మట్టి పగుళ్ళ మధ్య నుంచి కూడా
మొక్కలు చిగురిస్తాయి
రాతి సందుల్లోంచి కూడా
గడ్డిపోచలు
నిటారుగా నిలబడుతాయి
తొక్కి నడిచే సంస్కృతి
మనిషి పొదిలో ఉన్నంతకాలం
కొన్ని బంతులు
యథాస్థానం చేరుతుంటాయి
తోడిచ్చే చేతికి
తాడేసి కట్టేసే కాలం
పడగవిప్పినా కూడా
పెట్టే సంకల్పం ముందు ఎన్నో
అపశృతులు మోకరిల్లుతాయి
గూడు పదిలమై
తోడు నీడ శాశ్వతమై
విస్తరించుకు పోయినంత కాలం
ఆపే కుయుక్తికి నూకలు చెల్లుతాయి
ఎన్ని ఆనకట్టల్ని
అడ్డంగా నిర్మించి కూర్చున్నా
నిఖార్సయిన కర్తవ్యానికి ఏ కట్టడాలు
అడ్డుగోడలు కానేరవు
అభివృద్ధి వృద్ధి చెందుతూ
నిష్పక్షపాతం ధ్వజస్తంభమై
నిలబడినంతకాలం
అడ్డు పుల్లల విన్యాసాలు
ఏ భంగిమలు ఆకర్షింపబడవు
ఎదిగే చెట్టుకు
ఎన్ని రాళ్ల దెబ్బలు పడినా
ఆకు రాలునుగానీ
మొదలు వాలిపోదు
చిగురిస్తూనే వుంటుంది
మంచి సంకల్పం బలంగానే వుంటుంది
-నరెద్దుల రాజారెడ్డి
96660 16636