాం.
ఇంతకుమునుపు
కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగినా
భుజానికి ఎక్కించనింకె బిందె నీటికి గగనమయ్యేది!
ఇంటిల్లిపాదీ వంతులవారీగా చేతిపంపు కొట్టి
నింపుకొన్న బిందెడు నీళ్లను
ఎత్తుకున్న భుజాలకు తెలుసు పొదుపు మంత్రం!
చినుకులు రాలక నోర్లు తెరిచిన బీడును చూసి దిక్కుతోచని స్థితి-
ఆత్మబంధువులైనా నీళ్ల పంపకాల తాన స్వార్థ పరత్వం!
నీళ్ల కోసం రాస్తారోకో చేపట్టిన దినాలెన్నో
ఎండిపోయిన గుండెను
బండబారిన మనసుల్లోని మలినాలను తొలగించి
మనుషులను చేసిందీ భగీరథ సాధన!
కాకతీయుల ప్రతిభను పుణికిపుచ్చుకున్నోళ్లం
కొండలను తొలిచి ఆనకట్టలు నిర్మించి
అంచెలంచెలుగా నీటిని ఒడిసిపట్టుకున్నం!
నాటి చెలిమెలే నేడు చెరువులై ఏరులై పారుతూ
కృష్ణమ్మతో కలిసి పరవళ్లు తొక్కుతూ అలరిస్తుంది!
వలసల జిల్లా అన్నోళ్లే వరుసలు కట్టి వరిచేన్లకు సాగుతున్నరు!
భవిష్యత్తు పచ్చని రంగునద్దుకొని కనిపిస్తుంది!
ఎకరాల మాగాణిని కలుపుకొంటూ ..
ప్రజల మనసుల్లో సంతోషం పంచుతూ
పాలమూరు ఎత్తిపోతలతో
కృష్ణమ్మ సాగుతోంది!
– వాసరచెట్ల జయంతి 9985525355
ఒక్కప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు
ఇప్పుడు ఎటుచూసినా పచ్చని పైర్లు
పల్లెర్లు మొలిచిన పాలమూరులో
పాడిపంటలు పరవళ్లు తొక్కుతున్నవి!
నిన్న, మొన్న మాట్లాడినా నోర్లు
పదహారుతో మూతపడినవి
మంచిని మంచి, చెడును చెడు
చెప్పకపోవడం కూడా చారిత్రక తప్పిదమే
దేన్ని చూడకపోవడం కూడా మూర్కత్వమే
ఇన్నేండ్లు శవంలా ఉన్న మనిషి
నేడు సగర్వంతో బతుకుతున్నాడు!
ఆకలి గర్భంలోంచి
కొత్తగా నేను జన్మించాను
ఇప్పుడు దేశమే నా వైపు చూస్తుంది
– ఎదిరెపల్లి కాశన్న 9640006304
ఆకాశ జలనిధి యమృత ధారలు రాల్చ
పాతాళ గంగమ్మ పైకి రాగ
మందాకినీ ధుని మరలు మిన్నేరులున్
పావన సురగంగలై వసించి
ప్రవహించు కృష్ణమ్మ పాయల పరవళ్లు
ప్రభవ సంద్రముల ప్రభంజనములె
యెత్తి పోతల నీరు యెలుగెత్తి చాటుచున్
రజిత గిరుల యందు రాజిల్లంగ
యలల జలకళల యానంద సోయగ
నెలవుల కులుకులానె తెలంగాణ
ప్రకృతి రమ్యతలను ప్రాజెక్టులన్ నిల్పి
కనుల విందులైన కడలి జేసి
పాల నురగలాగ పైపైకెగసి పడి
పొంగి పొర్లు నీటి పొంగులనగ
కరువుల నేల మురిసె! యే
కరువులు! లేనట్టి నీరు కర్మల ఫలమే!
ధరులు గిరులెక్కి పారెను
తరువుల సీమ నలమల్ల తరగని సిరులై!!
– బస్వోజు లక్ష్మణాచారి 90525 22062
కలశానికైనా, కలికైనా, కల్లు గీతకైనా
తీర్థానికైనా అభిషేకానికైనా
మంత్రానికైనా నాగరికతకైనా
జలధారలే ప్రాణధారలు !
డొక్కలెండిన వెన్నుపూసలు
పొలమారిన బీళ్లు
దేశాలు పోయిన బిడ్డలు
గొడ్డేడ్సిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం
గొంతెండిన నేల, గుండె చెదిరిన వేళ!
చెరువులు పురుగుల తెట్టెలై
కబేళాల కత్తులకు బలైన పశువులు
ఒరిగిన అమరుల్లా వరిమొలకలు
జీవనదులను కాళ్లకు కట్టేసుకున్న దుష్ట వలస పాలన!
పొద్దు పొడిచిన నేలలో
కొండలు తొలుచుకొని కోడె పరుగులతో
కృష్ణమ్మ పాలమూరును ముద్దాడే
కురుమూర్తి స్వామికి కోటి ఉద్దాలు
రేపటి హరిత వికాసానికై
ఒడుపుగా రిజర్వాయర్లు !
