పల్లవి: మోదుగు పూల వనంలోన-మొగ్గతొడిగే తెలంగాణ
ప్రగతిపూల బతుకమ్మలా-పరవశించె తెలంగాణ ॥మోదుగు॥
చరణం: నిజామును నేలకూల్చి- నిలబడిన పోరుబిడ్డ
స్వరాజ్యంలో అన్యాయం- సహించని ధీర గడ్డ
అహింసే ఆయుధంగా-తిరగబడ్డ జనం అడ్డ
స్వరాష్ట్రం పొత్తిల్లలో-సాదుకునే పసి బిడ్డ ॥మోదుగు॥
చరణం: పరుగెత్తే గోదారిని-ప్రాజెక్టుల నిలుపుకుంది
కదిలిపోయె కృష్ణమ్మను-కాలువల్లో మలుపుకుంది
మాడి నెర్రెబారిన భూమిని- మాగాణం చేసుకుంది
భగీరథ రూపుదాల్చి-ప్రతిగొంతు తడుపుతుంది ॥మోదుగు॥
చరణం: తనువంతా జలవనరుల-స్నానమాడుతున్నది
కన్నుల్లో విద్యుత్తు-కాంతులీనుతున్నది
సింగరేణి బంగారం-శిరము దాల్చుతున్నది
ధాన్యసిరుల అన్నపూర్ణ-దర్శనమిస్తున్నది
ప్రగతిపొద్దు నుదుటదాల్చి-భవిత చూపుతున్నది ॥మోదుగు॥
చరణం: కులమతాల సామరస్య-ఘనత చాటుతున్నది
సకలజనం సమాహారం-మెడలొ దాల్చుతున్నది
మానవత్వ పరిమళాల-మనసు పంచుతున్నది
దేశానికే ఆదర్శం-దిశను చూపుతున్నది ॥మోదుగు॥
చరణం: సంక్షేమ పథకాలకు-సారథి అవుతున్నది
సామాజిక న్యాయానికి-వారధి కడుతున్నది
అడ్డంకులు ఎన్నొచ్చిన-అధిగమిస్తు పోతున్నది
అభివృద్ధే లక్ష్యంగా-అడుగులు వేస్తున్నది ॥మోదుగు॥
-వేల్పుల నారాయణ, 94404 33475