ఇక్కడ మనుషులు ఎవరున్నారని
అంతా యూజర్లు, ఫాలోవర్లు, సబ్స్ర్కైబర్లు తప్ప!
ఇప్పుడు మనిషి సోషల్ యానిమల్ కాదు!
సోషల్ మీడియా యానిమల్!!
పాప పుణ్యాల పట్టింపు ఎవరిక్కావాలి
ఇప్పుడు అంతా లైకులు కామెంట్ల లెక్కలే
మోసేందుకు నలుగురిని సంపాదించలేని
వారిక్కూడా నాలుగు మిలియన్ల చందాదారులు
ఎమోషనల్గా వీకైపోయి
ఎమోజీల మీద ఆధారపడిన తరం నడుస్తోంది
హృదయాలు ఎప్పుడో స్పందించడం మానేశాయి
ఇప్పుడు సెట్టింగ్లన్నీ గూగుల్ వాడి చేతుల్లోనే
మనిషి ఆఫ్ లైన్
మనసు ఆన్ లైన్
జూమ్ రచ్చబండలు, అమెజాన్ అంగళ్లు
ఓటీటీ కళామందిర్లు యూపీఐ బొడ్లె సంచులు!
మనిషి సమూహాన్నెప్పుడో వీడిపోయాడు
నెట్టింటి చీకటి గదిలో
రీల్సు చుట్టుకొని ఊపిరాడకుండా పడివున్నాడు
కంట్రోల్ లేని ట్రోలింగులు
సెన్సార్ లేని రీలింగులు
ఇప్పుడు సెన్సర్గాన్లన్నీ న్యూసెన్సర్గాన్లే
డబ్బును కనిపెట్టి
ఏనాడో తన హృదయాన్ని పోగొట్టుకున్న మనిషి
అడిగిందల్లా చెప్పే జీపీటీలు గ్రోకులతో
ఇప్పుడు మెదడునూ పోగొట్టుకుంటున్నాడు
మనిషి అంతరించడానికి
ప్రళయాలు రానక్కర్లేదు
మనిషే.. తానున్నానని మరిచిపోతాడు
ఒకప్పుడు ఈ భూమ్మీద
మనిషి ఆధిపత్యం ఉండేదని
రోబో సేపియన్స్ పాఠాలు
చదువుకుంటారు!!
– కట్టా వేణు 97018 00189