మా ఊరుకు నాకు మధ్య
విడదీయలేని సంబంధం ఉంది
ఎంత దూరంలో ఉన్నా
ఎన్ని ప్రయాసలైనా
ఏడాదికి ఒకసారి అయినా
వెళ్లి చూడాలనిపిస్తది
తనివి తీర తిరగాలనిపిస్తది
చిన్ననాటి జ్ఞాపకాలను
నెమరు వేసుకోనిదే
ఆత్మ తృప్తి ఉండదు
ఊరును చూస్తున్నంత సేపు
ఎద లోపల ఏదో
దేవులాడుకున్నట్టు ఉంటది
లేగ దూడ లెక్క
అమ్మ కోసం వెతుకుతున్నట్టు ఉంటది
గంటల తరబడి కలియదిరిగి
సోపతిగాళ్లతో ముచ్చటలాడనిదే
మనసు కుదటనే పడదు
కోట బురుజు కాడ
బొడ్రాయి బజార్ దగ్గర
దోస్తుగాళ్లతో ఆటలాడిన
గుర్తులు ఎన్నెన్నో
గుండెల గుచ్చుతూనే ఉన్నవి
నాలుగు దిక్కులు
కండ్లారా చూసినంక
పల్లె తల్లి అమ్మ లెక్క
పలకరించినట్టు ఉంటది
ఎంతైనా ఊరుది
పేగు బంధం కదా!
ఎప్పుడు పోయినా
అక్కున చేర్చుకుంటూనే ఉంటది
-కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
9441561655