ఆ ఇంట్లో తరాల అనురాగ స్వరాల
ధునులున్నాయి.
వరండాలో
తాతయ్య పంచిన త్యాగాల గుర్తులున్నాయి.
ప్రేమ రూప నిలువెత్తు
జ్ఞాపకాలున్నాయి.
ఆ ప్రాంగణంలో అత్తయ్యలు తిరుగాడిన
గజ్జెల సవ్వడులున్నాయి.
వాళ్ళ చిట్టిచేతులతో
నాటిన పూలచెట్ల పరిమళాలున్నాయి.
నాన్నమ్మ పండుగలను
అలంకరించిన ఎర్రమట్టి పట్టెలున్నాయి.
చెరగని చిరునవ్వుల ముగ్గులున్నాయి.
జామపళ్లు తీపి గాలులున్నాయి.
మనుమండ్లు, మనుమరాండ్లు
గోడలపై బొగ్గులతో దిద్దిన ఓనమాలు
తరాలు గడుస్తున్నా…
ఇంకా లే లేతగా పసితనాలను
గుబాళిస్తునే ఉన్నాయి.
గోడ వారన విరిగిన నాగళ్ళు
చిలక్కొయ్యకు వేలాడే చీకిపోయిన
మోకులు పగ్గాలు
కాడి మేడి పాడుబడిన పసుల కొట్టం
ఆ తరం వెలుగును పాడుతూనే ఉన్నాయి.
నాన్న, చిన్నాన్న, అత్తయ్యల
పెండ్లిండ్లు పురుళ్లు పుణ్యకార్యాలు
ఒకటేమిటి ఆ ఇల్లు మట్టి గోడలతో
శిథిలమైన ఒట్టి రూపం కాదు.
తరాల సాంస్కృతిక సంపదకు నిలయం
ఆ ఇల్లు వొట్టి రూపం కానే కాదు.
-గరికపాటి మణీందర్
99483 26270