దూపదీరిన భూమి దూసిముడిసి కొప్పువెట్టింది
వేన వేల పూలు సింగారిచ్చి…
తరతరాల దుఃఖాలు తరలి వెళ్లి
పల్లెదారుల వెంట తల్లి నడచివచ్చింది
దుమ్మువట్టిన మట్టి పాదాలకు
బంగారు తంగేడు బతుకమ్మ ఎదురైంది
గంగమ్మను ఎదల నింపుకొని
గంగాళమై తళుక్కుమన్నది
గండగరువుల ఊరిసెరువు!
కాకతీయ వైభవాన్ని చాటి
రామప్పగుడి ముందు నిలబడి
మీసాలు మెలేసి ముసినవ్వుల
సందమామలయిండ్రు
గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు
ఈ నేలకు నమస్కరించి…
మరోసారి భగీరథుడు తపోదీక్షను
సాధించుకున్నడు
అలల పడవ మీద ఆడింది పాడింది
గంగ తరలివచ్చి వేగంగా
నిట్టాడుకు గట్టిన సీరె ఉయ్యాలల
కనులు తెరిచిన పాప
కిలకిలమని నవ్వింది కడునమ్మకంగా
గుండెల మీద కుంపటయిన ఆడపిల్ల
పంచపూల రాణిగా మారి
రథం మీద ఊరేగుతున్నది
దిక్కులేని ముసలితనం
సూరునీడ కింద దరి దొరికి సేదదీరుతున్నది
అప్పుడు… సావుకారి అప్పుల్లో మునిగి
సావు మిత్తి పాలైన రైతు
ఇప్పుడు… సింగిడి రుమాలు జుట్టి
సగర్వంగా తలెత్తుకుంటున్నడు
కల్లంల బంగారు ధాన్యరాశి ముందు నిలబడి
ఊరిపొలిమేరల్ల నాటిన పసి మొలకలు
తోరణాల చిలకలై పలకరిస్తయి
పోశమ్మ గుడిముందు పోసిన బెల్లం సాక
నిండుబోనం మీద గండదీపమై ఇంటికొస్తది
కదం కదం కలిసి కదనాన నడిచిన జనపథం
కరదీపికలై సాగుతున్నది కాలంతో పోటీపడి
నాడు కనుల జారిన కన్నీరు
కాల్వలై పారిన నెత్తురూ చెమట…
నేడు పచ్చని పంటచేనై పలవరిస్తున్నది
ముసిరిన నల్లమబ్బుల మొగులు మురిసిపోయి
చల్ల చల్లని వాన చినుకులై కురుస్తున్నది…
-తైదల అంజయ్య
98668 62983