జీవితమనే బాట ముళ్లు లేకుండా
సాఫీగా సాగితే అది జీవితమెందుకైతది
అదంతా తెల్లవారుజామున
వచ్చే ఉత్తుత్తి కలగానే మిగిలిపోతది
జీవితమన్నాక అప్పుడప్పుడు ఛీ ఛీ అనే చీదరింపులు
మూతి మీద ఉమ్మిచ్చే చేదు మాటలు
నీవు లేనప్పుడు కూసే జొల్లు కూతలు
ఉండి తీరాల్సిందే ఈ రంగులెలిసిపోయే జీవితాన
నువ్వు ఎదురొస్తే తల తిప్పుకొనే వాడుండాలి
నువ్వున్న కాడ మూతి మురుగబెట్టి
ముఖమంతా గంభీరం చేసి నువ్వంటే పడనోడు
ఒక్కడైనా ఉండాల్సిందే
నిన్నస్సలు దగ్గరికి రానియ్యనివారున్నప్పుడే
జీవితపాఠం కొద్దిగానైన అర్థమైతది
నీవు ఉపాసముండి పేగులు నకనకలాడుతున్న
బుక్క బువ్వ దొరకని దినాన్ని ఒక్కనాడైనా ఎదుర్కోవాలి.
నెత్తిన మట్టి గంప మోస్తుంటే
కాలికి తుమ్మ ముల్లు గుచ్చుకొని బాధపడ్తుంటే
పక్కకు జరిగిన సుట్టకుదురును సరిచేయడానికైనా
ఎవ్వడు రాకపోతేనే రాలిన
నీ కన్నీటి చుక్క నీకు గుణపాఠమౌతుంది
జేబులో రూపాయి లేకుండా
సంతకు బోయి ఉత్త సేతులతో తిరిగొస్తే
పిల్లలు ఉత్త సంచిని చూసి
దుఃఖించిన పొద్దును ఒక్కనాడైనా చూడాలి.
జీవితమన్నాక అన్నీ అనుభవించాలె
మన్నును బుక్కి పెరగన్నం తిన్నట్లు
మూతి తుడుసుకోవాలి.
నీ కంటిచూపులతో అనుకున్న పనులన్నీ జరిగిపోతే
ఇక నువ్వు నేర్చుకున్న పాఠం పేరు
పెద్ద గుండు సున్ననే అయితది.
నీవు మూటల్ని నెత్తికెత్తుకొని
సంకకు సన్నపిల్లల్ని కర్సుకొని
పొలిమేర దాటి పోయేటప్పుడు
ఒక్కడైనా నీ వెంట రానిరోజే
నువ్వు అసలైన జీవితపాఠం నేర్చినట్లు..
-అవనిశ్రీ
99854 19424