పొట్టకొచ్చిన వరిచేను ఈ నేల ముఖచిత్రం
ఉమ్మెత్త వనాల నీడల్లో బతుకు
గుత్తులు గుత్తులుగా కలల్ని ముడుపులు కడుతున్నది
మొండిదైన చెట్టు ఇప్పుడు
కొమ్మలతో పచ్చటి చప్పట్లు కొడుతున్నది
రందితో రోగాల పాలైన ముసలితనం
కోకిల గొంతులో రాగాలు తీస్తున్నది
పగుళ్ళ నేల మీద
పరుగులు పెడుతున్న ఆరుద్రలు దృశ్య సంబురం
మొస తీసిన చెరువులన్నీ తామరలతో నిండి
నవ్వుల పొగలో మెరిసిపోతున్నవి
వట్టిదని అందరూ ఎక్కిరిచ్చిన నేల
ఊగుతున్న మక్కజొన్న చేను పాట
వలస కళేబరాలు వరుస పాడ్లైన చోట
వసంత ప్రవాహాల కాలువలు
దుఃఖాలు పల్లెను విడిచిపోయినై
సుఖాలు ఇల్లు అలికి ‘కొత్త’పెట్టుకుంటున్నై
అలికిన ఎర్రమట్టి సువాసన ఊరంతటికి పండుగ పిలుపు
యవ్వనం పరిమళిస్తున్న మల్లెపూవు ఈ వేళ
నవ్వులపాలైన చోట కిన్నెర నాదాలు
గూడు బతుకుకు గుండెకాయ
నిరంతర మనిషి ఛాయ
ఉట్టిగనే రాలిపోయే మెత్తిన ఇల్లుకాదు తెలంగాణ
వరద నురుగుల చంద్రహార కాంతి
విరిసిన నవ్వుల కోలాటం
మురిసిన తనువుల దశాబ్దాల ఆరాటం
ఆకాశం నిండా అమరుల రూపు నింపుకున్న
మేఘాలు కలల చినుకుల్ని కురిపిస్తున్నాయి.
జల బంధం
జన సంబంధం
కాళేశ్వరం తెలంగాణ సిగలో మొగిలిపువ్వు సౌందర్యం
– వేముగంటి మురళి, 96765 98465