‘అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె మాయ మోసము జూచి మండిపోవును ఒళ్ళు’
అని అన్నప్పుడే అర్థమైంది కాళోజీ అంతరంగం, ఆవేదన, ఆగ్రహం అంతులేనివని. ఈ ప్రపంచంలోని సమూహంతో గొడవకు అదే మూలకారణమని అర్థమైంది. పాలకుల నిర్లక్ష్యం వలన అనేక కష్టాల కడలిలో సతమతమవుతూ జీవన విధ్వంసానికి గురవుతున్న మట్టి మనుషుల ఆర్తి, ఆవేదనే ఆయన ఆలోచనలకు మూలపదార్థం. మనుషులను ప్రేమించడమే ఆయన బతుకు పాఠ్యాంశం. అందుకే నడుస్తున్న కాలానికి కవిత్వమే సమాధానం చెప్తుంది అనడానికి ఆయన కవిత్వమే నిదర్శనం. సోయితప్పి నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తన కవిత్వంతో చైతన్యపరచిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు.
అన్యాయమే అధికారమైతే ప్రశ్నించే గొంతుదే గొడ వ. ఆధిపత్యమే నిర్బంధమైతే ఎదిరించే కలానిదే తిరుగుబాటు. ధిక్కారమే ఉద్యమమైనప్పుడు ప్రతిధ్వనించే నినాదమే కాళోజీ. రాజ్యంపై, పెత్తందారీ అప్రజాస్వామ్యంపై తన అక్షరాల కొరడాను ఝుళిపించిన కవియోధుడు కాళోజీ. విపత్కర పరిస్థితిలో తెలంగాణ యాసలో, భాషలో కవిత్వం రాసి తెలంగాణ భాషకు, యాసకు పట్టం కట్టిన కవి కాళోజీ.
కాళోజీకి మాండలికాలంటే చాలా ఇష్టం. కాళోజీ బతికున్న రోజుల్లో ఆయన జన్మదినాన్ని తెలుగు మాండలిక దినోత్సవంగా కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజీ జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా జరుపుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని మాండలికలను గౌరవించాలి. ఏ మాండలికాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదని కాళోజీ అభిప్రాయం. బడి పలుకుల భాష ప్రామాణిక భాష అయితే, పలుకుబళ్ళ భాష వ్యవహారిక భాష అని ఇలా అంటారాయన.
ముద్దాయి-అక్యుజుడు: అదాలత్-కోర్ట్
నీ బాంచెన్ గులాపోణ్ణి-చిత్తం సార్:
రోడ్డు-సడక్: టీ-చాయ: పరామర్శ-పలుకరింపు:
కొట్టు-షాపు: సిల్సిలా-సీరియల్
ఇలా రెండు పదాలు ఇచ్చే అర్థాలు ఒక్కటే అయినప్పుడు ఆంధ్ర ప్రాంతం వారు వాడే పదాలు నాజూకని, తెలంగాణ వారు వాడే పదాలు మొరటువా అంటూ కాళోజీ వాపోయారు. తెలుగు భాష ఎన్నితీర్లుగా ఉన్నా అన్ని యాసల అర్థం ఒక్కటేనని, దేని అందం దానిదేనని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను తట్టుకోలేక తెలంగాణ ప్రజలు స్వరాష్ట్ర ఉద్యమానికి నడుం బిగించారు. ఈ సమయంలో ఉద్యమానికి ఊపిరులూదాల్సిన తెలంగాణ కవులు చైతన్యం కోల్పోయి ప్రభుత్వ విధానాలకు వంతపాడే తత్వం ప్రబలిపోయిందని కాళోజీ కలత చెందారు. ఈ కారణంగా ఉద్యమ వేడి చల్లారిందని భావించి పాలకుల పీక నొక్కు సిద్ధాంతం భాష నొక్కు సిద్ధాంతం అయిందని ఇలా అంటారు.
కాళోజీ పేలుతుంటే
నా గొడవ లావా చిందుతుంటే
దద్దమ్మలు బెదురుతుంటే దేబెలు కదలక వింటే
బతుకు చితికిపోతుంటే శాంతి-శాంతట-శాంతి!!
