సాహిత్యం కేవలం మనసుకు ఆనందాన్ని పంచే కళారూపం కాదు. అది సమాజాన్ని మేల్కొలిపే మహత్తర శక్తి, చైతన్యానికి మార్గదర్శి, ఉద్యమాలకు ప్రాణవాయువుగా నిలిచే సాధనం. జీవన వాస్తవాలను ప్రతిబింబిస్తూ, అణగారిన వర్గాలకు స్వరమిస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగే ధిక్కార పతాకమే సాహిత్యం. ఈ కోణంలో పరిశీలిస్తే, బీసీవాద సాహిత్యం ఒక చారిత్రక అవసరమే కాకుండా..సామాజిక బాధ్యత కూడా అని అర్థమవుతుంది.
సాహిత్య చరిత్రను పరిశీలిస్తే, దళితవాదం, మైనారిటీ వాదం, స్త్రీవాదం వంటి అనేక ఉద్యమాలకు బీసీలు అండగా నిలబడ్డారనేది సత్యం. అయితే తమ వర్గాలకు మేలు చేసే బీసీవాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు అనే అవరోధాలను ఎదుర్కొంటున్నారు. మూడు దశాబ్దాలుగా బీసీవాద ఆలోచనలు సాగుతున్నా..పలు కారణాల రీత్యా సంపూర్ణ వికాసాన్ని సాధించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీ ఉత్పత్తి కులాల పాత్ర అత్యంత కీలకమైనది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమ జ్యోతిని వెలిగించినవారు బీసీలే అయినప్పటికీ ఫలితాలు మాత్రం వారికి సమానంగా అందలేదు.
తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో బీసీ కులవృత్తుల సేవలు అపారమైనవి. సామెతలు, జానపద గీతాలు, వచన కవితలు, పద్యాలు, కళారూపాలు..అన్నింటిలోనూ బీసీ జీవితవాదం ప్రతిబింబిస్తుంది.
విశ్వబ్రాహ్మణుల రుంజ, నాయీబ్రాహ్మణుల సన్నాయి, యాదవుల వీరణాలు, కురుమ ఒగ్గుడోలు, దుబ్బు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాలు వారి సృజనాత్మకతకు నిదర్శనం. వారి పనిముట్లు, భాష, అనుభవాలు..ఇవన్నీ సాహిత్యానికి జీవనసారం అందించాయి.
ఇటీవల రవీంద్రభారతిలో బీసీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్తలు సంగిశెట్టి శ్రీనివాస్, వనపట్ల సుబ్బయ్య నిర్వహించిన ‘బీసీ కులవృత్తుల దీర్ఘకవితలు-సదస్సు’ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, రచయితలు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, విద్యార్థు లు పాల్గొన్నారు. ఈ సదస్సులో వివిధ వృత్తులకు చెందిన కవులు తమ జీవనానుభవాలను దీర్ఘకవిత్వాలుగా మలిచి, సాహిత్యానికి నూతన స్వరూపాన్ని అందించారు. ఇవి బీసీ కులవృత్తుల శ్రామిక జీవితాలను ప్రతిబింబించాయి. కేవలం సాహిత్య సృజనలే కాకుండా, శతాబ్దాలుగా అణచివేతకు గురైన వృత్తిజీవుల జీవిత సత్యాలు, వారి కష్టసుఖాలు, సామాజిక స్థానాన్ని ప్రతిబింబించే జీవనచిత్రాలుగా నిలిచాయి. ఆయా జీవితాల్ని గాఢంగా ఆవిష్కరిస్తూ బీసీ వాదాన్ని ఆవిష్కరించాయి. సామూహిక స్వరాన్ని సృష్టించాయి. ఇవి కేవలం కవుల వ్యక్తిగత అనుభూతులు కావు. ఇవి సమాజంలో ఒక వర్గం చరిత్ర, ఆవేదన, గౌరవ పోరాటానికి ప్రతీకలు. ఈ కవితల్లో భాష కూడా ప్రత్యేకతను సంతరించుకున్నది. తెలంగాణ మాండలికం, స్థానిక పదాలు, వృత్తి సంబంధిత పదజాలం కవితలకు నిజాయితీని తీసుకువచ్చాయి.
తెలంగాణ సాహిత్యంలో ఒక కొత్త దిశను చూపించాయి. శ్రమను మహిమాన్వితం చేయడమే కాకుండా, సామాజిక న్యాయం, సమానత్వం సాధించాలని పిలుపునిచ్చాయి. ఈ కవితలు భవిష్యత్తు తరాలకు కూడా శ్రామికుల గౌరవాన్ని గుర్తుచేస్తూ నిలిచే విలువైన సాహిత్య సంపదగా నిలుస్తాయి. సాహిత్యం ఈ ఉద్యమానికి శక్తివంతమైన ఆయుధంగా మారాలి. కవులు, రచయితలు తమ కలం ద్వారా బీసీ జీవనాన్ని ప్రతిబింబిస్తూ చైతన్య జ్యోతిని వ్యాప్తిచేయాలి. బీసీ సాహిత్యం మరింత విస్తరించి, నూతన తరానికి మార్గదర్శకంగా నిలిచినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుంది.
-జంపాల ప్రవీణ్
9951211817