పట్నమంటే పరుపు బండల వన్నె కాదు
పల్లె నుంచి ఉత్త సేతులతో వచ్చి
పని దొరుకక వీధి లైటు కింద
ఆకలిని చంపుకొన్న అభాగ్యుల దీనుల గాథ
పల్లె నుంచి పట్నంకు
పస్తులు సంపుకోడానికన్న
గుప్పెడు పరువును మిగిల్చుకోవాలని
తల్లిని వీడిన దుఃఖంతో పట్నం బస్సెక్కుతారు.
దున్నే నాగలిని పాత గోడకు పొందించి
ఎన్నడూ బూట్లు ప్యాంటు తొడగని రైతన్నలు
పెద్ద భవనాల గేట్ల ముందు
కన్నీళ్లు రాలుస్తూ పహారా గాసే
వలస పక్షులై వలపోతను తలపోస్తుంటారు
బస్సుకు ఛార్జీలు లేక దొంగరైలు ఎక్కొచ్చి
పైమీది బట్టలు తప్ప మరొక జతలేక
పొద్దున్నే అడ్డ మీద నిలబడి నిలబడి
కూలీ దొరకని కూలోడి గుండె
బల్లెం దిగిన జింకపిల్ల వేదన
గూడు దొరకక ఫుట్పాత్ మీద తలవాల్చి
లారీల బస్సుల శబ్దానికి కర్ణభేరీలు పగిలిపోతున్న
ఆకలిముందు అవేమీ వినిపించుకోలేని
మనిషి రేపటి మనుగడకు సజీవ ఇత్తనం.
మురికివాడల నడుమ
గాలి వీయని ఇరుకు సందుట్ల
ఇంటికి సుట్టం వస్తే ఒకరు బయట మరొకరు లోపల
వంతుల వారీగా తలదాసుకొనే బిగపట్టి బతికేటోడు
ఈ దేశపు అత్యంత పేదోడు.
ఇస్తరాకులో విసిరేయబడ్డ మెత్కుల కోసం
కుక్క మనిషి మధ్య ఆకలి పోరాటం
ఆ దృశ్యం చూస్తున్న కవి
ఎంత రాసిన ఒక్క కవిత ఒలక లేదు
బహుశా ఆ కవి సగటు మధ్య తరగతి జీవై ఉంటాడు.
మీరు పట్నానికి అద్దాల మేడలు చూడడానికి వెళ్తే
నేను ఆ మేడల నీడల సందుట్ల
ఇరుక్కపోయి మురుగు నీళ్లతో దూప దీర్చుకునే
కటిక పేదోడి గుండె మంటను చూడ్డానికి వెళ్తుంటా.!
-అవనిశ్రీ
99854 19424