కవయిత్రి విమల ‘వంటిల్లు’ కవితలో స్త్రీ పరాయీకరణ గురించి ప్రతిభావంతంగా ప్రకటించింది. స్త్రీ అన్నీ తానై ఇంటిని నిర్వహిస్తున్నా.. ఇంటిలో తన ఉనికి ఉండని స్థితిని, చివరికి ఏ వస్తువుపైనా తన పేరు ఉండని స్థితిని చెప్తుంది. ఆ కవితలో… ‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి/ అయినా చివరకు వంటింటి గిన్నెలంటిపైనా నాన్న పేరే..!’ అని పురుషాధిపత్యాన్ని ఎత్తి చూపింది.
స్త్రీ అణచివేతకు, వివక్షకు విమల ‘వంటిల్లు’ను ప్రతీకగా తీసుకొని కవిత రాసింది. ‘మనమేమైనా మన అంతిమ కర్తవ్యం/ గంటె తిప్పడం చేసిన ఈ వంటిల్లును ధ్వంసం చేద్దాం రండి..’ అని పిలుపునిచ్చింది. ఈ వాక్యాల్లో ‘వంటింటిని విధ్వంసం చేద్దాం’ అనటం అనేది వ్యవస్థను ధ్వంసం చేద్దాం అనేదానికి ప్రతీక.
స్త్రీవాదంలో ‘రాడికల్ ఫెమినిజం’, ‘సోషలిస్టు ఫెమినిజం’ ఉన్నాయి. తెలంగాణలో రచయిత్రులు మూడో ధోరణి అయిన ప్రజాస్వామ్య స్త్రీవాదం భావజాలంతోనే రచనలు చేశారు. గీతాంజలి- ‘బచ్చేదాని’, ముదిగంటి సుజాతారెడ్డి- ‘విసుర్రాయి’ అనే కథా సంపుటులను ప్రచురించారు. ఈ కథల్లో స్త్రీలు ఎదుర్కొ నే వివక్షలు, గృహ హింస, శ్రమదోపిడీ, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవటం, సమస్త నిర్ణయాల్లో భాగస్వాములు కాకపోవటం వంటి అంశాలను చర్చించారు.
జయధీర్ తిరుమలరావు స్త్రీవాద కథలను ఎంపిక చేసి సంపుటిగా ప్రచురించారు. పురుషాధిపత్యం, వరకట్న సమస్య, స్త్రీల ఆత్మహత్యలు మొదలైన వాస్తవిక జీవితంలోని సమస్యలు ఈ కథానికల్లో ప్రతిబింబించారు. గీతాంజలి రచించిన ‘ఆమె అడవిని జయించింది’ అనే నవల నిజామాబాద్ యాసలో ఉంది. కుటుంబంలో పురుషులకు అనుగుణంగా స్త్రీలు లొంగి నడుచుకోవడం స్త్రీలు ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలు విడిచిపెట్టి ఆచారాలు, సంప్రదాయాల పేరుతో అణచివేయబడటం ఈ నవలలో చిత్రించబడింది.
ముదిగంటి సుజాతారెడ్డి ‘ఆ ఆకాశంలో విభజన రేఖల్లేవు’ (1995) అనే నవలలో స్త్రీలు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని పురుషులతో సమానంగా ఉండాలని, పురుషులు కూడా స్త్రీలకు అండదండగా నిలవాలి అనే విషయాలను చిత్రించింది. సాధన రాసిన ‘రాగో’ నవలలో విప్లవోద్యమంలో స్త్రీల భాగస్వామ్యం, నూతన సమాజంలో నిర్మాణమయ్యే సంస్కృతి, నూతన విలువల ఆవిష్కరణ ఉన్నది. ఒక నూతన వ్యవస్థకోసం, సమసమాజం కోసం పోరాడుతున్న క్రమంలో స్త్రీ, పురుషుల మధ్య పని విభజన, అన్నింటా భాగస్వామ్యం ఎంత ప్రజాస్వామికంగా, మానవీయంగా ఉంటుందో విప్లవోద్యమంలో భాగంగా స్త్రీవాదాన్ని ‘రాగో’ నవలలో రచయిత సాధన చిత్రించారు. నూతన మానవి ఆవిష్కరణ బీజరూపంలో ఎలా సాగుతున్నదో ‘రాగో’ నవల చిత్రించింది.
