Smartphone : ఎండ వేడిమి ప్రభావంతోపాటు వివిధ కారణాల వల్ల సమ్మర్లో స్మార్ట్ ఫోన్లు త్వరగా వేడెక్కుతున్నాయి. అలాగే, ఎక్కువగా గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఛార్జింగ్ వల్ల కూడా ఫోన్లు త్వరగా హీట్ అవుతున్నాయి. ఇలాగే, తరచూ ఫోన్లు హీటైతే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అయిపోవడం, పర్ఫామెన్స్ స్లో అవ్వడం వంటివి జరగొచ్చు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ స్మార్ట్ఫోన్ త్వరగా వేడెక్కకుండా చూసుకోవచ్చు.
స్మార్ట్ఫోన్లపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నేరుగా ఎండ తగలకూడదు. ఇంట్లో కూడా వేడి తగిలే చోట ఫోన్లు ఉంచకూడదు. కార్లో వెళ్లేటప్పుడు డ్యాష్ బోర్డ్ వద్ద ఫోన్ ఉంచకూడదు. దీనివల్ల ఫోన్ వేడెక్కే ఛాన్స్ ఉంది. అలాగే, నీడ ఉండి, చల్లదనం ఉన్న చోటే ఫోన్ ఉంచాలి. ఒకవేళ ఫోన్ వేడెక్కితే బయటినుంచి చల్లబర్చేందుకు ప్రయత్నించకూడదు. అంటే, ఫోన్ను చల్లటి నీళ్లతో తుడవడం, ఫ్రీజర్ దగ్గరగా ఉంచడం వంటివి చేయకూడదు. అతి చల్లగా ఉండే చోట ఫోన్ ఉంటే ఆ చల్లదనానికి, తేమకు లోపలి భాగాలు పాడయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఫోన్ను దానికదే చల్లగా అయ్యేలా చూడాలి.
తక్కువ వేడిగా ఉంటే కొద్దిసేపు ఫోన్ వాడకుండా పక్కన పెట్టాలి. మొబైల్ డేటా కూడా కాస్సేపు ఆపేయాలి. ఇంకా వేడిగా ఉంటే కొద్దిసేపు స్విచ్ఛాఫ్ చేసి ఉంచాలి. ఆ తర్వాత ఆన్ చేస్తే హీటింగ్ తగ్గుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ ఉంది కదా అని ఎక్కువ సేపు గేమ్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేయకూడదు. ఫోన్కు కూడా విశ్రాంతి అవసరం. ఎక్కువ సేపు ఫోన్ వాడాల్సి వస్తే చల్లగా ఉండే ప్రదేశంలో, బ్రైట్నెస్ తగ్గించుకుని వాడుకోవాలి. ఇతర మొబైల్ ఛార్జర్లు వాడకుండా ఒరిజినల్ ఛార్జర్లు మాత్రమే వాడాలి. దీనివల్ల ఫోన్ హీట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.