కలల్ని కాపలా పెట్టాను
కనుల ఖజానాకి!
నా నిదుర నిధికి రెప్పలే రక్షకులు!!
కొన్ని అక్షరాలు మేసి
నా కలం కవితల్ని పొదిగింది!
నేను ఊహల్ని వెతుకుతూ
ఊరి పొలిమేరలకు చేరాను
అక్కడ అజ్ఞాత ప్రేమికులు
హృదయాల్ని పంచుకోవడంలో
వాటా కుదరక తగాదా పడుతున్నారు!
వారికి సర్దిచెప్పి
కొన్ని కవితలు బహూకరించాను!
మేఘాల మేలి ముసుగులో
నీలిమ చినుకై నవ్వింది!
ఆ చినుకుల్ని పోగేసి
ఓ వర్షాన్ని సృష్టించాను
నా కలల కార్ఖానాలో!
రైలెళ్లి పోయాక
పట్టాలపై చెవి ఒగ్గి విన్నాను
ఎన్ని ప్రేమ గీతికలో!
నా హృదయంలో ఒంపుకొని
వెను తిరిగాను
ఓ మోడుపై కూర్చొని
ఒంటరి పక్షి దుఃఖిస్తున్నది
జ్ఞాపకాల ఆకులు రాలిపోయాయని!
ఆ పక్షిని ఊరడించి
రెండు చివురుల్ని బహూకరించాను
ఆ పక్షి వెళుతూ
వసంతాన్ని నాకు వాగ్దానం చేసింది!
తిరిగి ఇంటికి చేరాలి
అసలే జులాయినని అపవాదు!
ఆపై బ్రతుకంతా చేదు!!
కొన్ని పూలు కోసి
మకరందాన్ని తీసుకున్నాను
రేపు నా కలలకు అద్ది
కొన్ని కవితలు రాయాలిగా!
-దండమూడి శ్రీచరణ్
98661 88266