అమెరికాలో ‘బ్లాక్స్ ఫెమినిజం’ లాగానే, తెలుగులో దళిత-స్త్రీవాదం ఏర్పడింది. స్త్రీవాదంలో జెండర్, వర్గాలను స్త్రీలు ఎదిరిస్తే, దళిత స్త్రీలు జెండర్ వర్గంతో పాటు.. కులం, రంగులను ఎదిరించవలసి వస్తున్నది. దళిత స్త్రీలు తమ వేదనను తమ రచనల్లో అక్రోశంతో వ్యక్తీకరించుకున్నారు. ఆధునికత దళిత స్త్రీల హక్కులను హరించి వేస్తున్నదని దళిత స్త్రీవాదులు అంటున్నారు. ఒకప్పుడు వాళ్ల జీవితంలో స్త్రీ దేవత శక్తివంతమైంది. మగ దేవతలను ఎదిరించి నిలుస్తుంది. అటువంటిది సంస్కృతీకరణతో పురుషునికి లొంగిన ఆధునిక దళిత స్త్రీ బానిస బతుకు బతక వలసి వస్తున్నదని ఆక్షేపించారు.
‘తిరుగుబాటు ప్రకటిస్తున్నా/ కుటుంబంలోని కుళ్లును కడిగి సమాజంలోని దురహంకారాన్ని ఇక ఉతికి ఆరేస్తా..’ అంటుంది జాజుల గౌరి. జూపాక సుభద్ర, జాజుల గౌరి, గోగు శ్యామల, మేరీ మాదిగ మొదలైన వాళ్లెందరో దళిత స్త్రీల అనుభవాల్ని కథల్లో, నవలల్లో, కవిత్వంలో, వ్యాసాల్లో బలంగా చెప్పారు. గోగు శ్యామల దళిత స్త్రీల రచనలను సేకరించి 2003లో ‘నల్లపొద్దు’ పేరుతో సంకలనంగా వేసింది.
1921-2002 మధ్య కాలంలోని దళిత స్త్రీల రచనలను దీనిలో పరిచయం చేసింది. జాజుల గౌరి ‘మన్నుబిడ్డ, వాయినం’ అనే నవలలను, ‘మన్ను బువ్వ’ అనే కథల సంపుటిని ప్రచురించింది. జూపాక సుభద్ర దళిత స్త్రీల వ్యథలను కథల్లో వాళ్ల యాసలో గాఢంగా వ్యక్తం చేసింది. దళిత రచయిత్రుల దళిత స్త్రీవాద రచనలు తెలంగాణ నుంచి వచ్చినంతగా మరే ప్రాంతం నుంచి రాలేదంటే అతిశయోక్తి కాదు.
దళిత స్త్రీల తిరుగుబాటు మాదిరిగానే.. ముస్లిం రచయిత్రులు తిరుగుబాటు, నిరసనలను వ్యక్తీకరించారు. ముస్లిం స్త్రీవాద రచయిత్రులు తమ సంస్కృతిలో ఉన్న స్త్రీ అణచివేత, బుర్ఖా, తలాక్, గృహహిం స వంటి సమస్యలను చిత్రిస్తూ కవిత్వం, కథలు రాశారు. మత శక్తులు స్త్రీల మీద జరిపే అత్యాచారాలను, హింసను నిరసించారు. షాజహానా, షంషా ద్, షానాజ్ ఫాతిమా, సలీమా యాస్మిన్ బేగం, ఎం.ఎస్ బేగం, జాకెరా మొదలైన తెలంగాణ ము స్లిం స్త్రీవాద రచయిత్రులు కవితలు, కథలు రాశారు.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606