పడిపోతున్న అస్తిత్వాన్ని నిలబెడుతూ..
పొరల్లో దాగిన జాతి నాగరికతను పునర్నిర్మిస్తూ..
పల్లెకు ప్రకృతికి.. మట్టికీ మనిషికీ నడుమ
కనుమరుగవుతున్న ఆత్మీయతను రంగరించే నా నేల..
ఆత్మగౌరవాల పురిటి గడ్డ..!
బోనాలు, పీర్ల పండుగ అలైబలైల
సంస్కృతి ఆత్మపరాగమై అల్లుకొని
నవజీవన పథంలో అత్తరు చిరునవ్వుల జల్లయిన నేల ఇది..
శాతవాహనుల తేజం, కాకతీయుల పరాక్రమం,
గోల్కొండ, వెలమరాజుల సాహితీ రసపోషణ
చరిత్ర పుటల్లో కోహినూర్ జాజ్వల్యదీప్తియైన జ్ఞానభూమి
యాసభాషల కళాత్మక వైభవం
ప్రపంచ వారసత్వ సంపదలను నిలుపుకొన్న రాచఠీవి
తటాకాల చలివేంద్రమై.. ఉరకలెత్తే వాగూ వంకలతో
హోయలు పోయే మా సాహిబా తెలంగాణ
నిజాంల పీడన.. గడీల క్రౌర్యాన్ని
అణగదొక్కిన అగ్నిశిఖ తెలంగాణ..!
పట్నాలు, పర్వణీలు, జాతరల సంబురాలలో
హత్తుకొన్న పెద్దాయి ఆత్మీయ కౌగలింతేగా నా తెలంగాణ..!
ఆదివాసీ మూలాల పచ్చివాసన..
గోండు బిడ్డల ఆకుపచ్చని పొద్దుల మేళవింపులలో..
తీరొక్క పూల సింగిడీగా.. తంగేడుపూల
స్నిగ్థ సౌందర్యరూపమై వెలిగిపోతున్న..
ఈ నేల దారెంబడి నేను అంకురమై సదాచిగురులు వేస్తుంటా..!
జాజులు పులుముకున్న తీనెల
గుడిసెపై విచ్చిన గుమ్మడి పూవునై
సముజ్వల తెలంగాణ వైభవ
దీప కళికలను దశదిశలా ప్రభవిస్తా…!
బి.కళా గోపాల్
94416 31029