బొట్టు బొట్టు ఒడిసి పట్టుకొని
నీటి తిత్తులై నిలబడ్డ నేల
భూములిచ్చిన ప్రజల పాదాలకు శనార్థులు
ఎత్తిన పిడికిళ్లు బరిగీసిన నినాదాలు
నీటి జెండాలుగా ఎగురేసి
జల విజయగీతికలుగా పాడుతున్నది
ఎదురుచూసిన కలలు
ఎత్తిపోతలై అలుగు దుంకుతుంటే
మీసం మెలేస్తున్న రైతులు
దశాబ్దాల దరిద్రంపై నీటి యుద్ధం
అపర భగీరథుని ఉద్యమ పంతం
నదిని వాకిట్లకు మలిపిన యుద్ధం
నీళ్లు నాయినా నీళ్లు
దంటుకు నీళ్లు సేలకు నీళ్లు
ఒంటికీ నీళ్లు వంటకు నీళ్లు
పసిబిడ్డకు నీళ్లు ప్రతిపనికి నీళ్లు
చావు నడువాలన్నా
కర్మ సాగాలన్నా
నీళ్లే విముక్తి, నీళ్లే అస్తిత్వం !
– వనపట్ల సుబ్బయ్య 9492765358
సెలక బావుల్లోన
సేదురు బావుల్లోన
ఊర కట్టుకుని
ఊరు జనమంతా
కడవలతో నీళ్లు మోసిన కరువు నేల
కరువు నేల పాదాలు
కడిగింది గంగమ్మ
నీరు ఎరగని నేల
పాలమూరు నేల
నీరు నిలయమై నిలిచింది ఈ వేళ
ఎండగాలిన నేల
ఎద మీద గంగమ్మ
తడి లేని నేలను
తడిపింది కృష్ణమ్మ
నార్లాపురం నల్లమల
అడవి దాటింది
ఎగురుకుంటూ కృష్ణమ్మా
ఏదులకు వచ్చింది
ఏదుల మట్టి ఎదపై నాట్యము
వట్టెము మట్టిలో
ఒడివోసుకునే గంగ
పరవళ్లు తొక్కుతూ
పాలమూరు చేరింది
ఉద్ధండపురంలో గంగ
ఊయలూగుతుంది
కురుమూర్తిలో కృష్ణమ్మ
కూచిపూడి ఆడింది
బిర బిరా కృష్ణమ్మ
బీడు భూములు పారే
పాలమూరుల గంగ
పరవళ్లు తొక్కే
తడిసిన మట్టి
తనువు పులకించింది
పాలమూరు నీళ్ల పొంగు పాల తీరు
– దేవరపాగ కృష్ణయ్య 99634 49579
డబ్బు యేండ్ల
పరిపాలన కాలంలో
ఏ ప్రభుతకు జలంపై
యాది లేనే లేదు!
పాలమూరు రామన్ పాడు
ప్రాజెక్టు అందని ద్రాక్షే అయింది!
ఎవరి పార్టీ వాళ్లది
వాళ్ల కడుపు నిండింతే చాలు
మరి నేడు…
తెగువ తోడ పోరాటం
తెలంగాణ పుట్టుకతో
తాగునీరుకు సాగునీరుకు
కొదవే లేదు!
తెల్లని నురుగుల నవ్వులతో
పాలమూరు రామన్ పాడు
తెలంగాణ ప్రభుత
ముఖ్యమంత్రి కేసీఆర్
అమృత హస్తాలతో
ప్రవాహ జలజలలతో గాజులు గలగలన్నట్టు
కాలువల్లో పరవళ్లు తొక్కి..
జనం గుండెల్లో ఆనంద తాండవమాడిస్తూ…!
కర్షకులకు ఎనలేని సంతోషాన్ని పెంచింది!
కృష్ణమ్మ పంట పొలాలకు
పచ్చల మణిపూసల హారమై
రైతాంగానికి అంగబలం, అర్ధబలం
అందించనుంది!
సబ్బండ వర్ణాలకు
బుక్కెడు బువ్వనందిస్తది!
పాలమూరు రామన్ పాడు
రైతుల కలలు సాకారమై
జలచరాలతో వెలుగులీనుతది
జయహో! పాలమూరు రామన్‌పాడు
సుజలధారలకు జయహో!
రైతుల గుండెలకు అండదండలు అదరహో!
– డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి 85558 99493
పాదాలకు మట్టిని
ఎవరూ పరిచయం చేయక్కర్లే
ప్రవహించే పంట కాలువలకు
పొలాల చిరునామా చెప్పక్కర్లే!
మా కృష్ణమ్మ ఇకపై
సముద్రపు వలకు చిక్కని చేప
కరువు నేల మీద కాలుమోపింది
రాసుకొండి పాలమూరొక అక్షయ పాత్ర!
తరతరాలు గడిచినా
తలాపున పారే మా కృష్ణమ్మను
ఇంత ఉద్వేగంతో ఎత్తి దించిందివ్వాళనే
కూటికీ నీటికీ కొరత లేని చోటే స్వర్గం!
