నేను తోడుంటే
పుడమంతా నీకు
చల్లని నీడ నిస్తుంది..
నాలోకి తొంగి చూస్తే
విశ్వమంతా అక్షరాలు అక్షరాలుగా
అలరారుతుంది
నన్ను కొల్లగొట్టిన వాడే ఋషి
నన్ను దోచుకున్న వాడే యోగి
ఎంత దోచుకున్నా
తరగని నిధిని నేను
హృదయ మేఘాలు
సంతోషంతోనో , దుఃఖంతోనో
బరువెక్కి, కరిగి కురిసిన
అక్షరాల చినుకులను
పదాల కాలువలను
వాక్యాల చెరువులను
కావ్యాల నదులను
ఒడిలో దాచుకొని
మేధో క్షేత్రాలను
సస్యశ్యామలం చేస్తాను నేను
నేను జగతిని
ఆడిస్తాను, పాడిస్తాను.
నవ్విస్తాను, ఏడిపిస్తాను.
నేనొక శాస్త్రం
నేనొక చైతన్యం
నేనొక ఆయుధం
నేనొక విప్లవం
నేనొక శాంతి మంత్రం
నేనొక జీవనది
ఊరూరా నా
ప్రతి రూపాలను ప్రతిష్ఠించండి..
నాకు జై కొట్టండి.. కోటి పరిమళాల
ఉద్యానవనమై విరబూస్తాను
-చిక్కొండ్ర రవి