అని తాను ఎందుకు ఇంత అశాంతిగా ఉన్నారో పై వాక్యాల ద్వారా వ్యక్తం చేశారు. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న తెలుగువాళ్లు మూడు రకాలైన యాసతో తెలుగు మాట్లాడతారు. దీనిలో ఎవరి యాస తక్కువ, ఎవరి యాస ఎక్కువ అని ఎవరు నిర్ణయిస్తారు? ఈ మూడింటిలో ఏది ప్రామాణిక భాష, ఏది శిష్ట వ్యవహారిక భాష అని ఆయా ప్రాంతాల భౌగోళిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితులను బట్టి భాషలు ఉంటాయని, కూర్పులు ఉంటాయన్న కాళోజీ కవితా వాదన చూస్తే ఆయనొక భాషా శాస్త్రజ్ఞుడిలా కనిపిస్తారు.
కాళోజీ మాట్లాడిన భాష అచ్చ తెలంగాణ పదాలు. తన కవితా రచనలన్నీ తెలంగాణ పల్లె భాషలోనే ఉంటాయి. అందరి దస్తూరి ఒక్క తీరుగా ఉండదు. భాష కూడా అట్లనే ఉంటుంది. అంతా తెలుగే అయినా ఎవని వాడుక భాష వారిదని ఆయన చాలాసార్లు చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ విలీనమైన తర్వాత తెలంగాణ భాష షోగ్గా లేదన్నారు. నాజూకుతనం లేదన్నారు. మోటు భాషంటూ హేళన చేశారు. తెలంగాణ ప్రజల భాష పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఆయన ఒక కంట కన్నీరు కారుస్తూ మరో కంట అగ్నిని కురిపించి తన సాహిత్యంలో తెలంగాణ భాషను ప్రధాన వస్తువుగా చేశారు. భాష పట్ల, వ్యాకరణం పట్ల శాస్త్రీయమైన అవగాహన స్పష్టంగా ఉన్నవారు కాళోజీ. అందుకే భాషా స్వభావాన్ని గురించి ఇలా అంటారు.
‘వ్యాకరణం రాజబాట వేస్తుంది
వాడుక పిల్లబాట తొక్కుతుంది.
సమ్మతరూప దర్శనాభిలాషి పండితుడు
అగుపడ్డ రూపమే సమ్మతము సామాన్యునికి.
ఎవనికో నచ్చునట్లు పలకడం నాడు
ఎవనికి వాడు వచ్చినట్లు పలకడం ఖాయం నేడు’
వ్యాకరణాలు గ్రాంధిక భాష పేరుతో, ప్రామాణిక భాష పేరుతో పదాలకు స్థిరరూపాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తాయి. కానీ ప్రజలు వాటిని అనుసరించి పదాలను ఉచ్ఛరించరు, తమకు అనుకూలమైన విధంగా ఉచ్చరిస్తారు. ప్రజల ఉచ్చారణకు అనుగుణంగా వ్యాకరణాలు రాసుకోవాల్సిందే, మార్చుకోవాల్సిందే. ప్రయోగ శరణం వ్యాకరణం అన్నారు కదా! వ్యాకరణం రాజబాట లాంటిదైతే సామాన్య ప్రజలు ఆ బాటలో నడువరు, షార్ట్‌కట్‌లో వెళ్లడానికి పిల్ల బాటలు వేస్తారు. అంటే ఉచ్చారణ సౌలభ్యం కోసం పదాలను సరళీకరిస్తారు. కాళోజీ ప్రజల భాషలో కవిత్వం రాశారు కాబట్టి ఆయన కవిత్వంలో సాంప్రదాయ వ్యాకరణ లక్షణం భిన్నరూపాలు కనిపిస్తాయి.
కాళోజీ భాషను ఇతివృత్తంగా చేసుకొని కవితలు రాశారు. ప్రజల జీవద్భాషను ప్రేమించారు. తెలంగాణ మాండలిక భాషలో కవిత్వం రాయలేకపోయిన ఆయన కవిత్వంలో తెలంగాణ ప్రాంత యాస కనిపిస్తుంది. ఆయన మాటల్లో సజీవమైన తెలంగాణ మాండలిక భాష ప్రాణం పోసుకుంటుంది. ఇదీ నా గొడవ పేరు మీద ఆయన రాసుకున్న ఆత్మకథలో పూర్తిగా తెలంగాణ మాండలిక భాషను చూడవచ్చు. సాహిత్యం, భాష ప్రజల పక్షం నిలువాలని, అవి ప్రజలను కదిలించాలని కాళోజీ భావించారు. అంతేకాదు, తన కవిత్వాన్ని ఆ రీతిగా రాసి చూపించారు. భాషకు, ఇతివృత్తానికి మధ్య చక్కని సమన్వయం సాధించారు.
