యాస మనదే, భాష మనదే
యాపచెట్టూ శ్వాస మనదే
గెలుపు మనదే, మలుపు మనదే
పాలపిట్టల పిలుపు మనదే
జంకులేని జింక పిల్లల
ఎర్ర రకతపు నల్లరేగడి
గొంతులేపే చిన్న పిల్లల
చేతలల్ల పచ్చ తంగెడి
బాంచన్ అంటూ, బిచ్చమంటూ
ఎంటవడ్డ రోజు గాదిది
దొరవు నువ్వే, పరువు నువ్వే
కరువు నెట్టే, ఎరువు నువ్వే
కొలువులంటూ, పదవులంటూ
కాళ్లనొప్పుల తిప్పలెందుకు?
సొంత కొలువుల వింతలెన్నో
గంతులేసెను సూడరా!
కొలత లేని కొరతలెన్నో
కళ్లముందే లాక్కపోతిరి
కలత చెందిన రైతు కనులకి
కలువ వెలుగులు కానచ్చెరా!
నీరు మనదని, ఊరు మనదని
కొట్టుకెళ్లెకాలమాయిది?
బతకనిచ్చే, బతుకునిచ్చే
బతుకమ్మ తల్లిమట్టిరా!
ఒకటి కాదు, రెండు కాదు
సిరా సుక్కలు సాలడానికి
లెక్కలేని సౌలతుల చెట్టుకు
నీళ్లు బోయరా సోదరా!
-కరాశ్రీ (మండ శ్రీకర్)
77998 13109