ఆగమాగమై బూగ లెక్క
ఎగురుతున్న మనసుకు
మనసున వట్టక
మూడు సేర్ల బీర్లు తాగిచ్చి
ఎండిపోయిన బోర్ల కాడ
బోర్ల బొక్కల పండి
బండబారిన భూమిని గెలికిచ్చి
సెమటసుక్కల తోటి తడిపి
సేసిన మట్టి ముద్దలను
పట్ట పగ్గాలు లేకుంట
పట్టపగలే కనిపిచ్చిన
సుక్కల మీదికి ఇసిరి
రోకు లేకుంట రోఖ మీద
దస్కత్ ఒత్తి
ఇంటిది అద్దగంట పోరువెట్టి
అద్దన్న గానీ
ఐదు సొప్పున అందుకున్న రకం
ఈ రకంగ ఆంబుక్క అయితే
ఆ దిమాకుల
ఎన్ని తీర్ల ఎరువులేసినా
పొలం ఎలుగకపాయే..
నొసలు నొగలు నగలు
అన్నీ కట్టగట్టుకొని ఎక్కిరిత్తే
పుకిలిచ్చి ఊంచాలన్నా
నోటికి పదన పట్టకపాయే..
ఉన్న పది గుంటలు
గుంట నక్కల పాలాయే..
ఎర్కున్న పనే బర్కతుంటదని
దోతి మీదికి కట్టి
పరాయి భూమిల
కిరాయి ఎవుసం జేత్తే
తుట్టికి పావుసేరే..
గీ మట్టి బతుకులు
ఎట్టికి బతుకుడేనా?
అల్లాడి శ్రీనివాస్
83416 63982