ఎత్తు పల్లాల కల్పిత కథకు
కాళేశ్వరం ఎండ్ కార్డు వేస్తే
పాలమూరు రంగారెడ్డి
ఎత్తిపోతల ప్రాజెక్టు
రైతుల నెత్తి మీద
పాలు పోసింది!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261
పాలమూరు అంటే.. పగలగొట్టిన అద్దం!!
పాలమూరు అంటే.. ంకర్రాళ్ల పర్వతం!!
పాలమూరు అంటే.. నోర్లు తెరిచిన బీళ్ల్లు!!
పాలమూరు అంటే.. వేగంగా ఆకాశంలోకి
వలస వెళ్లిన తెల్లని మేఘం!!
పాలమూరులో వానలు రావు
పాలమూరులో పంటలు పండవు
పాలమూరులో చెరువులు కుంటలు నిండవు.
కానీ ఇప్పుడు.. తెలంగాణలో
పాలమూరు పాడిపంటల పాల సముద్రం!!
పచ్చని పైరుల ఆకుపచ్చని రత్నం!!
కుంటలు చెరువులు నిండి వాగులు వంకలు
పొంగిపొర్లి పాలమూరు ఏరు ఇప్పుడు!!
ఆనాడు పాలమూరు రెండు కండ్లల్లో కన్నీరు
తాగునీరు సాగునీరు పాలమూరుకు
రెండు కండ్లిపుడు
– సునీతా ప్రతాప్ 9347320878
పొట్టకూటి కోసం పట్టణాలను చేరి
కూలినాలిజనులు కుమిలిరంత
ఇంటి పెద్దల చెంత చంటి పిల్లల నుంచి
కానని రాజ్యము కదలిరెపుడు
వర్షాల కొరకయి కర్షక మిత్రులు
కనురెప్ప వాల్చక కాంచిరంత
అతివృష్టి లేక ననావృష్టితో బాధ
పడుచుండె తెలగాణ ప్రాంతమందు
తెలగాణమంతయు దిగులులేకుండా
జలనిధులుప్పొంగి సాగెనిపుడు
చినచిన్న పల్లెల చెరువులు కుంటలు
నిండుకుండలుగాను నిగనిగమనె
కులవృత్తులును రైతు కూలీలు నెల్లరు
స్వస్థానములు చేరి సంతసమున
చింతలు విడనాడి జీవికల్ సాగింప
నిశ్చయించుకొనిరి నెమ్మదిగను
కనులపండువై తోచెనీ కాల్వ లిపుడు
బీడుభూములు పారుచు పెంపుమీర
పసిడి పంటలతో దేశ ప్రజలకెల్ల
నందజేయనునిలిచినా రద్భుతముగ
– జి.గోవర్ధన్ 81063 84812
కండ్లల్లో ఒత్తులు వేసుకొని
కండ్లు కాయలు కాసేలా చూసే
పాలమూరు కోసం
పరితపిస్తూ వచ్చింది అమ్మ!
తన వారి ఆనందం కోసం
తన హృదయాన్ని పరుచుకుంటూ
పాకులాడుతూ వచ్చింది అమ్మ!
ఎన్నెన్నో అటుపోట్లను దాటి
ఎన్నెన్నో అడ్డంకులను దాటి
ఎన్నెన్నో ఆశలను మోసుకొచ్చి
అలసి సొలసినా ఆనందంగా వచ్చిన
అమ్మను చూసిన జనం గుండె
కరిగి కరిగి నీరయ్యింది,
మనసంతా చల్లని చెరువయ్యింది!
కన్నీళ్లను తుడిచే
నీటికొంగులో చేరి సేద తీరుదాం,
భరోసాను ఇచ్చే నీటి ఒడిలో చేరి
చేపపిల్లలా ఈదుదాం,
కలలను నిజం చేసే
నీటి అలల జోలపాటలో
హాయిగా నిదురపోదాం!
ఇప్పుడు
రైతు నుదుటన
నీటితిలకం దిద్దింది అమ్మ,
బతుకు భద్రతనిస్తూ
భవితకు దారులు చూపుతూ
తరలివచ్చింది మన కృష్ణమ్మ!
– ప్రతాప్ కౌటిల్య, 83095 29273
అది ఎండిపోయిన గుండె!
రక్తపు నీరు కాదు కన్నీరు కూడా లేదు!!
నీటి గుంటలను.. నిండు సముద్రాలను చేసినట్టు
పాలమూరు గుండెలను
నిండుకుండలను చేసిన కల నిజమైన రోజు ఇది!!!
ఆకాశం నుంచి గంగను కిందికి దించడం కాదు
ఆకాశానికే గంగను ఎత్తిపోసిన
సముద్రం లాంటి ఒక నిజం ఇది!!
దశాబ్దాల యుద్ధం తర్వాత
ఒక విజయం ఇది.
సముద్రం వాగ్దానం
చేసింది ఆకాశానికి
ఆకాశం వాగ్దానం చేసింది భూమికి
ప్రభుత్వం వాగ్దానం చేసింది పైరుకు
నీటి ముత్యాలు నీకు ఇస్తానని
సిరుల పంటలు పండిస్తానని!
– పుట్టి గిరిధర్ 9494962080