కొంత చీకటి తలుపు తెరుచుకొని వచ్చాక
నిన్నటి కారుమేఘం క్రోధమంతా మరిచినప్పుడు
కొత్తదారిలో చూపు గ్యాలానికి చిక్కుతుంది
మసకబారిన దృశ్యాలు కంటి తెరపై తచ్చాడి
ఉచ్చులు విడదీసుకుంటూ పెనవేసుకుంటూ
గది మొత్తం కథలా కదలాడుతుంది
పెదవి విరిచిన ముసలి నవ్వొక్కటి
నువ్వు పుట్టినప్పటి సంగతులు
గతి తప్పనీయని మజిలీలనుకున్నది
మబ్బులు కమ్మిన నింగి వెనుక ఏమి దాగుందో
చీకటిలో కలువాలనే హృదయ జ్యోతులు
వ్యథాభరిత వృద్ధాప్యానికి పెను సవాళ్ళనేమీ విసరవు
సన్నగిల్లిన ఏకాగ్రత
మరుపుదారి పట్టిన జ్ఞాపక శక్తి ప్రేరణలేని జీవనం
గాఢత లేని స్పందన సవ్యాపసవ్యాలను తనవి చేసుకున్న
ముదిమి ఆవృతం
నిన్ను ఏ వృత్తంలో బంధిస్తాయి?
పరిపూర్ణత మొత్తం ఏ చట్రం గాక
వయసు పరాధీనతల అవమానాలు
వివేక శూన్యులనే బిరుదుల సత్కారాల
పండుటాకులు
పాత సామాన్లుగా
పట్టలేని శూన్యత చేరిన స్పాట్లైట్ మౌనం
ఎన్ని కంటకాలు పరివృతమైనాయో
దాటివచ్చిన రాళ్ళూ రప్పలు ఇప్పుడు
మంచం చుట్టూ నడుస్తున్నట్టున్న మాటలు
ఒక్కో ప్రహరీకి ఒక ముచ్చట ఇంటింటికో మట్టిపొయ్యి
కేర్ టేకర్లూ లేని ఎండుటాకులు మూడో కాలుతో
భూతద్దపు అద్దాలతో
ఊడిన పళ్ళతో
ఊగిసలాడే మనసుతోనే వెళ్ళదీత
గదిని కాపలా కాసే చీకటి ఒక్కటే ఇప్పుడు
వాళ్ళకు స్నేహమైంది
నడిచొచ్చిన అన్ని ప్రయాణాలను కాలదన్నిన
ఈ దీర్ఘ జీవితం
పశ్చిమాకాశం వెలుగు చిన్నబోయి
కనుపాపగా మారినట్టు
ఆ నల్లబడిన ఆకాశం ముసలిదైపోయింది
డాక్టర్
కొండపల్లి నీహారిణి
98663 60082