‘కలముపోటున కదపజాలని
కావ్యగానము ఇంకెన్నాళ్లు
కాళోజీ కవి కైత వినియు
కదలకుందురు ఇంకెన్నాళ్లు’
అని ప్రశ్నించారు. ప్రజలను పట్టించుకోకుండా వారిని నిద్రపుచ్చే కవిత్వం ఇంకానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కవితను మెచ్చకున్నవారు, చదివినవారు సైతం కదులకపోవడానికి కారణం ఏమిటని సూటిగా కాళోజీ ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఆయన మరణాంతరం కూడా మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టోద్యమ కాలంలో రెండున్నర జిల్లాల తెలుగుని నిరాకరిస్తూ తెలంగాణ భాషా అస్తిత్వాన్ని కాళోజీ అప్పుడే గుర్తించారు.
‘వీర తెలంగాణ నాది
వేరు తెలంగాణ నాది
వేరై కూడా తెలంగాణ
వీర తెలంగాణ ముమ్మాటికీ’
వీర, వేరు రెండు తెలంగాణలు ఉండవని చారిత్రక సందర్భం నుంచే రెండు దశలు ఉత్పన్నమయ్యాయని అన్నివేళల్లో కూడా తన భాషా సంస్కృతులను పరిరక్షించుకుంటూ వీర తెలంగాణగానే ఉంటుందని కాళోజీ ప్రకటించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం భాష కోసం నిరంతరంగా తెలుగువారిలో చైతన్యం రగిలించిన వ్యక్తి కాళోజీ. బర్రె, పెండ, తోవ, కడప, చాయ, బొక్క, మందలింపు, తోలడం మొదలైన తెలంగాణ జీవద్భాషా పదాలకు సాహిత్య గౌరవాన్ని కల్పించిన తెలంగాణ భాష యుద్ధనౌక ప్రజాకవి కాళోజీ.
తెలంగాణ సంస్కృతికి ఆరడుగుల ప్రత్యక్ష నిదర్శనం కాళోజీ. ప్రపంచంలో ఏ కవి అయినా తన ప్రాంత స్పర్శ లేని కవిత్వం, తనను ప్రభావితం చేసిన సంస్కృ తి, సంప్రదాయాల ముద్ర లేని కవిత్వం రాయలేడేమో! అందుకే కాళోజీ కవిత్వం నిండా తెలంగాణ సంస్కృతి ఒక ఆత్మలా, ఒక ప్రాణంలా, కంటికి కనిపించని ప్రాణవాయువులా వ్యాపించి ఉంటుంది. అందుకే సముద్రగర్భంలోంచి తీసిన వజ్రానికైనా వన్నె తగ్గునేమో కానీ తెలంగాణ ప్రజల రక్తనాళాల్లో కలిసిపోయిన కాళోజీ కవిత్వానికి, వ్యక్తిత్వానికి ఎన్నటికీ వన్నె తగ్గదు. అణగారిపోయిన తెలంగాణ భాషా సంస్కృతిని కాపాడుకోవడం కోసం చివరి శ్వాస వరకు శ్రమించి జన జీవితమే తన జీవితమై అన్యాయాన్ని ఎదిరించినవాడే నా ఆరాధ్యుడు అంటూ వెళ్లిపోయిన కాళోజీని తలచుకోవడం నేటితరాలకే కాకుండా భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకం.
తెలుగు బాస ఎన్ని తీర్లు
తెలుగు యాస ఎన్ని తీర్లు
వాడుక ఏ తీరుగున్న
తెలుగు బాస వాడుకయే?
అనేది కాళోజీ భాషా దృక్పథం. ఈ దృక్పథమే అసలు సిసలైన ప్రజాస్వామిక భాషా దృక్పథం.
(9న కాళోజీ జయంతి..తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా..)
డాక్టర్ ఆగపాటి , రాజ్ కుమార్
8309706806