అట్లెందుకు అని అనాలంటే
ఎట్లనాలో తెలియజెప్పగలగాలి
ఆర్కిమెడిస్ చెప్తేనే తెలిసెనా గాని
బొక్కెన మునిగి తేలినట్టు
మనదైన చైతన్యం విప్పారాలి
ఇంటోళ్లు ముసలి గుండె తడి తుడవనప్పుడు
ఆసరా రెండువేలు చలువ పందిరైంది
భావ కోశం నిండినట్టు
గౌచనకుట్టి ఏకిన పత్తిని పెట్టినట్టు
మెత్తగా మొత్తంగా జన్మ చరితార్థత
అంతా అమ్మ ఒడి పథకమైంది
బాట ఒకటి దగ్గర ఒకటి దూరం
ఆరుగాలం మట్టి ధ్యాసే
బువ్వకుండ ఒట్టిపోకుండా
రైతుబంధు పావురంగా ఎగిరొచ్చే
కట్టుబాట్లు కన్నీటి తెరల దోబూచులాటలే
ఓదార్చే చేతులు షాదీ ముబారక్ చెప్తున్నవి
కల్యాణ లక్ష్మీ అంటూ కరచాలనం చేస్తున్నది
గోడకు కొట్టిన బంతి చేతి ఆట
గృహ లక్ష్మీ పథకమో ఆరోగ్య మహిళనో
అమ్మలందరి కమ్మదనమయ్యింది
రోదసి నౌక కక్ష్యలో తిరిగినట్టు
మలుపు బిందువుల దగ్గర
కొత్త రాగం ఎత్తుకొని
దళిత బంధు పథకమై
సమసమాజ రాగానికి పల్లవెత్తింది
నిజాలు కల్పిత విచిత్రాల హేలలు కావు
కంట్లో ఒత్తేసుకున్న కాలరీతి మారి
చేతివృత్తుల కళాధామమై
గ్రామ జ్యోతిని వెలిగిస్తున్నది
ఏ పల్లె గాలిని పీల్చినా
మన ఊరు మనబడి గుబాళింపులే
మనుషులంటే మట్టి అని
ఈ నేల మురిపె మైనట్టు
దూపదీర్చే జలం లా
నాయకుడు ఒక్కడు
జీవ శతాబ్ద మగ్నుడౌతాడు
యజ్ఞ మవుతాడు
కడలి తళతళల పై
నడిచొచ్చే నవనీత మిది
మన్నికగల వెన్న ఇది
మునగకుండా తేల్చే
ప్లవన సూత్రం ఇది.
-డాక్టర్ కొండపల్లి నీహారిణి