నీలోన నాలోన లోలోన చెలరేగు
భావాలు, బంధాలు బాపు భాష
నిత్యమై సత్యమై నిరుపమానమయిన
ఆత్మ తత్వము దెల్పు అసలు భాష
అంతటా వ్యాపించి అంతటికిని మించి
ఆద్యమనంతమై అలరు భాష
అంతరంగమునందు అలరారు దీపమున్
పట్టి చూపెడు నట్టి భవ్య భాష
భాషలెన్నియున్న పలుకలేని పలుకు
వెలికిదెచ్చి మదిని వెలుగు భాష
ఋషిగణములకెల్ల ఋతముగా వినిపించి
మనిషి తీరు మార్చు మౌనభాష
మౌన భాష కన్న మహిలోన యితరమ్ము
వెదకి చూడ లేము వేగిరముగ
మౌనమందు మనసు మహిమాన్వితంబగు
నిశ్చలముగ నిలిచి నియతి నిచ్చు
మౌనమె యాభరణమ్మౌ
మౌనమె ఆలంబనమగు మనుషుల కెపుడున్
మౌనమె గానము ధ్యానము
మౌనమె తుద వరకు నిల్చు మాన్యత గల్గున్
పసిపాప నవ్వులో పరిమళించెడి భాష
యోగి హృదయమున మ్రోగు భాష
మేధోమథనమందు మెల్లగా కదలాడి
క్రొంగొత్త విషయాలు కూర్చు భాష
కవిలోకములకెల్ల కల్పనలందించి
వేలాది భావాల వెలుగు భాష
చిత్రకారుడి చిత్త చిత్రమై ప్రభవించి
వర్ణవైవిధ్యమై వరలు భాష
గాయకుల మదిలో సరిగమల మీటి
పాటయై ప్రవహించెడు ప్రథమ భాష
శిల్పి మానసమందు వసించి మించి
మాన్యశిల్పమై వెలుగొందు మౌనభాష
– డాక్టర్ చెప్పెల హరినాథశర్మ 9963460399